దావీదు కీర్తన
28
1 యెహోవా, నీకు మొర్రపెట్టుకొంటున్నాను.
నా ఆధారశిలవు నీవు.
నా మొర పెడచెవిని పెట్టకు.
నీవు జవాబివ్వకపోతే నాశనకరమైన గుండంలోకి
దిగిపోయేవాళ్ళలాగా అవుతాను.
2 నా స్వరం, నా విన్నపం విను.
నీ ఆలయంలోని అతి పవిత్ర స్థలంవైపు చేతులెత్తి
సహాయంకోసం నీకు ఆక్రందన చేస్తున్నాను.
3 దుర్మార్గులతో, చెడుగు చేసేవాళ్ళతో పాటు
నన్ను ఈడ్చుకుపోకు.
వాళ్ళు లోపల కుటిలం పెట్టుకొని,
పైకి ఇరుగు పొరుగువారితో శాంతి,
శాంతి అంటారు.
4 వాళ్ళ కార్యకలాపాలకూ,
వాళ్ళు చేసిన చెడుగుకూ
తగిన ప్రతిఫలమియ్యి.
వాళ్ళు చేతులారా చేసిన దానిని బట్టి వాళ్ళకు
ప్రతీకారం జరిగించు.
వాళ్ళ వ్యవహారాలకు తగినదేదో వాళ్ళకు
ముట్టేలా చెయ్యి.
5 ఎందుకంటే, యెహోవా చర్యల మీద
మనసు పెట్టుకోరు వాళ్ళు.
ఆయన చేతులతో చేసినది వాళ్ళకు
లెక్కలేదు.
కనుక ఆయన వాళ్ళకు వృద్ధి కాదు,
నాశనమే కలిగిస్తాడు.
6 యెహోవా నా స్వరం, నా విన్నపం విన్నాడు.
ఆయనకు స్తుతి.
7 నాకు యెహోవాయే బలం.
ఆయన నాకు డాలులాంటివాడు.
హృదయపూర్వకంగా ఆయనను నమ్ముకొన్నాను.
అందుచేత నాకు సహాయం లభించింది.
నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతూ ఉంది.
నా కీర్తన ద్వారా ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను.
8 తన ప్రజానీకానికి బలం యెహోవాయే.
తన అభిషిక్తుడికి ఆయన రక్షక దుర్గం.
9 నీ ప్రజను కాపాడు. నీ సొత్తును ఆశీర్వదించు.
వారికి కాపరివై శాశ్వతంగా వారిని మోసుకో.