దావీదు కీర్తన
29
1 దేవకుమారుల్లారా!
యెహోవాకు మహత్తూ, బలమూ ఆరోపించండి.
యెహోవాకే అలా ఆరోపించండి.
2 యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు
ఆరోపించండి.
పవిత్రత అనే అలంకారంతో యెహోవాను
ఆరాధించండి.
3 యెహోవా స్వరం జలనిధి పై వినిపిస్తూ ఉంది.
మహిమస్వరూపి అయిన దేవుని స్వరం
ఉరుములాగా మారుమోగుతూ ఉంది.
యెహోవా మహా జలనిధికి పైగా
సంచరిస్తూ ఉన్నాడు.
4 యెహోవా స్వరం బలం గలది.
యెహోవా స్వరం ప్రభావం గలది.
5 యెహోవా స్వరానికి దేవదారు చెట్లు
విరుచుకుపడతాయి.
లెబానోను దేవదారు చెట్లను
యెహోవా విరిచి ముక్కలు చేస్తాడు.
6 అవి దూడలాగా, లెబానోను షిర్యోనులను
అడవి బర్రెపిల్లలాగా చెంగుచెంగున
దూకేలా చేస్తాడాయన.
7 యెహోవా స్వరం మెరుపు తీగెలను
చీల్చివేస్తుంది.
8 యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది.
యెహోవా కాదేష్‌ఎడారి సీమను వణికిస్తున్నాడు.
యెహోవా స్వరం లేళ్ళు ఈనేలా చేస్తుంది.
9 అది అడవిచెట్ల ఆకులను రాల్చి వేస్తుంది.
ఆయన ఆలయంలో ఉన్నదంతా
ఆయనకే “మహత్తు” అంటున్నది.
10 యెహోవా జలప్రళయంమీద
సింహాసనాసీనుడయ్యాడు.
యెహోవా శాశ్వతంగా మహారాజుగా సింహాసనం
మీద కూర్చుని ఉంటాడు.
11 యెహోవా తన ప్రజానీకానికి బలం ప్రసాదిస్తాడు.
యెహోవా తనవారికి శాంతి దీవెనలు అనుగ్రహిస్తాడు.