గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
20
1 కష్ట సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక!
యాకోబు యొక్క దేవుని పేరు నిన్ను
కాపాడుతుంది గాక!
2 తన పవిత్రాలయంనుంచి ఆయన నీకు సహాయం
చేస్తాడు గాక!
సీయోను నుంచి ఆయన నీకు అండదండగా
ఉంటాడు గాక!
3 నీ నైవేద్యాలన్నీ ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు గాక!
నీ హోమ బలులు ఆయన
స్వీకరిస్తాడు గాక! (సెలా)
4 నీ కోరికలు ఆయన సఫలం చేస్తాడు గాక!
నీ ఆలోచనలన్నీ నెరవేరేలా చేస్తాడు గాక!
5 నీ విజయానికి మేము ఆనంద ధ్వనులు చేస్తాం.
మా దేవుని పేర పతాకం ఎత్తుతాం.
నీ మనవులన్నీ యెహోవా అనుగ్రహిస్తాడు గాక!
6 యెహోవా తన అభిషిక్తుణ్ణి కాపాడుతాడు.
ఇప్పుడిది నాకు తెలుసు.
ఆయన తన పవిత్ర లోకంనుంచి అతడికి
జవాబిస్తాడు,
విజయవంతమైన కుడిచేతి బలం ప్రయోగిస్తాడు.
7 కొందరు తమ రథాలను చూచుకొని గర్విస్తారు.
కొందరు గుర్రాలను చూచుకొని మురిసిపోతారు.
కాని, మనం మన దేవుడు యెహోవా పేరటే
ఉప్పొంగుతాం.
8 అలాంటివాళ్ళు వంగి కుప్పకూలిపోతారు.
కాని, మనం చక్కగా లేచి నిలుచున్నాం.
9 యెహోవా, కాపాడు!
మేము ప్రార్థన చేసేటప్పుడు రాజువైన నీవు
ఆలకిస్తావు గాక!