గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
21
1 యెహోవా, నీ బలంలో ఈ రాజు ఆనందిస్తున్నాడు.
నీ రక్షణానుభూతిలో అతడికెంతో ఉల్లాసం.
2 అతడి హృదయాభిలాష నీవు ఈడేర్చావు.
అతడి పెదవుల మీదుగా వచ్చిన మనవిని నీవు
తోసిపుచ్చలేదు. (సెలా)
3 దివ్యమైన ఆశీస్సులతో నీవు అతణ్ణి సందర్శిస్తున్నావు.
అతడి తల మీద మేలిమి బంగారు కిరీటం ఉంచావు.
4 ఆయువు ప్రసాదించుమని అడిగాడు.
నీవు దానిని అతడికి దయ చేశావు.
దీర్ఘాయువు శాశ్వత జీవాన్ని ఇచ్చావు.
5 నీ రక్షణమూలంగా అతడికి ఎంతో మహత్వం
కలిగింది.
ఘనత, ప్రభావం అతడికి కట్టబెట్టావు.
6 నీవతడికి శాశ్వతమైన ఆశీస్సులు ప్రసాదిస్తున్నావు.
నీ సన్నిధానంలో అతణ్ణి ఆనందభరితుణ్ణి
చేస్తున్నావు.
7 ఎందుకంటే, రాజు యెహోవా మీద నమ్మకం
ఉంచుతున్నాడు.
సర్వాతీతుడి అనుగ్రహం చేత అతడు
దృఢంగా నిలుస్తాడు.
8  నీవు నీ శత్రువులందరినీ చేజిక్కించుకుంటావు.
నీ కుడిచేతితో నిన్ను ద్వేషించేవాళ్ళను పట్టుకుంటావు.
9 నీవు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళను
అగ్నిగుండంలాగా చేస్తావు.
కోపంతో యెహోవా వాళ్ళను నాశనం చేస్తాడు.
మంట వాళ్ళను దహించివేస్తుంది.
10  వాళ్ళ సంతానం అంటూ భూమి మీద లేకుండా
అందరినీ ధ్వంసం చేస్తావు.
వాళ్ళ సంతతి వాళ్ళు ప్రజలమధ్య లేకుండా చేస్తావు.
11 ఎందుకంటే నీకు కీడు చేయాలని
వాళ్ళు కుట్ర పన్నారు, దురాలోచన చేశారు.
అయితే దానిని సాధించలేరు.
12 నీవు విల్లు ఎక్కుపెట్టి వాళ్ళ ముఖాలకు
గురి చూస్తావు.
వాళ్ళు వెనక్కు తిరిగేలా చేస్తావు.
13 యెహోవా! నీ మహత్తు మూలంగా
ఉన్నతంగా ఉండు.
నీ బలప్రభావాలను గురించి
సంకీర్తనం చేసి స్తుతిస్తాం.