10
1 ✽యెహోవా, నీవెందుకు దూరాన నిలిచి ఉన్నావు?కష్ట సమయాల్లో దాగి ఉంటావెందుకు?
2 ✽దుర్మార్గులు గర్వంతో దీనదశలో ఉన్న భక్తులను
దిగమింగడానికి తహతహలాడుతూ ఉన్నారు.
వాళ్ళు పన్నిన కుట్రలలో వాళ్ళే చిక్కుపడిపోతారు గాక!
3 దుర్మార్గులు తమ ఆశల గురించి
గొప్పలు చెప్పుకొంటారు,
స్వలాభం కోసం అర్రులు చాపే వాళ్ళను దీవిస్తారు,
యెహోవాను తృణీకరిస్తారు.
4 పొగరుబోతులై ఈ దుర్మార్గులు
“దేవుడు ఇదంతా చూడడంలేదు” అనుకుంటారు.
దేవుడున్నాడని వాళ్ళెప్పుడూ తలపోయరు.
5 వాళ్ళు తమ జీవిత విధానాలలో ఎప్పుడూ
పట్టు విడవకుండా ఉంటారు.
నీ న్యాయ నిర్ణయాలు ఉన్నతంగా ఉండి వాళ్ళ
చూపుకు కూడా అందవు.
తమ పగవాళ్ళందరినీ వాళ్ళు
తృణీకారంతో చూస్తారు.
6 “మాకు చలనం లేదు.
తరతరాలకు మాకు క్షేమం ఉంటుంది” –
ఇదీ వాళ్ళ ఆలోచన.
7 వాళ్ళ నోళ్ళు శాపనార్థాలతో, కపటంతో,
వంచనతో నిండి ఉన్నాయి.
కీడు, మోసం వాళ్ళ మాటల్లో ఉట్టిపడుతాయి.
8 గ్రామాలలో చాటున నక్కి కూచుంటారు.
మాటు దాగివుండి నిర్దోషులను హత్య చేస్తారు.
నిస్సహాయులను ఎలా పట్టుకుందామా అని
చూస్తూ ఉంటారు.
9 గుహలో సింహంలాగా వీళ్ళు పొంచి ఉంటారు.
దిక్కులేని వారిని పట్టుకోవడానికి
ఎక్కడో నక్కి ఉంటారు.
వారిని పట్టుకొని తమ వలలో పడవేసుకుంటారు.
10 దిక్కులేనివారు నలిగిపోతారు, అణిగి ఉంటారు.
ఆ బలాత్కారుల వల్ల నిస్సహాయులు కూలుతారు.
11 “దేవుడు మరచిపొయ్యాడు లే.
తన ముఖం మరో వైపు త్రిప్పాడు.
ఇటు వైపు ఎప్పుడూ దృష్టి సారించడు”
అనుకుంటారు వాళ్ళు.
12 యెహోవా, లే! దేవా, నీ చెయ్యి ఎత్తు!
దీనావస్థలో ఉన్నవారిని విస్మరించబోకు!
13 దుర్మార్గులు దేవుణ్ణి తృణీకరిస్తారెందుకు?
నీవేమీ విచారణ చేసి శిక్షించవని
వాళ్ళు తమ హృదయాల్లో అనుకుంటారెందుకు?
14 ✽అయితే నీవిదంతా చూస్తూనే ఉన్నావుగా.
ఈ కష్టం, ఈ బాధ నీవు కనిపెట్టి చూస్తున్నావు.
నీవు వాళ్ళకు ప్రతీకారం చేసి తీరుతావు.
దిక్కులేనివారు నీ మీద ఆధారపడవచ్చు.
అనాథలకు నీవు సహాయం చేసేవాడవు.
15 ✝దుర్మార్గుల భుజ బలం చిన్నా భిన్నం చెయ్యి!
చెడ్డవాళ్ళ చెడు అంతరించేవరకు దానిని పరిశోధించు!
16 యెహోవా ఎప్పటికీ రాజు✽.
ఇతర జనాలు ఆయన దేశంలో లేకుండా
నాశనమయ్యాయి.
17 యెహోవా! దీనావస్థలో ఉన్న భక్తుల ప్రార్థన విన్నావు.
నీవు వారి హృదయాలను సుస్థిరం చేస్తావు.
అనాథలకూ, హింసకు గురి అయిన వారికీ
న్యాయం చేకూర్చడానికి నీవు శ్రద్ధగా వింటావు.
18 ✽లోక సంబంధులు వారిని ఇంకా బెదిరించకుండా
ఉండాలని నీ ఉద్దేశం.