దావీదు కీర్తన
26
1 యెహోవా, నేను నిజాయితీతో బ్రతికేవాణ్ణి.
నీ మీదే నమ్మకం ఉంచేవాణ్ణి.
నాకు సందేహం అంటూ లేదు.
గనుక నా పక్షాన న్యాయం జరిగించు.
2 నన్ను పరీక్షించి చూడు, యెహోవా,
నా హృదయాన్ని, మనసును పరిశోధించు.
3 నీ అనుగ్రహం నా దృష్టిలో ఉంచుకొని
నీ సత్యాన్ని అనుసరించి మెలిగేవాణ్ణి.
4 అబద్ధికులతో నేను సహవాసం చేసేవాణ్ణి కాను.
కపటులతో నాకేమీ పని ఉండదు.
5 దుష్టులతో పొత్తు నాకసహ్యం.
దుర్మార్గులతో కలిసి మెలసి ఉండను.
6 యెహోవా, నేను నిరపరాధిని.
నా చేతులు కడుక్కొని నీ బలిపీఠానికి
ప్రదక్షిణం చేస్తాను.
7 అక్కడ నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను,
నీ అద్భుతాలన్నిటినీ తెలియజేస్తాను.
8 యెహోవా, నీవు నివసించే ఆలయం,
నీ తేజస్సు ఉండే ఆ స్థలం అంటే నా కెంతో ప్రీతి.
9 పాపాత్ములతో పాటు నన్ను తుడిచిపెట్టకు.
హంతకులతో పాటు నా ప్రాణం తీయకు.
10 వాళ్ళ చేతులతో చెడ్డ పనులు చేస్తారు.
వాళ్ళ కుడి చేతినిండా లంచాలే!
11 నేనైతే నిజాయితీతో బ్రతుకుతున్నాను.
నన్ను విమోచించు, కరుణతో చూడు.
12 సమతలం మీద అడుగుపెట్టాను.
ప్రజల సమావేశాలలో యెహోవాను స్తుతిస్తాను.