గాయకుల నాయకుడికి. రాగం: అయ్యలేత్‌షహర్ (“ఉదయకాలం ఆడజింక”). దావీదు కీర్తన.
22
1 ✽నా దేవా! నా దేవా!నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు✽?
ఎందుకు నన్ను కాపాడకుండా,
నా ఆక్రందన వినకుండా దూరమయ్యావు?
2 ✽ఓ నా దేవా! పగలు నేను మొరపెట్టుకొంటున్నాను.
రాత్రి వేళ కూడా ఊరుకోవడం లేదు.
అయినా నీవేమీ జవాబివ్వడం లేదు.
3 ✽నీవు పవిత్రుడవు. ఇస్రాయేల్‌ప్రజల స్తుతులతో
సింహాసనాసీనుడవు.
4 ✽మా పూర్వీకులు నిన్నే నమ్ముకొన్నారు.
వారు నమ్మినప్పుడు నీవు వారికి విడుదల
ప్రసాదించావు.
5 సహాయంకోసం వారు నీకు మొరపెట్టారు.
రక్షణ కలిగింది.
నీమీద నమ్మకం ఉంచినప్పుడు వారికి
ఆశాభంగం కలగలేదు.
6 ✽నేనైతే పురుగును, మనిషిని కాను.
మనుషులు నన్ను నిందిస్తున్నారు.
ప్రజలు నన్ను నీచంగా ఎంచుతున్నారు.
7 ✝నన్ను చూచేవాళ్ళంతా వేళాకోళం చేస్తారు.
తల పంకిస్తూ, పెదవి విరుస్తూ,
8 ✝“యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నాడట.
యెహోవా అతణ్ణి తప్పిస్తాడు గాక!
ఇతడే గదూ యెహోవా మురిసిపోయే మనిషి!
యెహోవా అతణ్ణి రక్షిస్తాడు గాక!” అంటారు.
9 ✽అయితే నీ మూలంగానే నేను
తల్లి గర్భంనుంచి బయటపడ్డాను.
తల్లి పాలు కుడిచిన కాలంలోనే నీ మీద
నమ్మకం నాకు కలిగించావు.
10 పుట్టినది మొదలుకొని నీవే నాకు అండ.
నా తల్లి నన్ను కన్న రోజునుంచి
నీవు నా దేవుడవు.
11 ✽ఆపద దగ్గరగా ఉంది.
నాకు దూరమై ఉండకు.
సహాయం చేసేవారు ఇంకెవరూ లేరు.
12 ✽అనేక ఎద్దులు నన్ను చుట్టుముట్టినట్టు ఉంది.
బాషాను ప్రదేశం బలమైన ఎద్దులు నన్ను
ముట్టడించినట్టుంది.
13 గర్జిస్తూ చీల్చివేస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు
నోరు తెరుచుకొన్నారు.
14 ✽నేను పారబోసిన నీళ్ళలాగా అయిపొయ్యాను.
నా ఎముకల కీళ్ళన్నీ తప్పాయి.
నా హృదయం నాలో మైనంలాగా
కరిగిపోయింది.
15 నా బలం చిల్ల పెంకులాగా ఎండిపోయి ఉంది✽.
నా నాలుక దవడకు అంటుకుపోయింది.
నీవు✽ చావుధూళి✽లో నన్ను పడవేశావు.
16 ✽కుక్కలలాంటి వాళ్ళు నన్ను నలుప్రక్కలా
చుట్టుకొన్నారు.
దుర్మార్గుల గుంపు నన్ను ఆవరించింది.
నా కాళ్ళు చేతులు పొడిచివేశారు.
17 ✽ నా ఎముకలెన్నో నేను చూచి లెక్క పెట్టగలను.
వాళ్ళు నన్ను ఎగాదిగా చూస్తూ ఉన్నారు.
18 నా వస్త్రాలను తమలో తాము పంచుకొని, నా అంగీకోసం చీట్లు వేస్తున్నారు.
19 ✽యెహోవా! నాకు దూరంగా ఉండకు.
నీవే నాకు బలం.
త్వరలో నాకు సహాయం చెయ్యి.
20 ఖడ్గం✽నుంచి నా ప్రాణం దక్కించు.
కుక్కలాంటివాళ్ళ బారినుంచి నన్ను తప్పించు✽.
21 సింహం✽ నోటనుంచి నన్ను కాపాడు.
అడవి దున్నల✽ కొమ్ములమీదనుంచి నేను చేసిన
ప్రార్థన నీవు ఆలకించావు.
22 ✽నీ పేరు✽ నా సోదరులకు ప్రకటిస్తాను✽.
సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను.
23 ✽యెహోవా అంటే భయ భక్తులున్నవారలారా!
ఆయనను స్తుతించండి!
యాకోబు వంశీయులంతా,
ఆయనను గౌరవించండి!
ఇస్రాయేల్‌సంతతివారంతా,
ఆయనను భయభక్తులతో చూడండి.
24 ✽ఆయన దీనస్థితిలో ఉన్నవాని బాధను
నిర్లక్ష్యం చేయలేదు, చీదరించుకోలేదు.
అతడి నుంచి తన ముఖం త్రిప్పుకోలేదు.
సహాయంకోసం అతడు మొరపెట్టినప్పుడు
ఆయన ఆలకించాడు.
25 ✽మహా సమావేశంలో నా కీర్తన నిన్ను
గురించే ఉంటుంది.
యెహోవాపట్ల భయభక్తులున్న వారి సమక్షంలో
నా మొక్కుబళ్ళు✽ చెల్లించుకొంటాను.
26 దీనావస్థలో ఉన్న భక్తులు సుష్టుగా✽
భోం చేస్తారు.
యెహోవాను వెదికేవారు ఆయనను కీర్తిస్తారు.
మీ హృదయాలు ఎప్పటికీ సజీవంగా
ఉంటాయి గాక!
27 ✽భూమి కొనలన్నిటినుంచీ ప్రజలు
దీనిని మనసుకు తెచ్చుకొని
యెహోవావైపు మరలుతారు.
ప్రతి జనంలో ప్రతి జాతిలో మనుషులు
నీ ఎదుట సాష్టాంగ నమస్కారాలు చేస్తారు.
28 ✽ ఎందుకంటే పరిపాలన యెహోవాదే.
ఆయనే ప్రజలమీద ఏలుతున్నాడు.
29 ✽లోకంలో అభివృద్ధి పొందినవారంతా
భోం చేస్తూ ఆరాధిస్తారు.
ప్రాణం దక్కించుకోలేక మట్టిలో
కలిసిపోయేవారంతా ఆయన
సన్నిధానంలో మోకరిస్తారు.
30 ✽రాబోయే తరంవారు ఆయనను సేవిస్తారు.
ముందు తరానికి ప్రభువును గురించి చెపుతారు.
31 ✽వారు వచ్చి ఆయన చేసినదానిని
తరవాతి తరం ప్రజలకు తెలియజేస్తారు,
ఆయన న్యాయ విధానాన్ని చాటుతారు.