దావీదు కీర్తన. అబీమెలెక్‌సమక్షంలో దావీదు వెర్రివాడిలాగా ప్రవర్తిస్తే అబీమెలెక్ అతణ్ణి వెళ్ళకొట్టాక అతడు ఇది వ్రాశాడు.
34
1 యెహోవాను అన్ని వేళలా కీర్తిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నాపెదవులపై ఉంటుంది.
2 యెహోవాలో నా ఆత్మ అతిశయిస్తుంది.
దీనదశలో ఉన్నవారు దీనిని విని సంతోషిస్తారు.
3 నాతో కలిసి యెహోవాకు మహత్తు
ఆరోపించండి.
ఏక స్వరంతో ఆయన పేరును కీర్తిద్దాం.
4 నేను యెహోవాను సమీపించి ప్రాధేయపడ్డాను.
ఆయన జవాబిచ్చి నా భయాలన్నిటిలోనుంచి
నన్ను తప్పించాడు.
5 వారు ఆయనవైపు చూచి ప్రకాశవంతులయ్యారు.
వారి ముఖాలు సిగ్గుతో కుంచించుకుపోవు.
6 దీనదశలో ఉన్న నేను మొరపెట్టినప్పుడు,
యెహోవా ఆలకించి అన్ని ఇక్కట్లలో నుంచి
నన్ను గట్టెక్కించాడు.
7 తన పట్ల భయభక్తులు గల వారి చుట్టూరా
యెహోవా దూత ఆవరించి ఉండి
వారిని రక్షిస్తాడు.
8 యెహోవా మంచివాడు.
ఆయన మంచితనాన్ని రుచి చూచి తెలుసుకో.
ఆయనను నమ్మి ఆశ్రయించిన మనిషి ధన్యజీవి.
9  యెహోవాకు చెందిన పవిత్రమైనవారలారా,
ఆయన పట్ల భయభక్తులతో ఉండండి.
ఆయనపట్ల భయభక్తులున్నవారికి కొరత అంటూ
ఏదీ ఉండదు.
10 ఏమీ దొరకక సింహం పిల్లలు ఆకలితో ఉంటాయి.
కాని, యెహోవాను వెదకి ప్రాధేయపడేవారికి
మంచివాటికి లోటు ఉండదు.
11  పిల్లలారా, వచ్చి నేను చెప్పేది వినండి.
యెహోవా పట్ల భయభక్తులు మీకు నేర్పుతాను.
12 నీవెవరైనా సరే, బ్రతుకు అంటే ఇష్టం ఉండి,
మంచిని చూడడానికి చాలా కాలం
బ్రతకాలని కోరితే,
13 నీ నాలుక చెడుగునుంచి కాపాడుకో.
నీ పెదవులు మోసంగా పలకకుండా కాపాడుకో.
14 చెడుగు నుంచి వైదొలగు. మంచినే చేస్తూ ఉండు.
శాంతిని వెదకు. దానిని వేటాడు.
15 యెహోవా దృష్టి న్యాయవంతుల మీద ఉంది.
ఆయన చెవులు వారి మొరలు వింటున్నాయి.
16 యెహోవా ముఖం చెడుగు చేసేవాళ్ళకు
విరోధంగా ఉంది.
వాళ్ళను గురించిన జ్ఞాపకం భూమిమీద లేకుండా
చేస్తాడాయన.
17 న్యాయవంతులు మొరపెట్టినప్పుడు యెహోవా
ఆలకిస్తాడు.
వారిని అన్ని ఇక్కట్లలోనుంచి వారిని
గట్టెక్కిస్తాడాయన.
18 విరిగిన హృదయులకు యెహోవా
దగ్గరలో ఉన్నాడు.
నలిగిపోయిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు.
19 న్యాయవంతులకు ఎన్నో ఆపదలు!
కాని, యెహోవా వాటన్నిటిలో నుంచి వారిని
తప్పిస్తాడు.
20 అతని ఎముకలన్నిటికి కూడా ఆయన వల్ల క్షేమం!
వాటిలో ఒకటైనా విరగదు.
21 చెడుగు దుర్మార్గులను సంహరిస్తుంది.
న్యాయవంతులంటే గిట్టనివాళ్ళకు నాశనం తప్పదు.
22 యెహోవా తన దాసులను విడుదల చేస్తాడు.
ఆయనను నమ్మి ఆశ్రయించినవారిలో ఎవరికీ
నాశనం అంటూ ఉండదు.