దావీదు కీర్తన
35
1 ✽✽యెహోవా, నన్ను ఎదిరించే వాళ్ళను నీవుఎదిరించు.
నాతో పోరాడేవాళ్ళతో పోరాడు.
2 డాలు, కేడెం పట్టుకొని నా పక్షాన నిలిచి
సహాయం చెయ్యి.
3 ఈటె దూసి నన్ను తరిమేవాళ్ళను అడ్డగించు.
“నేనే నీ విముక్తి” అని నాతో చెప్పు.
4 ✝నా ప్రాణం కోసం కాచుకొని ఉన్న వాళ్ళకు సిగ్గూ,
తలవంపులూ కలుగుతాయి గాక!
నాకు హాని చేయడానికి కుట్ర పన్నేవాళ్ళు
వెనక్కు పడి ఆశాభంగం చెందుతారు గాక!
5 వాళ్ళు గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా
ఉంటారు గాక!
యెహోవా దూత✽ వాళ్ళను వెళ్ళగొట్టివేస్తాడు గాక!
6 ✝వాళ్ళ బాట చీకటిగా,
జారిపడే బాటగా అవుతుంది గాక!
యెహోవా దూత వాళ్ళను తరుముతాడు గాక!
7 ✽ఎందుకంటే నిష్కారణంగా నా కోసం
రహస్యంగా వల పన్నారు వాళ్ళు.
నిష్కారణంగా నా ప్రాణానికి గుంట తవ్వారు.
8 ✽తెలియకుండానే నాశనం అతడి పై
పడుతుంది గాక!
అతడు రహస్యంగా పన్నిన వలలో అతడే
చిక్కుపడుతాడు గాక!
అందులో అతడు పడి నాశనమైపోతాడు గాక!
9 ✽అప్పుడు నేను యెహోవా విముక్తిని గురించి
ఆనందిస్తాను.
ఆయన మూలంగా నాకు హృదయంలో
ఉల్లాసంగా ఉంటుంది.
10 నా ఎముకలన్నీ మాట్లాడుతాయి
“యెహోవా! నిన్ను పోలినవాడెవడు?
వారికంటే ఎక్కువ బలంగలవాళ్ళ చేతిలో నుంచి
బాధితులను తప్పిస్తావు,
వారిని దోచుకునేవాళ్ళ బారినుంచి బాధితులనూ
దరిద్రులనూ విడిపిస్తావు నీవు.”
11 దౌర్జన్యపరులైన సాక్షులు ముందుకు వచ్చి
నాకే తెలియనివి నన్ను అడుగుతున్నారు.
12 నేను చేసిన మేలుకు కీడు జరిగించి,
నన్ను దిక్కులేనివాడుగా చేసేవాళ్ళు.
13 ✽వాళ్ళకు జబ్బు చేసినప్పుడు నేను మాత్రం
గోనెపట్టలు కట్టుకొన్నాను.
ఉపవాసముండి నా ప్రాణాన్ని అణచివేశాను.
జవాబు లేకుండా నా ప్రార్థనలు నాకు తిరిగి
వచ్చినప్పుడు,
14 వాళ్ళు నాకు స్నేహితులుగా సోదరులుగా ఉన్నట్టే
మసులు కొన్నాను.
తల్లి మరణిస్తే ఏడ్చేవాడిలాగా శోకించి
క్రుంగిపోయాను.
15 కాని, నేను కుంటుతూ నడిస్తే, వాళ్ళు నన్ను
చూచి సంతోషంతో గుమికూడారు.
నాకు తెలియకుండానే నీచులు నాకు విరోధంగా
గుమికూడి అదే పనిగా నన్ను తిట్టారు.
16 విందులలో వేళాకోళం, దూషణం చేసే
భక్తిహీనులలాగా వీళ్ళు నావిషయం ద్వేషం
వెలిబుచ్చుతూ పళ్ళు కొరికారు.
17 స్వామీ, ఎన్నాళ్ళు ఇలా చూస్తూ ఊరుకొంటావు?
వాళ్ళు నా జీవాన్ని ధ్వంసం చేయకుండేలా నన్ను
రక్షించు.
ఉన్నది ఒకే బ్రతుకు.
దానిని ఆ సింహాల బారినుంచి తప్పించు.
18 మహా సమావేశంలో నీకు కృతజ్ఞత✽ చెప్తాను.
గొప్ప జనసమూహంలో నిన్ను స్తుతిస్తాను.
19 ✽అబద్ధికులైన నా శత్రువులు నా గురించి
సంతోషపడకుండా చెయ్యి.
నిష్కారణంగా నన్ను ద్వేషించేవాళ్ళు
కన్ను గీటకుండా చెయ్యి.
20 ఎందుకంటే, వాళ్ళు శాంతివాక్కులు పలకరు.
దేశంలో ప్రశాంతంగా బ్రతికేవారికి విరోధంగా
అబద్ధాలు కల్పిస్తారు.
21 నోరు పెద్దగా తెరచి నన్ను ఆడిపోసుకుంటూ
“ఆహాహా! అతడు చేసినది మా కళ్ళకు
కనబడింది లే” అన్నారు వాళ్ళు.
22 యెహోవా, నీవు ఇదంతా చూశావు గదా!
మౌనం వహించకు! నాకు దూరమైపోకు, స్వామీ!
23 నా దేవా, నా ప్రభూ, లే!
నాకు న్యాయం చేకూర్చు. నా పక్షాన నిలబడు.
24 యెహోవా! నా దేవా! నీ న్యాయబుద్ధిని
అనుసరించి నాకు న్యాయం జరిగించు.
నామీద వాళ్ళను ఉప్పొంగనియ్యకు.
25 వాళ్ళు మనసులో “ఆహా గెలిచాం!” అని
చెప్పుకోకూడదు.
“అతణ్ణి మింగేశాం!” అనుకోకూడదు.
26 నా ఆపద చూచి సంతోషపడే వాళ్ళందరినీ
సిగ్గు ఆవరించాలి.
వాళ్ళకు ఆశాభంగం కలుగుతుంది గాక!
నాకు వ్యతిరేకంగా గొప్పలు చెప్పుకొనేవాళ్ళను
సిగ్గూ, అగౌరవమూ కప్పివేస్తాయి గాక!
27 ✽నేను నిర్దోషిగా నిరూపించబడాలని
ఇష్టమున్నవారు సంతోషించి ఆనందధ్వనులు
చేస్తారు గాక!
“యెహోవా తన సేవకుడి సంక్షేమానికి ఎంతో
ఆనందిస్తాడు.
ఆయన కీర్తి అధికం కావాలి!” అని ఎల్లప్పుడూ
అంటూ ఉండాలి వారు.
28 నా నాలుక నీ న్యాయాన్ని గురించీ, నీ ప్రశంస
గురించీ సర్వదా మాట్లాడుతుంది.