గాయకుల నాయకుడికి. రాగం: ముతలబేన్. దావీదు కీర్తన.
9
1 యెహోవా! హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తాను.
నీ అద్భుత క్రియలన్నిటినీ ప్రసిద్ధి చేస్తాను.
2 నీ విషయంలో నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను.
సర్వాతీతుడా, నీ పేరును కీర్తిస్తాను.
3 నీవు నా తరఫున న్యాయం తీర్చావు.
సింహాసనం మీద కూర్చుని ధర్మసమ్మతంగా
తీర్పు చేశావు.
4 కనుక నా శత్రువులు వెనక్కు మళ్ళుతారు;
నీ సమక్షంలో వాళ్ళు తొట్రుపడి కూలుతారు.
5 ఇతర జనాలను నీవు ఖండించావు.
దుష్టులను సంహారం చేశావు.
వాళ్ళ పేరు ఇకెన్నడూ ఉండకుండా
తుడుపు పెట్టావు.
6 శత్రువులు పూర్తిగా నాశనమైపొయ్యారు.
వాళ్ళ పట్టణాలను పెళ్ళగించి పారవేశావు.
అవి నాశనమై ఇక జ్ఞప్తికి రావు.
7 యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
ఆయన తన సింహాసనాన్ని న్యాయ విచారణ
కోసం సిద్ధం చేశాడు.
8 ఆయన ధర్మ సమ్మతంగా లోకానికి
తీర్పు తీరుస్తాడు.
జనాలకు సమదృష్టితో న్యాయం తీరుస్తాడు.
9 హింసకు గురయిన ప్రజకు యెహోవా శరణ్యం.
కష్ట సమయాలలో ఆయనే వారికి శరణ్యం.
10 యెహోవా, నిన్ను వెదకేవారిని నీవు విడిచిపెట్టలేదు,
గనుక నిన్ను ఎరిగినవారు
నీమీద నమ్మకం ఉంచుతారు.
11 సీయోనులో ఉంటున్న యెహోవాను కీర్తించండి.
ఆయన చర్యలను ప్రజలమధ్య చాటించండి.
12 రక్తపాతాన్ని గురించి ఆయన విచారణ చేస్తాడు.
ఆయనకిది జ్ఞాపకమే.
దీన దశలో ఉన్నవారి విలాపం కూడా
ఆయన మరిచిపోడు.
13  నన్ను కరుణించు, యెహోవా!
నా పగవాళ్ళు నన్ను పెట్టిన బాధను చూడు!
14 నీ మహాత్యాన్నంతా సీయోను కుమారి ద్వారాల దగ్గర
నేను చాటించేలా మరణ ద్వారాలనుంచి
నన్ను పైకి లేవనెత్తేవాడవు నీవు.
నీవు ప్రసాదించిన ముక్తినిబట్టి అక్కడ ఆనందంతో
గంతులు వేస్తాను.
15 ఇతర జనాలు తాము త్రవ్విన గోతిలో అడుగున
పడిపొయ్యాయి.
వాళ్ళు ఒడ్డిన వలలోనే వాళ్ళ కాళ్ళు
తగులుకొన్నాయి.
16 యెహోవా న్యాయం జరిగించి తనను
తెలియజేసుకొన్నాడు.
దుర్మార్గులు తమ చేతులతో చేసుకొన్న దానిలో
చిక్కుకొన్నారు. (సెలా. హీగాయోన్‌)
17  దుర్మార్గులూ, దేవుణ్ణి మరచిపోయే ప్రజలూ
మృత్యులోకంలో పడిపోతారు.
18 అక్కరలో ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ
మరచిపోయేవాడు కాదు.
దీనదశలో ఉన్నవారి ఆశాభావం ఎల్లకాలం
నెరవేరకుండా ఉండదు.
19 యెహోవా, లే! మనుషులను గెలవనియ్యకు!
జనాలకు నీ సమక్షంలో తీర్పు జరుగుతుంది గాక!
20  యెహోవా! వాళ్ళకు భయం పుట్టించు.
జనాలు తాము మానవ మాత్రులమేనని
గుర్తిస్తాయి గాక! (సెలా)