గాయకుల నాయకుడికి యెహోవా దాసుడు దావీదు కీర్తన. అతడి శత్రువులందరి చేతిలో నుంచీ సౌలు చేతిలో నుంచీ యెహోవా అతణ్ణి తప్పించిన రోజున ఈ మాటలు యెహోవాకు చెప్పి సంకీర్తనం చేశాడు.
18
1 ✽యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.నీవే నా బలం.
2 యెహోవా నాకు ఆధారశిల✽, నా కోట,
నా రక్షకుడు, నేను ఆశ్రయించిన నా ఆధారశిల,
నా డాలు, నా రక్షణ బలం, నా ఎత్తయిన స్థలం,
నా దేవుడు.
3 యెహోవా స్తుతికి యోగ్యుడు.
ఆయనకు నేను ప్రార్థన చేస్తాను.
నా శత్రువుల బారి నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు.
4 ✽మరణం పగ్గాలు నన్ను చుట్టివేశాయి.
నాశన ప్రవాహాలు నా పైకి ముంచుకు వచ్చాయి.
5 మృత్యులోక పాశాలు నన్ను చుట్టుకున్నాయి.
మరణం ఉరిగా నన్ను ఎదుర్కొంది.
6 నా కష్టాలలో యెహోవాకు ప్రార్థన చేశాను.
సహాయంకోసం నా దేవునికి మొర పెట్టాను.
నా కంఠధ్వని ఆయన తన ఆలయంలో విన్నాడు.
నా ఆక్రందన ఆయన సన్నిధానానికి చేరింది,
ఆయన చెవులకు వినబడింది.
7 ✽అప్పుడు భూకంపం వచ్చింది. భూమి అదిరింది.
పర్వతాల పునాదులు కదిలాయి.
ఆయనకు కోపం రగులుకొంది,
గనుకనే అవి వణికాయి.
8 ✽ఆయన ముక్కుపుటాలలో నుంచి పొగ లేచింది.
ఆయన నోటనుంచి దహించే మంట వచ్చింది.
దానివల్ల నిప్పుకణికెలు రగులుకొన్నాయి.
9 ✽ఆకాశాలను చీల్చి ఆయన దిగి వచ్చాడు.
కటిక చీకటి ఆయన పాదాల క్రింద ఉంది.
10 కెరూబు✽ల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు.
గాలి రెక్కల మీద వేగంగా వచ్చాడు.
11 ✽ఆయన చీకటిని కప్పుకొన్నాడు.
నీళ్ళున్న నల్లటి ఆకాశ మేఘాలను గుడారంలాగా
ఆయనను చుట్టుకొన్నాయి.
12 ఆయన ప్రకాశ మానమైన సన్నిధిలోనుంచి
తన కారు మబ్బులు సాగిపొయ్యాయి.
వడగండ్లూ, నిప్పుకణికెలూ బయలుదేరాయి.
13 యెహోవా ఆకాశంలో గర్జించాడు.
సర్వాతీతుడు తన స్వరం వినబడేలా చేశాడు.
వడగండ్లు, నిప్పు రవ్వలు కురిశాయి.
14 ఆయన తన బాణాలు విసిరాడు,
శత్రువులను చెదరగొట్టాడు.
అనేక మెరుపులు ప్రయోగించి వాళ్ళను ఓడించాడు.
15 యెహోవా, నీ గద్దింపుకు,
నీ ముక్కుపుటాలలో నుంచి వెలువడ్డ తీవ్ర శ్వాసకు
సముద్రాల అడుగులు కనబడ్డాయి,
భూగోళం పునాదులు కనిపించాయి.
16 ✽పైనుంచి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకొన్నాడు.
నన్ను లోతైన నీళ్ళలో నుంచి పైకి తీశాడు.
17 బలిష్ఠుడైన నా శత్రువు బారినుంచి
ఆయన నన్ను రక్షించాడు.
నా శక్తికి మించిన నా పగవాళ్ళ వశంనుంచి
నన్ను తప్పించాడు.
18 ✽విపత్తులో వాళ్ళు నన్ను ఎదుర్కొన్నారు.
కాని, యెహోవా నాకు అండదండగా ఉన్నాడు.
19 ✽ ఆయన నన్ను విశాల స్థలంలోకి చేర్చాడు.
నేనంటే ఆయనకెంతో ఇష్టం,
గనుక నన్ను విడిపించాడు.
20 ✽నా న్యాయ ప్రవర్తన ప్రకారం యెహోవా
నా పట్ల వ్యవహరించాడు.
నా పవిత్ర క్రియల ప్రకారం నాకు
ప్రతిఫలం ప్రసాదించాడు.
21 యెహోవా విధానాలను నేను అనుసరించాను.
నేనేమీ నా దేవుణ్ణి విడిచిన భ్రష్టుణ్ణి కాను.
22 ఆయన న్యాయ నిర్ణయాలన్నీ శిరసావహిస్తున్నాను.
ఆయన విధించిన చట్టాలను నేను
ఉల్లంఘించడం లేదు.
23 ✽ఆయన పట్ల నేను నిర్దోషిని.
నా చెడుగుకు లొంగకుండా నన్ను కాపాడుకొన్నాను.
24 నా న్యాయ ప్రవర్తన ప్రకారం,
ఆయన దృష్టిలో నా పవిత్ర క్రియల ప్రకారం,
యెహోవా నన్ను సత్కరించాడు.
25 ✽దయాపరుల పట్ల నీవు దయ చూపుతావు.
యథార్థంగా ప్రవర్తించే వారికి నీవు యథార్థవంతుడివి.
26 పవిత్రులకు నిన్ను నీవు పవిత్రుడుగా
కనుపరచుకొంటావు.
కానీ వక్రబుద్ధులను వక్రమార్గం✽ పట్టిస్తావు.
27 ✽దీనస్థితిలో ఉన్న నీ భక్తులను రక్షిస్తావు.
గర్వంతో కన్ను మిన్నుగానని వాళ్ళను
అణగగొట్టివేస్తావు.
28 నా దీపం✽ వెలిగేలా చేస్తావు నీవు.
యెహోవా నా దేవుడు.
ఆయన నా చీకటిని కాంతి✽గా మార్చివేస్తాడు.
29 నీ సహాయంతో నేను సైన్యంపై బడగలను.
నా దేవుని తోడ్పాటుతో గోడమీదుగా
దూకెయ్యగలను.
30 ✽దేవుని మార్గం లోపరహితం.
యెహోవా వాక్కు పవిత్రమైనది.
ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ
ఆయన డాలులాంటివాడు.
31 ✽యెహోవా తప్ప దేవుడు మరింకెవరు?
మన దేవుడు తప్ప ఆధారశిలలాంటివాడు
ఇంకెవరున్నారు?
32 నాకు బలాన్ని కట్టబెట్టి, నా మార్గాన్ని
ఏ లోపమూ లేకుండా✽ చేసేవాడు ఆయనే.
33 ✽నా కాళ్ళు జింక కాళ్ళలాగా ఉండేలా చేసి,
నా ఎత్తయిన స్థలాల మీద నన్ను నిలుపుతున్నాడు.
34 యుద్ధం కోసం నా చేతులకు మంచి
శిక్షణ ఇస్తున్నాడు.
నాచేతులతో కంచు విల్లు ఎక్కు పెట్టగలను.
35 ✽నీ సంరక్షణ అనే డాలు నాకందించావు.
నీ కుడి చెయ్యి నాకు అండదండగా ఉంటుంది.
నీ విధానం సాధువైనది.
అది నన్ను పై స్థితికి తెచ్చింది.
36 నా పాదాలు మోపడానికి విశాల స్థలం ఇచ్చావు.
నా కాలు జారలేదు.
37 ✽నా శత్రువులను వెంటాడి పట్టుకొన్నాను.
వాళ్ళను నాశనం చేసేవరకు నేను
వెనక్కు తిరగలేదు.
38 మళ్ళీ లేవకుండా వాళ్ళను పూర్తిగా చితగ్గొట్టివేశాను.
వాళ్ళు నా పాదాలకింద కూలారు.
39 యుద్ధంకోసం నీవు నాకు బలాన్ని కట్టబెట్టావు.
నన్ను ఎదిరించిన వాళ్ళను నాకు
లొంగిపొయ్యేలా చేశావు.
40 నా శత్రువులు వెన్ను చూపి పారిపొయ్యేలా చేశావు.
నన్ను ద్వేషించినవాళ్ళను నేను నాశనం చేశాను.
41 వాళ్ళు సహాయంకోసం అరిచారు గాని,
వాళ్ళకు రక్షకుడెవడూ లేడు.
యెహోవాకు మొరపెట్టినా ఆయన వినలేదు.
42 నేను వాళ్ళను నుగ్గునుగ్గుగా చేసి విడిచాను.
గాలికి లేచిపొయ్యే దుమ్ములాగా అయిపొయ్యారు.
వీధి కసువు ఊడ్చి పోసినట్టు వాళ్ళను ఎత్తిపోశాను.
43 ✽ఈ జనం కలహాలలో పడిపోకుండా నన్ను
కాపాడావు.
వేరు వేరు ప్రజలకు నన్ను అధిపతిని చేశావు.
ఇంతకు ముందు నేను ఎరుగని ప్రజలు నాకు
సేవ చేస్తున్నారు.
44 నన్ను గురించి వినీ వినడంతోనే వాళ్ళు నాకు
విధేయులవుతున్నారు.
నాకు లొంగినట్టే విదేశీయులు నటిస్తున్నారు.
45 విదేశీయులకు గుండెలు జారుతాయి.
వణకుతూ వాళ్ళ కోటలలో నుంచి బయటికి వస్తారు.
46 ✽యెహోవా సజీవుడు!
నాకు ఆధార శిలలాంటి ఈ దేవునికి స్తుతి!
నా రక్షకుడైన దేవునికి ప్రశంస కలుగు గాక!
47 నా పక్షంగా ఆయనే పగ తీర్చేవాడు,
ప్రజలను నా వశం చేసేవాడు,
48 నా శత్రువుల బారి నుంచి నన్ను రక్షించేవాడు,
నాపైబడ్డ వాళ్ళకు పైగా నన్ను ఉంచేవాడు,
దౌర్జన్యపరుల చేతిలో నుంచి నన్ను తప్పించేవాడు.
49 అందుచేత, యెహోవా, జనాల మధ్య నీకు
కృతజ్ఞతలు అర్పిస్తాను,
నీ నామసంకీర్తనం చేస్తాను.
50 ✽ఆయన నియమించిన రాజుకు ఆయన గొప్ప
విజయం చేకూరుస్తున్నాడు.
ఆయన అభిషిక్తుడికి దావీదుకు,
అతడి సంతానానికి శాశ్వతంగా
అనుగ్రహం చూపుతాడు.