33
1 న్యాయవంతులారా!
యెహోవాకు ఆనంద ధ్వనులు చేయండి.
దైవసంస్తుతి చెయ్యడం నిజాయితీపరులకు
తగిన పని.
2 యెహోవాకు తంతివాయిద్యం వాయిస్తూ
కృతజ్ఞత అర్పించండి.
పది తంతుల వాయిద్యంతో ఆయనకు
స్తుతి పాటలు పాడండి.
3 ఆయనకు కొత్త కీర్తన ఆలపించండి,
నేర్పుతో వాయిస్తూ సంతోష నాదాలు చెయ్యండి.
4 ఎందుకంటే, యెహోవా వాక్కు యథార్థం.
ఆయన కార్యకలాపాలన్నిటిలోనూ నమ్మకంగా
ఉన్నాడు.
5 నీతి న్యాయాలంటే ఆయనకెంతో ఇష్టం.
యెహోవా అనుగ్రహంతో లోకమంతా నిండి ఉంది.
6 యెహోవా వాక్కు మూలంగా ఆకాశాలు కలిగాయి.
ఆయన నోటి శ్వాసచేత వాటి సమూహమంతా
కలిగింది.
7 ఆయనే సముద్రాన్ని జలరాశిగా రూపొందించేవాడు,
అగాధ జలాలను నిధిగా సమకూర్చేవాడు.
8 యెహోవాకు లోకమంతా భయపడాలి.
యెహోవా అంటే భూనివాసులంతా
భయంతో నిలవాలి.
9 ఎందుకంటే ఆయన మాట్లాడాడు, అలాగే జరిగింది.
ఆయన ఆజ్ఞాపించాడు, అలానే స్థిరంగా ఏర్పడింది.
10 జనాల సమాలోచనలను యెహోవా వమ్ము చేస్తాడు.
ప్రజల ఉపాయాలను భంగం చేస్తాడు.
11 యెహోవా ఆలోచనలు శాశ్వతంగా నిలుస్తాయి.
ఆయన హృదయ భావాలు తరతరాలకూ
స్థిరంగా ఉంటాయి.
12 యెహోవా ఏ ప్రజకు దేవుడుగా ఉన్నాడో
ఆ ప్రజ ధన్యజీవులు.
తన సొత్తుగా ఆయన ఎన్నుకొన్న ప్రజ
ధన్య జీవులు.
13 పరలోకంలో నుంచి యెహోవా వీక్షిస్తున్నాడు.
మనుషులందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు.
14 భూమి మీద ఉన్నవాళ్ళందరినీ తన నివాసం
నుంచి ఆయన చూస్తూవున్నాడు.
15 ఆయన వాళ్ళ హృదయాలన్నిటినీ
రూపొందించేవాడు.
వాళ్ళ కార్యకలాపాలన్నీ బాగా తెలిసినవాడు.
16 రాజుకు తన గొప్ప సేన రక్షణ కాబోదు.
వీరుడికి తన అధిక శక్తి విడుదల కాబోదు.
17 విజయానికి గుర్రం వ్యర్థం.
దాని గొప్ప బలంవల్ల మనిషికి విడుదల
చేకూరదు.
18 కాని, తన పట్ల భయభక్తులున్న వారిపై,
తన అనుగ్రహం కోసం నమ్మకంతో ఎదురు
చూచేవారి పై యెహోవా కన్ను వేసి
ఉంచుతాడు.
19 వారి ప్రాణాన్ని మరణంనుంచి తప్పిస్తాడాయన.
కరవు కాటకాలలో వారు చావకుండా చేస్తాడు.
20 మనం యెహోవాకోసం చూస్తూ ఉన్నాం.
ఆయనే మనకు సహాయం.
ఆయనే మనకు డాలులాంటివాడు.
21 ఆయన పవిత్రమైన పేరుమీద మనకు
నమ్మకం ఉంది.
గనుక ఆయనలో మనకు
హృదయానందం ఉంది.
22 యెహోవా! మేము నీకోసం ఆశాభావంతో
ఎదురుచూస్తున్న విధంగానే నీ అనుగ్రహం
మా మీద ఉండనియ్యి.