దావీదు కీర్తన
23
1 నా కాపరి యెహోవా.
అందుచేత నాకు కొదువ అంటూ ఉండదు.
2 ఆయన నన్ను పచ్చిక మైదానాలలో
పడుకో బెట్టుచున్నాడు.
ప్రశాంత జలాలదగ్గర నాకు దారి
చూపుతూ ఉన్నాడు.
3 నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు.
తన పేరు ప్రతిష్ఠలకోసం నన్ను న్యాయ
సమ్మతమైన మార్గాలలో నడిపిస్తూ ఉన్నాడు.
4 చావు నీడ ఉన్న లోయలో నేను నడచినా
ఏ కీడుకూ భయపడను.
ఎందుకంటే నీవు నాతో ఉన్నావు.
నీ దండం, నీ చేతికర్ర
నాకు ఆదరణ కలిగిస్తాయి.
5 పగవాళ్ళ ఎదుటే నాకు భోజనం వడ్డిస్తావు.
నూనెతో నాకు తలంటిపోస్తావు.
నా పాత్ర నిండి పొర్లిపారుతూ ఉంది.
6 నా జీవిత కాలమంతా మేలూ అనుగ్రహమూ
నన్ను వెన్నంటి వస్తాయి.
యెహోవా గృహసీమలో నేను శాశ్వతంగా
నివాసం చేస్తాను.