గాయకుల నాయకుడికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
36
1 ✽తన అతిక్రమ క్రియలే దుర్మార్గుణ్ణి గురించిహృదయంలో నుంచి మాట్లాడుతాయి.
అతడికి దేవుడంటే అసలు భయమే✽ లేదు.
2 ✽ఎలాగంటే, దేవుడు అతడి అపరాధం కనిపెట్టి
అసహ్యించుకోడు గదా అని అది అతడి
కళ్ళెదుటే అతణ్ణి పొగడుతుంది.
3 అతడి నోట కల్లబొల్లి మాటలు వెలువడుతాయి.
అందులో ఎంతో కపటం ఉంది.
అతడు తెలివిగా ప్రవర్తించడం, మంచి చెయ్యడం
మానివేశాడు.
4 పడకపై కూడా మాయోపాయాలు
పన్నుతూ ఉంటాడు.
అతడు అవలంబించే మార్గం బాగా లేదు.
చెడుగు అతడికి అసహ్యం అనిపించదు.
5 ✽యెహోవా! నీ అనుగ్రహం ఆకాశాలవరకు,
నీ విశ్వసనీయత అంతరిక్షంవరకు ఉన్నాయి.
6 ✽నీ న్యాయం బ్రహ్మాండమైన పర్వతాలలాంటిది.
నీ తీర్పులు అగాధ సముద్రాలలాంటివి.
యెహోవా! నీవు మనుషులనూ జంతుజాలాన్నీ
సంరక్షిస్తావు.
7 ✽దేవా! నీ అనుగ్రహం ఎంతో విలువైనది.
మనుషులకు నీ రెక్కల నీడ ఆశ్రయం!
8 ✽నీ ఆలయంలో ఉన్న సమృద్ధివల్ల వారికి
సంతృప్తి కలుగుతుంది.
నీ ఆనంద ధారలు వారికి నీవు ప్రసాదించే పానీయం.
9 ✽జీవానికి మూలాధారం నీ దగ్గరే ఉంది.
నీ వెలుగులోనే మాకు వెలుగు గోచరిస్తుంది.
10 ✽నిన్ను ఎరిగిన వారిమీద
అనుగ్రహం చూపుతూ ఉండు.
అంతరంగంలో నిజాయితీ గల వారికి
నీ న్యాయాన్ని ఎడతెగకుండా కనపరచు.
11 గర్విష్ఠులు వచ్చి నా మీద పాదం మోపకుండా చెయ్యి.
దుర్మార్గుల చేయి నన్ను పారదోలకుండా చూడు.
12 ✽చెడుగు చేసేవాళ్ళు అరుగో అక్కడే పడి ఉన్నారు.
మళ్ళీ లేవకుండా వాళ్ళు దెబ్బ తిని
కుప్పకూలిపొయ్యారు.