దావీదు కీర్తన. దైవధ్యానం.
32
1 ✽ దేవుడు ఎవరి అతిక్రమాలను క్షమించాడో,ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు.
2 యెహోవా ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో,
ఎవరి మనసులో కల్లాకపటం✽ లేదో
వారు ధన్యజీవులు.
3 నేను మౌనం✽ వహించినప్పుడు,
రోజంతా నా మూలుగుల వల్ల నా ఎముకలు
సన్నగిల్లిపొయ్యాయి.
4 రాత్రింబగళ్ళూ నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది.
వేసవి కాలంలో నీళ్ళు ఆరిపోయినట్టు
నాలో సారం ఇంకిపోయింది. (సెలా)
5 ✽ అప్పుడు నా పాపమేదో నీ దగ్గర ఒప్పుకొన్నాను.
నా అపరాధాన్ని నేనేమీ దాచిపెట్టుకోలేదు.
యెహోవా సమక్షంలో నా అతిక్రమాలను
ఒప్పుకుందామనుకొన్నాను.
నీవు నా అపరాధం, నా పాపం క్షమించావు.
(సెలా)
6 గనుక నీవు దొరికే సమయం✽ లో భక్తిగల
ప్రతి ఒక్కరూ నిన్ను ప్రార్థిస్తారు గాక!
నదులు పొంగి పొరలి వరదలు✽ వచ్చినా
అవి వారినేమీ చెయ్యవు.
7 ✽నేను దాగేస్థలం నీవే.
విపత్తునుంచి నన్ను కాపాడుతావు.
విడుదల పాటలతో నా చుట్టూరా
నీవు ఉంటావు. (సెలా)
8 ✽“నీవు ఎలా నడుచుకోవాలో నీకు చెపుతాను,
ఉపదేశిస్తాను.
నా కనుదృష్టి నీ మీద ఉంచి నీకు సలహా చెపుతాను.
9 నీవు గుర్రంలాగా, కంచర గాడిదలాగా
ప్రవర్తించకు.
వాటికి తెలివితేటలేమీ ఉండవు.
అవి దగ్గరికి రావాలంటే వాటిని కళ్ళెంతో,
పగ్గంతో వశం చేసుకోవాలి.”
10 దుర్మార్గులకు✽ ఎన్నో వేదనలు!
యెహోవాను నమ్ముకొన్నవారి చుట్టూరా
అనుగ్రహంతో ఆయన ఆవరించి ఉంటాడు✽.
11 ✽న్యాయవంతులారా, యెహోవా మూలంగా
ఆనందించండి, హాయిగా ఉండండి.
అంతరంగంలో నిజాయితీపరులారా,
మీరంతా ఆనంద ధ్వనులు చేయండి.