దావీదు కీర్తన
17
1 యెహోవా, న్యాయ సమ్మతమైన ఫిర్యాదు
ఆలకించు, నా ఆక్రందన విను.
నా ప్రార్థన నిష్కపటమైన పెదవుల నుంచి
వస్తూ ఉంది. నా ప్రార్థన విను.
2 నీ చూపులు న్యాయంమీదే ఉంటాయి.
నాకు సరైన తీర్పు నీ సన్నిధానంనుంచి
వస్తుంది గాక!
3 నా హృదయాన్ని పరిశోధించావు.
రాత్రివేళ నన్ను సందర్శించావు.
నీవు నన్ను పరీక్షించావు.
నాలో చెడ్డ ఉద్దేశాలేమీ లేకపోవడం చూశావు.
మాటల్లో అతిక్రమం చేయనని
నిశ్చయించుకొన్నాను.
4 మనుషుల క్రియాకలాపాల విషయమైతే,
నీ నోటి మాటల మూలంగా దౌర్జన్యం చేసేవాళ్ళ
మార్గం నుంచి తప్పించుకొన్నాను.
5 నా పాదాలు నీ దారినే అంటిపెట్టుకొని ఉన్నాయి.
అవి జారలేదు.
6 దేవా, నీవు నాకు జవాబిస్తావని నీకు మొర పెట్టాను.
నాకు చెవి ఒగ్గు. నా మాటలు ఆలకించు.
7 కుడి చేతిలో నీ శరణాగతులను
శత్రువుల బారినుంచి రక్షించేవాడా,
ఆశ్చర్యకరమైన నీ అనుగ్రహం నాకు చూపు!
8 దుర్మార్గులు నన్ను నాశనం చెయ్యాలని చూస్తున్నారు.
9 వాళ్ళ చేతిలో చిక్కకుండేలా నీ కనుపాపలాగా
నన్ను కాపాడు.
నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
10 వాళ్ళు కఠిన హృదయులు.
వాళ్ళ నోట గర్వం ఉట్టిపడుతుంది.
11 మా అడుగు జాడలను బట్టి వాళ్ళు ఇప్పుడు
మమ్మల్ని చుట్టుముట్టారు.
మమ్మల్ని నేల కూల్చాలని గురి పెట్టి
చూస్తున్నారు.
12 వాళ్ళు ఎప్పుడు చీల్చివేద్దామా అని
పొంచి ఉన్న సింహంలాగా,
చాటుగా నక్కివున్న కొదమ సింహంలాగా ఉన్నారు.
13 యెహోవా, లే! వాళ్ళను ఎదుర్కొని కూలద్రొయ్యి.
దుర్మార్గుల చేతిలో నుంచి నీ ఖడ్గంతో నన్ను తప్పించు.
14 ఈ మనుషులు లౌకిక విచారం గలవాళ్ళు,
వీళ్ళ వంతు ఈ జీవితంలోనే ఉంది.
ఇలాంటి వాళ్ళ బారినుండి నీ చేతిబలంతో
నన్ను రక్షించు.
వాళ్ళ కడుపు మంచి పదార్థాలతో నింపుతావు.
వాళ్ళు చాలా మంది పిల్లలను కని
తృప్తి చెందుతారు.
తమ ఆస్తిపాస్తులు తమ పిల్లలకు
విడిచి పెట్టి పోతారు.
15 నేనైతే న్యాయవర్తనుణ్ణి.
నీ ముఖదర్శనం నాకు కలుగుతుంది.
నేను లేచేటప్పుడు నీ స్వరూపాన్ని చూచి
తృప్తి చెందుతాను.