గాయకుల నాయకుడికి. రాగం: అష్టమశ్రుతి. దావీదు కీర్తన.
12
1 యెహోవా! సహాయం చెయ్యి! భక్తిపరులు
లేకుండా పొయ్యారు.
మనుషులలో విశ్వసనీయులు
కనబడకుండా పొయ్యారు.
2 అందరూ ప్రక్కవాళ్ళతో అబద్ధాలు చెప్తారు.
పొగడ్తలు పెదవులమీద, మోసం మనసులో –
ఇదీ వాళ్ళ మాటల ధోరణి.
3  పొగిడే ప్రతి పెదవునూ,
గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ
యెహోవా నాశనం చేస్తాడు.
4 “మా మాటలతో మేము గెలుస్తాం.
మా పెదవులు మావే.
మాకు యజమాని ఎవడు?”–
ఇదీ వాళ్ళ ఆలోచన.
5 అయితే యెహోవా ఇలా అంటాడు:
“దీనావస్థలో ఉన్నవారి బాధనూ,
అక్కరలో ఉన్నవారి మూలుగునూ చూచి
ఇప్పుడే లేస్తాను.
రక్షణ కోసం తహతహలాడుతున్న
వారిని రక్షిస్తాను.”
6 యెహోవా వాక్కులు శుద్ధమైనవి.
మట్టి మూసలో ఏడుసార్లు బాగా పుటం పెట్టి
శుద్ధి చేసిన వెండిలాంటివి.
7 యెహోవా, నీవు వారిని రక్షిస్తావు.
ఈ తరం వారినుంచి ఎల్లకాలం కాపాడుతావు.
8 నీచత్వం పెచ్చు పెరిగిపోతూ ఉంటే,
చెడ్డ మనుషులు విచ్చలవిడిగా నలుదిక్కులా
తిరుగాడుతారు.