గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
31
1 యెహోవా, నేను నిన్ను నమ్మి ఆశ్రయించాను.
నన్ను ఎన్నడూ సిగ్గుపాలు కానియ్యకు.
నీ న్యాయబుద్ధి ననుసరించి నన్ను తప్పించు.
2 నా మొర చెవిని పెట్టి త్వరగా నాకు
విడుదల ప్రసాదించు.
నాకు ఆశ్రయమిచ్చే బండగానూ, నన్ను
కాపాడే బలమైన కోటగానూ ఉండు.
3 నీవే నా ఆధారశిల, నా దుర్గం.
నీ పేరుప్రతిష్ఠలకోసం నాకు దారి చూపు,
నాకు మార్గదర్శిగా ఉండు.
4 నా పగవాళ్ళు రహస్యంగా నాకోసం వల ఒడ్డారు.
దానినుంచి నీవు నన్ను తప్పించు.
నీవే నాకు రక్షక బలం.
5 నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను.
యెహోవా! సత్యస్వరూపి అయిన దేవా!
నీవు నన్ను విమోచించావు.
6 వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళంటే నాకు
అసహ్యమే.
నేను యెహోవానే నమ్ముకొన్నాను.
7 నా దీనావస్థను నీవు చూశావు.
నా హృదయ బాధలు నీకు తెలిసే ఉన్నాయి.
గనుక నేను నీ అనుగ్రహం చూచి
ఆనంద భరితుణ్ణయి సంతోషంతో
గంతులు వేస్తాను.
8 నన్ను శత్రువుల వశం చెయ్యకుండా విశాల
ప్రదేశంలో నా అడుగులు పెట్టించావు.
9 యెహోవా! నన్ను దయ చూడు.
దురవస్థలో ఉన్నాను.
శోకంవల్ల నా కళ్ళు పీక్కుపొయ్యాయి.
నా మనసూ, నా తనువూ చీకిపొయ్యాయి.
10 దుఃఖంతో కుమిలిపోతూ బ్రతుకుతున్నాను.
నిట్టూర్పులతో నా బ్రతుకు తరిగిపోతూ ఉంది.
నా అపరాధాలు నా బలాన్ని హరించివేశాయి.
నా ఎముకల్లో సత్తువ లేకుండా పోయింది.
11 నా శత్రువులందరికీ నేనంటేనే అవమానం!
ఇరుగు పొరుగు వాళ్ళకు మరీనూ!
నాతో పరిచయం ఉన్నవాళ్ళకు నేనంటే భయం.
వీధిలో నన్ను చూచేవాళ్ళు తప్పుకొని పారిపోతారు.
12 చనిపోయి జ్ఞప్తిలో లేనివాడిలాగా ప్రజలు
నన్ను మరచిపోయారు.
నేను పగిలిపోయిన పాత్రలాంటివాణ్ణి.
13 చాలామంది చెప్పిన కొండెం నాకు వినవచ్చింది.
వాళ్ళు నా మీద దురాలోచనలు చేస్తున్నారు.
నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.
నలుదిక్కులా భయ కారణాలున్నాయి.
14 యెహోవా! నిన్ను నమ్ముకొంటున్నాను.
“నీవే నా దేవుడవు” అంటున్నాను.
15 నా జీవిత కాలాలు ఉన్నది నీ చేతిలోనే.
నా శత్రువుల చేతిలో పడకుండా నన్ను తప్పించు.
నా వెంటపడేవాళ్ళ బారి నుంచి నన్ను కాపాడు.
16 నీ దాసుడైన నా మీద నీ ముఖకాంతి రేఖలు
ప్రసరించనియ్యి.
అనుగ్రహం చూపి నన్ను రక్షించు.
17 యెహోవా నీకు మొరపెట్టాను.
నాకు ఆశాభంగం కలగనియ్యకు
దుర్మార్గులకే ఆశాభంగం కలగాలి!
వాళ్ళు మృత్యులోకంలో పడి మౌనంగా ఉండాలి!
18  అబద్ధాలాడే వాళ్ళ నోళ్ళు మూసుకుపోవాలి.
వాళ్ళు తృణీకారం, గర్వం వెల్లివిరుస్తూ
దురహంకారంతో న్యాయవంతులకు
వ్యతిరేకంగా మాట్లాడుతారు.
19 నీవంటే భయభక్తులున్న వాళ్ళకోసం నీవు
భద్రం చేసిన మేలు ఎంతో గొప్పది!
నిన్ను నమ్మి ఆశ్రయించిన వారికి మనుషుల
ఎదుట నీవు చేసే మేలు ఎంతో గొప్పది!
20 మనుషుల కుట్రనుంచి వారిని నీ రహస్య
సన్నిధానంలో మరుగు చేస్తావు.
తమతో జగడమాడే నోళ్ళ ఎదుటనుంచి వారిని
నీ ఆశ్రయంలో క్షేమంగా ఉంచుతావు.
21 ముట్టడికి గురి అయిన పట్టణంలో యెహోవా
తన అనుగ్రహం ఆశ్చర్యకరమైన విధంగా
నాకు చూపాడు.
ఆయనకు స్తుతి కలుగుతుంది గాక!
22 కంగారుపడిపోయి నీ కనుదృష్టిలో లేకుండా పోయాను.
“నీవు నన్ను లక్ష్య పెట్టడం మానుకొన్నావు”
అనుకొన్నాను.
అయితే సహాయంకోసం నేను ప్రాధేయపడ్డప్పుడు
నీవు నా స్వరం, నా విన్నపం ఆలకించావు.
23 యెహోవా భక్తులారా!
మీరంతా ఆయనను ప్రేమిస్తూ ఉండండి.
నమ్మకమైనవారిని యెహోవా కాపాడుతాడు.
కాని, గర్విష్ఠులకు విస్తారమైన
ప్రతిఫలమిస్తాడు.
24 యెహోవా కోసం ఎదురు చూచేవారలారా!
స్థిరంగా ఉండండి.
హృదయంలో నిబ్బరంగా ఉండండి.