గాయకుల నాయకుడికి. గిత్తీత్‌రాగం మీద పాడతగ్గది. దావీదు కీర్తన.
8
1 యెహోవా! మా ప్రభూ!
భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఉత్తమమైనది!
ఆకాశాలలో నీ మహత్యాన్ని కనుపరుస్తున్నావు.
2 నీ శత్రువుల కారణంగా విరోధులనూ
పగ తీర్చు కొనేవాళ్ళనూ ఊరుకొనేలా చేయడానికి
నీవు చిన్న పిల్లలూ చంటి బిడ్డలూ
స్తుతించేలా చేశావు.
3 నీవు చేతితో చేసిన ఆకాశాలనూ,
నీవు కలిగించిన చంద్ర నక్షత్రాలనూ
నేను చూస్తూ ఇలా అనుకుంటాను:
4 నీవు మనిషిని తలచుకోవడానికి వాడెంతటివాడు?
నరపుత్రుణ్ణి గురించి ఆలోచించడానికి
వాడేపాటివాడు?
5 అతణ్ణి కొంతకాలం పాటు దేవదూతలకంటే
తక్కువ వాణ్ణి చేశావు.
కాని, గౌరవం, ఘనతలు అతడిమీద
కిరీటంలాగా ధరింపజేశావు.
6  నీ చేతితో నిర్మించిన వాటి మీద అతనికి
అధికారమిచ్చావు.
అతడి పాదాల క్రింద సమస్తమూ ఉంచావు.
7 గొర్రెలూ ఎద్దులూ ఒకటేమిటి భూజంతువులనూ,
8 గాలిలో ఎగిరే పక్షులనూ, సముద్రంలో చేపలనూ,
సముద్రాల త్రోవలలో తిరిగే అన్ని జలచరాలనూ
అతడి పాదాల క్రింద ఉంచావు.
9 యెహోవా! మా ప్రభూ!
భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఉత్తమమైనది!