జ్ఞాపకం కోసం, దావీదు కీర్తన.
38
1 యెహోవా, నన్ను కోపంతో మందలించకు.
ఆగ్రహంతో నన్ను శిక్షకు గురి చెయ్యకు.
2 నీ బాణాలు నాకు బాగా గుచ్చుకున్నాయి.
నీ చేయి నా మీదికి వచ్చి ఉంది.
3 నీ కోపం నా శరీరారోగ్యాన్ని హరించివేసింది.
నా దోషం వల్ల నా ఎముకల్లో క్షేమం
లేకుండా పోయింది.
4 నా అపరాధాలు నా తలను మించిపొయ్యాయి.
అవి నాకు మించిన బరువనిపిస్తుంది.
5 నేను మూర్ఖంగా ప్రవర్తించాను.
అందుకే నా గాయాలలోనుంచి దుర్వాసనతో
చీము కారుతుంది.
6 నేను మెలిదిరిగిపొయ్యాను, బాగా వంగిపొయ్యాను.
రోజంతా దుఃఖంతో తిరుగులాడుతున్నాను.
7 నా నడుములో మంట నిండి ఉంది.
నా శరీరారోగ్యం క్షీణించింది.
8 నా ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయింది, నలిగిపోయింది.
హృదయ బాధవల్ల నేను మూలుగుతున్నాను.
9 ప్రభూ! నేను కోరేదంతా నీకు బాగా తెలుసు.
నా నిట్టూర్పులు నీకేమీ మరుగు కాదు.
10 నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది.
నాలో ఉన్న బలం హరించుకుపోయింది.
నాకు కళ్ళలో కాంతి లేకుండా పోయింది.
11 నా ప్రేమికులూ మిత్రులూ నా ఆపద చూచి
దూరమయ్యారు.
నా బంధువులు కూడా దూరంగానే నిలుచున్నారు.
12 నా ప్రాణం తీయాలని చూచేవాళ్ళు వలలు
పన్నుతున్నారు.
నాకు కీడు చేయాలని చూచేవాళ్ళు శాపనార్థాలు
పలుకుతున్నారు.
రోజంతా అదే పనిగా కుట్రలు చేస్తున్నారు.
13 నేనేమీ వినలేను. చెవిటివాడిలాగా అయ్యాను.
మాట్లాడలేని మూగవాడిలా అయ్యాను.
14 విననివాడిలాగా, ఎదురు పలకలేనివాడిలాగా ఉన్నాను.
15 యెహోవా! నీ కోసమే ఎదురు చూస్తూవున్నాను.
ప్రభూ! నా దేవా! నీవు జవాబిస్తావు.
16 నేనిలా అనుకున్నాను:
“నా కాలు జారి, నేను పడబోతుంటే
వాళ్ళు నన్ను చూచి రెచ్చిపోకూడదు,
సంతోషించకూడదు.”
17 నేను తొట్రుపడనై ఉన్నాను.
నా బాధ ఎప్పుడూ నాతో ఉంది.
18 నా అపరాధం నేను ఒప్పుకొంటున్నాను.
నా దోషం వల్ల కంగారుపడుతున్నాను.
19 నా శత్రువులు బలిష్ఠులు. తీవ్రంగా ఉన్నారు.
నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు అనేకులు.
20 మంచికి చెడు చేయడమే వాళ్ళ పని.
మంచినే చెయ్యాలని చూస్తున్నాను నేను.
గనుక వాళ్ళు నన్ను ఎదిరిస్తున్నారు.
21 యెహోవా! నన్ను వదలివేయకు!
నా దేవా! నాకు దూరమైపోకు!
22 నా రక్షణ నీవే, స్వామీ!
త్వరగా నా సహాయానికి రా!