గాయకుల నాయకుడికి, యెదూతూన్‌కోసం. దావీదు కీర్తన.
39
1 ✽✽నేను ఇలా అనుకొన్నాను:“నా మాటలలో తప్పిదం చేయకుండా నా జీవిత
విధానాన్ని జాగ్రత్తగా చూచుకుంటాను.
దుర్మార్గులు దగ్గర ఉన్నప్పుడు నా నోటికి
చిక్కం పెట్టుకుంటాను.”
2 ✽నేను మౌనం వహించి ఊరుకొన్నాను.
మంచి సంగతులు కూడా మాట్లాడలేదు.
కాని, నా బాధ అధికతరమైంది.
3 నాకు గుండెలో మంట రగులుకొంది.
తలపోసుకుంటూ ఉంటే తాపం ఎక్కువైంది.
అప్పుడు నోరు తెరచి మాట్లాడాను.
4 ✽యెహోవా! నా అంతం గురించి
నాకు తెలియజేయి.
నేనెంతకాలం బ్రతుకుతానో,
ఎప్పుడు గతించిపోతానో
తెలుసుకోవాలని ఉన్నాను.
5 నా బ్రతుకును నీవు బెత్తెడంతగా చేశావు.
నేను జీవించేకాలం నీ దృష్టిలో ఏమీ లేనట్టే!
మనిషి అన్న తరువాత అతడు కేవలం
ఊపిరిలాగా ఉన్నాడు అంతే! (సెలా)
6 అటూ ఇటూ తిరుగాడే మనుషుల ఉనికి
నీడలాంటిదే.
సందడిగా ఉన్నవాళ్ళు ప్రయత్నాలన్నీ గాలి మాత్రానికే!
మనిషి ధనం పోగు చేస్తాడు గాని
అది ఎవరి పాలవుతుందో తెలియదు.
7 ✽✝ప్రభూ! నేను దేనికోసం ఎదురు చూస్తున్నట్టు?
నా ఆశాభావం నీలోనే!
8 ✽నా అతిక్రమ కార్యాలన్నిటినుంచీ నన్ను విడిపించు.
బుద్ధీ భక్తీ లేనివాళ్ళ ఎదుట నన్ను నిందలపాలు
కానియ్యకు.
9 ✽జరిగినదానిని నీవే జరిగించావు గనుక
నా నోరు తెరవకుండా మౌనం వహిస్తున్నాను.
10 ✝నన్ను దెబ్బలు కొట్టడం మానుకో.
నీ చేయి చేసిన గాయాలవల్ల
నేను చచ్చిపోతున్నాను.
11 పాపాల కారణంగా నీవు మనిషిని
చీవాట్లు పెట్టి శిక్షిస్తావు✽.
చిమ్మటలు✽ బట్ట కొట్టినట్టు నీవు అతడి
ప్రియమైన వాటిని చెడగొట్టివేస్తావు.
మనిషి అన్న తరువాత అతడు కేవలం ఊపిరిలాగా
ఉన్నాడు అంతే! (సెలా)
12 యెహోవా, నా ప్రార్థన విను!
నా మొర చెవినిబెట్టు!
నా కన్నీళ్ళు✽ చూచి ఊరుకోబోకు.
నేను నీ అతిథిని.
నా పూర్వీకులందరిలాగే నేనూ పరదేశిని✽.
13 ✽ ఇంకా నామీద దృష్టి మరలించుకో!
నేను లేకుండా పొయ్యేముందు నాకు సంతోషం
కలగనియ్యి.