గృహ ప్రతిష్ఠ సంగీతం. దావీదు కీర్తన.
30
1 ✽✽యెహోవా! నా శత్రువులు నన్ను మించిఉప్పొంగిపోకుండా చేశావు.
నీవు నన్ను పైకెత్తావు. కనుక నిన్ను స్తుతిస్తాను.
2 యెహోవా! నా దేవా!
సహాయంకోసం నీకు మొర పెట్టాను.
నీవు నాకు ఆరోగ్యం ప్రసాదించావు.
3 యెహోవా! మృత్యులోకంనుంచి నన్ను లేపావు.
నాశనకరమైన గుండంలో పడకుండా నన్ను
బ్రతికించావు.
4 ✽యెహోవా భక్తులారా! ఆయనకు సంకీర్తనం
చెయ్యండి.
ఆయన పవిత్రమైన పేరును స్తుతించండి.
5 ఎందుకంటే ఆయన కోపం క్షణంకంటే
ఎక్కువ సేపు ఉండదు.
ఆయన అనుగ్రహం జీవితాంతంవరకూ ఉంటుంది.
ఏడుపు సాయంకాలాన వచ్చి రాత్రంతా ఉండవచ్చు
గానీ ప్రొద్దున ఆనంద ధ్వనులు వెల్లి విరుస్తాయి.
6 ✽అంతా కలిసి వచ్చినప్పుడు నన్ను ఏదీ ఎన్నడూ
కదల్చదు అనుకొన్నాను.
7 యెహోవా, అనుగ్రహం చూపినప్పుడు నన్ను
కదలని పర్వతంలాగా నిలిపావు నీవు.
నీ ముఖం కనబడకుండా చేసినప్పుడు
నేను కలవరపడ్డాను.
8 ✝యెహోవా! నీకే మొరపెట్టాను.
దయ చూపమని నా ప్రభువైన నిన్నే ప్రాధేయపడ్డాను.
9 నేను చనిపోయి సమాధి పాలయితే అందువల్ల
ఏం ప్రయోజనం?
మట్టి✽ నిన్ను సంస్తుతి చేయడం జరుగుతుందా?
నీ విశ్వసనీయతను తెలియజేయడం సాధ్యమా?
10 యెహోవా, ఆలకించు! నన్ను కరుణించు!
యెహోవా, నాకు సహాయంగా ఉండు.
11 ✽నా రోదనం నాట్యంగా మార్చావు.
నేను కట్టుకొన్న గోనెపట్ట విడిపించి,
ఆనంద వస్త్రాన్ని నాకు కట్టబెట్టావు.
12 నా ఆంతర్యం మౌనం భరించక,
నీకు సంకీర్తనం చేయాలని అందులో ఉన్న
నీ ఉద్దేశం.
యెహోవా! నా దేవా! నేను నీకు సర్వదా
కృతజ్ఞత✽ అర్పిస్తాను.