దావీదు కీర్తన
37
1 ✽దుర్మార్గులను గురించి కంగారుపడకు.చెడుగు చేసేవాళ్ళను గురించి అసూయపడకు.
2 ✽త్వరగానే గడ్డి ఎండిపోతుంది,
పచ్చని మొక్క వాడిపోతుంది.
వాళ్ళ సంగతి కూడా అంతే.
3 ✽యెహోవా మీద నమ్మకం ఉంచి మంచిని చేస్తూ ఉండు.
ఈ దేశం✽లో నివసించి విశ్వసనీయతను అలవరచుకో.
4 ✽ యెహోవాలోనే నీ ఆనందాన్ని కనుక్కో
అప్పుడాయన నీ హృదయాభిలాషలను ప్రసాదిస్తాడు.
5 ✽ యెహోవాకు నీ జీవిత యాత్రను అప్పగించు.
ఆయనమీద నమ్మకం ఉంచుకో.
అప్పుడు చేయవలసినది ఆయన చేస్తాడు.
6 ✽నీ న్యాయం ఆయన మూలంగా వెలుగులాగా
తేటతెల్లం అవుతుంది.
నీ యథార్థ ప్రవర్తనను మధ్యాహ్న కాంతిలాగా
ప్రకాశింపజేస్తాడాయన.
7 ✽యెహోవా సమక్షంలో ప్రశాంతంగా ఉండు.
ఆయనకోసం ఓర్పుతో ఎదురు చూడు.
తమ సొంత జీవిత విధానాన్ని అనుసరించి
వర్ధిల్లేవాళ్ళను గురించి, పన్నుగడలు
సాధించేవాళ్ళను గురించి కంగారుపడకు.
8 కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు.
కంగారుపడకు, అది చెడుగుకు దారి తీస్తుంది.
9 ✽చెడుగు చేసేవాళ్ళు నాశనమైపోతారు.
యెహోవా కోసం నమ్మకంతో ఎదురు చూచేవారే
ఈ దేశానికి వారసులు
10 ఇంకా కొద్ది కాలానికే దుర్మార్గులు అంతరిస్తారు.
వాళ్ళ స్థలమంతా గాలించినా వాళ్ళు కనిపించరు.
11 కానీ సాధుగుణం గలవారు ఈ దేశాన్ని
స్వాధీనం చేసుకొంటారు.
వారు గొప్ప క్షేమం అనుభవిస్తూ,
ఆనందభరితులవుతారు.
12 ✽ దుర్మార్గులు సన్మార్గులమీద కుట్ర పన్నుతారు.
వారిని చూచి పళ్ళు పటపట కొరుకుతారు.
13 ✝ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతున్నాడు
వాళ్ళ మరణ దినం వస్తుందని
ఆయనకు తెలుసు.
14 ✽దుర్మార్గులు కత్తి దూశారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు.
దీనదశలో, అక్కరలో యథార్థ ప్రవర్తన గలవారిని
హతమార్చాలనీ వాళ్ళు చూస్తున్నారు.
15 ✝వాళ్ళ కత్తి వాళ్ళ గుండెల్లోనే దూరుతుంది.
వాళ్ళ విండ్లు తుత్తునియలవుతాయి.
16 ✽న్యాయవంతులకు ఉన్నది కొంచెమే అయినా,
అది అనేకమంది దుర్మార్గుల సంపదకంటే మంచిది.
17 ఎందుకంటే దుర్మార్గుల చేతులు విరిగిపోతాయి
గాని సన్మార్గులకు యెహోవా ఆధారం✽.
18 ✽నిర్దోషుల రోజులన్నీ యెహోవాకు తెలుసు.
వారి వారసత్వం ఎప్పటికీ ఉంటుంది.
19 ✝చెడు కాలంలో వారికి ఆశాభంగం కలగదు.
కరవు రోజుల్లో వారు తృప్తిగా ఉంటారు.
20 దుర్మార్గులైతే నాశనం అవుతారు.
యెహోవా శత్రువులు పచ్చిక మైదానాల
అందంలాగే మాయమైపోతారు.
21 ✝దుర్మార్గులు అప్పు చేస్తారు గాని అప్పు తీర్చరు.
సన్మార్గులు దయ చూపుతారు, దానం చేస్తారు.
22 ✝యెహోవా దీవించినవారు దేశాన్ని స్వాధీనం
చేసుకొంటారు.
ఆయన శపించినవాళ్ళు నాశనమవుతారు.
23 ✝యెహోవా ఏ మనిషి నడతను రూపొందిస్తాడో
ఆ మనిషి మార్గం ఆయనకు ఎంతో ఇష్టం.
24 ✽ ఒకవేళ అతడు పడిపోయినా యెహోవా అతణ్ణి
చెయ్యి పట్టుకొని ఉంటాడు,
గనుక అతడేమీ కుప్పకూలిపోడు.
25 ✽పూర్వం నేను చిన్నవాణ్ణి. ఇప్పుడు ముసలివాణ్ణి.
న్యాయవంతులు దిక్కూ దరీ లేకుండా
మిగిలిపోవడం గానీ,
వారి సంతానం తిండికోసం అడుక్కోవడం గానీ
నేనెప్పుడూ చూడలేదు.
26 వారు నిత్యం దయ చూపుతారు, అప్పిస్తారు.
వారి సంతానానికి దీవెనలు కలుగుతాయి.
27 ✽చెడుగునుంచి తిరిగి, మంచిని చేస్తూ ఉండు,
అప్పుడు శాశ్వతంగా బ్రతుకుతావు.
28 ✽ యెహోవా న్యాయవంతులను ప్రేమిస్తున్నాడు.
తన భక్తులను చెయ్యి విడువడు.
వారిని శాశ్వతంగా కాపాడుతాడు.
కాని, దుర్మార్గుల సంతానం నాశనమవుతారు.
29 సన్మార్గులు దేశానికి వారసులు.
వారు అందులో ఎల్లకాలం నివసిస్తారు.
30 ✽సన్మార్గుల నోళ్ళు జ్ఞానంతో మాట్లాడుతాయి.
వారి నాలుకలు న్యాయ సమ్మతంగా పలుకుతాయి.
31 వారి హృదయాల్లో దేవుని ఉపదేశం ఉంది.
కాలు జారకుండా నడుస్తారు వారు.
32 దుర్మార్గులు సన్మార్గుల కోసం దారి కాస్తారు.
వారిని హత్య చేయాలని చూస్తారు.
33 యెహోవా వారిని వాళ్ళ చేతిలో విడిచిపెట్టడు
తీర్పులో వారిని దోషులుగా ఎంచడు.
34 ✽యెహోవాకోసం ఎదురు చూస్తూ ఉండు.
ఆయన మార్గం అనుసరించు.
నీవు దేశం స్వాధీనం చేసుకొనేలా
ఆయన నిన్ను పైకి ఎత్తుతాడు.
నీ కళ్ళెదుటే దుర్మార్గులు నాశనమైపోతారు.
35 ✽దుర్మార్గుణ్ణి, దౌర్జన్యపరుణ్ణి ఒకణ్ణి చూశాను.
స్వస్థలంలో పెరిగే పెద్ద చెట్టులాగా అతగాడు
మరీ పెచ్చు పెరిగిపోయాడు.
36 అంతలోనే ఎవడో ఆ దారిన వెళ్ళి చూస్తే
అతడు మాత్రం లేడు.
వాడికోసం వెదికాను. వాడు కనబడలేదు.
37 ✝న్యాయవంతులెవరో గుర్తించు.
నిజాయితీపరులెవరో కనిపెట్టి చూడు.
శాంతి ప్రియులకు భవిష్యత్తు ఉంది.
38 కాని, అతిక్రమకారులంతా నశిస్తారు.
దుర్గార్గుల సంతానానికి భవిష్యత్తు లేదు.
39 సన్మార్గులకు విముక్తి✽ యెహోవా మూలంగానే,
ఆపద సంభవిస్తే, ఆయనే వారికి బలమైన
కోట✽లాంటివాడు.
40 యెహోవా వారికి సహాయం చేస్తాడు,
వారిని రక్షిస్తాడు,
దుర్మార్గుల బారినుండి తప్పిస్తాడు,
విముక్తి ప్రసాదిస్తాడు.
ఎందుకంటే వారు ఆయన్నే ఆశ్రయించారు✽.