దావీదు కీర్తన
27
1 యెహోవా నా వెలుగు, నా రక్షణ.
ఎవరికైనా నేనెందుకు భయపడాలి?
యెహోవా నా ప్రాణానికి కోటలాంటివాడు.
ఎవరైతేనేం నాకేం భయం?
2  దుర్మార్గులు నన్ను మింగివేయడానికి ఎదుర్కొన్నప్పుడు
నా శత్రువులూ, నా పగవాళ్ళూ అలా
నా పైబడ్డప్పుడు,
తప్పటడుగు వేసి కూలిపోయింది వాళ్ళే!
3 ఒక సైన్యం నాకు విరోధంగా దండెత్తి
వచ్చినా కూడా నా గుండెలు అదరవు.
యుద్ధం నా మీదికి ఎగబడి వచ్చినా
ఈ విషయంలో నా ధైర్యం చెడదు.
4 యెహోవాను ఒకటి కోరాను.
దానిని నేను వెదుకుతాను.
యెహోవా మనోజ్ఞతను చూస్తూ ఉండడానికి,
ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉండడానికి
నేను బ్రతికే రోజులన్నీ ఆయన ఇంటిలో జీవితం
గడపాలని ఉంది.
5 ఎందుకంటే, విపత్తు వచ్చిన రోజున తన
ఆశ్రమంలో నన్ను దాచివేస్తాడు.
తన గుడారంలోని రహస్య స్థలంలో
నన్ను ఉంచుతాడు.
నన్ను ఎత్తైన బండమీదికి ఎక్కిస్తాడు.
6 నా చుట్టూరా శత్రువులే!
కాని, ఇప్పుడు వాళ్ళకు పైగా నేను
తలెత్తుకొనేలా చేస్తాడు.
ఆయన ఆరాధన గుడారంలో ఆనంద ధ్వనులతో
బలులర్పిస్తాను.
యెహోవాకు పాటలు పాడుతాను,
సంకీర్తన చేస్తాను.
7 యెహోవా! నేను ఎలుగెత్తి ప్రార్థన
చేసేటప్పుడు ఆలకించు.
దయ చూపి జవాబియ్యి.
8 “నా సముఖాన్ని వెదుకు”
అని నీవు అన్నప్పుడు
“యెహోవా, నీ సముఖాన్ని వెదుకుతాను”
అంటూ నీతో మాట కలిపినది నా
హృదయం.
9 నీ ముఖం నాకు కనబడకుండా చేయకు.
నీ దాసుడైన నన్ను కోపంతో త్రోసిపుచ్చకు.
నాకు సహాయం చేసేది నీవే!
నన్ను రక్షించే దేవా, నన్ను వదిలిపెట్టకు,
నన్ను జారవిడువకు.
10  నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా
యెహోవా నన్ను చేరదీస్తాడు.
11 యెహోవా, నీ మార్గాన్ని నాకు ఉపదేశించు.
నా విరోధుల కారణంగా సరైన దారి చూపు.
12 అబద్ధాలాడే సాక్షులు నాకు వ్యతిరేకంగా లేచారు.
దౌర్జన్యంతో బుసలు కొడుతున్నారు వాళ్ళు.
నా శత్రువుల ఇష్టానికి నన్ను అప్పగించవద్దు.
13 సజీవులు కాపురమున్న చోట నేను యెహోవా
మంచితనాన్ని చూడగలననే నమ్మకం నాకు
లేకపోతే నా గతేం కాను?
14 యెహోవా వైపు ఆశాభావంతో ఎదురుచూడు.
స్థిరంగా ఉండు.
హృదయంలో నిబ్బరంగా ఉండు.
యెహోవా వైపు ఆశాభావంతో ఎదురు చూడు.