గాయకుల నాయకుడికి. దావీదు కీర్తన.
19
1 ఆకాశాలు దేవుని మహత్తును గురించి
చెపుతున్నాయి.
విశాలమైన అంతరిక్షం ఆయన చేతులతో
చేసిన పనిని తెలియజేస్తూ ఉంది.
2 ప్రతి పగలూ ప్రబోధం చేస్తుంది.
ప్రతి రాత్రీ జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.
3 వాటికి భాషా, మాటా లేవు.
వాటి స్వరం వినిపించడం లేదు.
4 అయినా వాటి సందేశం లోకమంతటా,
వాటి ప్రకటనలు భూమి కొనలకు చేరాయి.
ఆకాశంలో సూర్యగోళానికి ఆయన డేరా వేశాడు.
5 సూర్యగోళం పెళ్ళికొడుకులాగా తన మంటపంలో
నుంచి బయటకి వచ్చినట్టు ఉంది,
పందెంలో పరిగెత్తడానికి ఉత్సాహం గల
బలాఢ్యుడిలాగా ఉంది.
6 ఆకాశంలో ఈ చివరనుంచి అది తరలి వెళ్తూ
ఆ చివర వరకు చుట్టు తిరుగుతుంది.
దాని వేడినుంచి ఏదీ దాగుకోవడం అసాధ్యం.
7 యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది.
అది ఆత్మకు జీవం తెస్తుంది.
యెహోవా శాసనాలు నమ్మతగ్గవి.
అవి మందబుద్ధులను తెలివైనవారుగా చేస్తాయి.
8 యెహోవా ఆదేశాలు న్యాయమైనవి.
అవి హృదయానందం కలిగిస్తాయి.
యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి.
అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి.
9 యెహోవాను గురించిన భయభక్తులు శుద్ధమైనవి.
అవి శాశ్వతంగా నిలుస్తాయి.
యెహోవా న్యాయ నిర్ణయాలు కేవలం సత్యమైనవి,
ధర్మసమ్మతమైనవి.
10 బంగారం కంటే, చాలా మేలిమి బంగారంకంటే
అవి ఎంతో అమూల్యమైనవి.
తేనెకంటే, జుంటితేనె ధారాలకంటే అవి
ఎంతో మధురం.
11 నీ సేవకుడికి వాటి మూలంగా హెచ్చరిక
కలుగుతుంది.
వాటిని పాటించడం వల్ల గొప్ప బహుమానం
దొరుకుతుంది.
12 తెలియక చేసిన తన తప్పిదాలు
తెలుసుకోగలవాడెవడు?
నేనెరగని నా తప్పులు క్షమించి
నిర్దోషినని తీర్పు తీర్చు.
13  అహంభావ క్రియలు నీ సేవకుడైన
నేను చేయకుండేలా నన్ను కాపాడు.
అలాంటి అపరాధాలను నా మీద పెత్తనం
చెయ్యనియ్యవద్దు.
అప్పుడు నేను నిర్దోషిగా ఉంటాను.
ఘోర పాతకం చెయ్యకుండా
నిరపరాధిగా ఉంటాను.
14 యెహోవా, నా ఆధారశిలా! నా విమోచకా!
నా నోట వెలువడే మాటలూ,
నా హృదయాలోచనలూ నీ దృష్టికి
అంగీకారంగా ఉంటాయి గాక!