దావీదు కీర్తన
24
1 భూమి, దానిమీద ఉన్నదంతా యెహోవాకు
చెందినవే.
లోకమూ, అందులో ఉన్నవారూ కూడా
ఆయన సొత్తే.
2 ఎందుకంటే భూమిని
సముద్రాల పై నిలిపినవాడు,
ప్రవాహాల మీద దానిని సుస్థిరం చేసినవాడు
ఆయనే.
3 యెహోవా కొండపైకి ఎక్కిపోగల హక్కు
ఎవరికి ఉంది?
ఆయన పవిత్ర స్థానంలో
ఎవరు నిలిచి ఉండగలరు?
4 నిరపరాధమైన చేతులూ
శుద్ధ హృదయమూ కలిగి
వ్యర్థమైన వాటిని ఆశించకుండా,
మోసకరంగా ఒట్టు పెట్టుకోనివారే
అందుకు తగినవారు.
5 యెహోవా మూలంగా వారికి ఆశీస్సులు లభిస్తాయి.
తమ రక్షకుడైన దేవుడు వారిని నిర్దోషులు అంటాడు.
6 దేవుణ్ణి సమీపించగలవారు వీరే.
యాకోబు యొక్క దేవా, నిన్ను వెదికేది
ఇలాంటివారే. (సెలా)
7 ద్వారాల్లారా బార్లాగా తెరుచుకోండి!
పురాతనమైన తలుపులారా, పైకెత్తుకోండి!
అప్పుడు ఘనుడైన రాజు లోపలికి వస్తాడు.
8 ఘనుడైన ఈ రాజు ఎవరు?
ఈయన మహా బలాఢ్యుడైన యెహోవా!
యుద్ధశూరుడైన యెహోవా!
9 ద్వారాల్లారా బార్లాగా తెరుచుకోండి!
పురాతనమైన తలుపులారా, పైకెత్తుకోండి!
అప్పుడు ఘనుడైన రాజు లోపలికి వస్తాడు.
10 ఘనుడైన ఈ రాజెవరు?
సేనల ప్రభువు యెహోవా.
ఘనుడైన రాజు ఈయనే.