దావీదు కీర్తన
25
1 యెహోవా, నా మనసు
నీ వైపుకే ఎత్తుతున్నాను.
2 నా దేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది.
నాకు ఆశాభంగం కలగనియ్యకు,
నా శత్రువులను నా విషయం
ఉప్పొంగనియ్యకు.
3 నీకోసం నమ్మకంతో ఎదురు చూచేవారు
ఏ మాత్రం ఆశాభంగానికి గురి కారు.
నిష్కారణంగా ద్రోహం చేసే వాళ్ళకే
ఆశాభంగం కలుగుతుంది.
4 నీ త్రోవలేవో నాకు తెలియజేయి.
నీ విధానాలేవో వివరించి చెప్పు.
5 నేను నీ సత్యాన్ని అనుసరించేలా చేసి
నాకు ఉపదేశించు.
ఎందుకంటే నీవు నన్ను రక్షించే దేవుడవు.
నీకోసమే నేను ఎల్లప్పుడూ ఆశతో
ఎదురు చూస్తూ ఉన్నాను.
6 యెహోవా, నీ వాత్సల్యమూ
అనుగ్రహమూ శాశ్వతమైనవి.
వాటిని జ్ఞాపకం ఉంచుకో.
7  బాల్యంలో నేను చేసిన తప్పిదాలూ,
నా అక్రమ కార్యాలూ జ్ఞాపకం ఉంచుకోవద్దు.
నీ అనుగ్రహం ప్రకారం, యెహోవా,
నీ మంచితనం కారణంగా నన్ను గుర్తుంచుకో.
8 యెహోవా మంచివాడు, యథార్థవంతుడు,
గనుక తన మార్గాన్ని పాపులకు ఉపదేశిస్తాడు.
9  వినయంగలవారికి న్యాయసమ్మతంగా
దారి చూపుతాడు.
వారికి తన మార్గాన్ని ఉపదేశిస్తాడు.
10 యెహోవా ఒడంబడికనూ శాసనాలనూ
పాటించే వారిపట్ల ఆయన పద్ధతులన్నీ
దయతో, విశ్వసనీయతతో
నిండి ఉన్నాయి.
11 యెహోవా, నా అపరాధం చాలా ఘోరమైనది.
అయినా నీ పేరు ప్రతిష్ఠల కోసం
దానిని క్షమించు.
12 యెహోవా పట్ల భయభక్తులు గల మనిషికి
ఆయన శ్రేష్ఠమైన మార్గాన్ని ఉపదేశిస్తాడు.
13 అలాంటివాడు హాయిగా బతుకుతాడు.
అతడి సంతానం దేశానికి వారసులవుతారు.
14 యెహోవా అంటే భయభక్తులున్న వారే ఆయన
రహస్య సత్యాలు గ్రహిస్తారు.
ఆయన తన ఒడంబడికను
వారికి స్పష్టం చేస్తాడు.
15 నా కళ్ళు యెహోవా వైపే చూస్తాయి.
ఆయనే నా పాదాలను వలలో నుంచి తప్పిస్తాడు.
16 నేను ఒంటరివాణ్ణి, బాధితుణ్ణి
గనుక నా వైపు ఇటు చూడు. కరుణించు.
17 నా హృదయంలో బాధలు ఎక్కువయ్యాయి.
ఇబ్బందులలో నుంచి నన్ను విడిపించు.
18 నా దురవస్థ, ఆయాసం గమనించి,
నా పాపాలన్నీ క్షమించు.
19 నా శత్రువులు చూడు ఎంతమందో!
వాళ్ళు దౌర్జన్యం, విద్వేషం నా మీద
వెళ్ళగ్రక్కుతున్నారు.
20 నన్ను కాపాడు, రక్షించు.
నన్ను సిగ్గుపాలు కానియ్యకు.
నిన్ను నమ్మి ఆశ్రయించాను గదా!
21 నిజాయితీ, యథార్థత నన్ను కాపాడుతాయి గాక!
ఎందుకంటే నీకోసమే ఎదురు చూస్తున్నాను.
22 దేవా, ఇస్రాయేల్‌ప్రజల అగచాట్లన్నీటిలో నుంచి
వారిని విడిపించు!