దావీదు వ్రాసినది. బెన్‌యామీన్‌గోత్రికుడైన కూష్‌ విషయం యెహోవాకు ఇది పాడాడు.
7
1 యెహోవా, నా దేవా! నిన్ను శరణు జొచ్చినవాణ్ణి.
నన్ను రక్షించు, నన్ను హింసకు గురి చేసే వాళ్ళ
బారినుండి తప్పించు.
2 నన్ను తప్పించడానికి ఎవరూ లేకపోతే,
వాళ్ళు సింహాలలాగా నా పైకి లంఘించి,
నన్ను చీల్చి చెండాడుతారు.
3 యెహోవా, నా దేవా! నా చేతులు చెడ్డవైతే,
4 నా మిత్రుడు చేసిన మేలుకు నేను కీడు చేసివుంటే,
నామీద పగపట్టిన వాళ్ళను
నిష్కారణంగా దోచుకొని ఉంటే,
5 అలాంటప్పుడు నా శత్రువులను నా పై అలాగే
పడనియ్యి.
నన్ను పట్టుకొని నేలకు పడదొక్కనియ్యి.
నా బ్రతుకును, నా పేరు ప్రతిష్ఠలను
మంటగలపనియ్యి. (సెలా)
6  యెహోవా! నా శత్రువుల ఆగ్రహాన్ని చూచి
కోపంతో లే!
న్యాయం జరగాలని నిర్ణయించావు.
నా దేవా, ఆవేశంతో లే.
7 జనాలు నీ చుట్టు గుమికూడి ఉండగా,
వాళ్ళకు పైగా ఆసీనుడవు కావడానికి
మళ్ళీ రా.
8 యెహోవా జనాలకు తీర్పు తీరుస్తాడు.
యెహోవా! నా న్యాయ ప్రవర్తన, నిజాయితీ
ప్రకారం నాకు న్యాయం చేకూర్చు.
9 దుర్మార్గుల చెడుతనాన్ని అరికట్టు.
సన్మార్గులను సుస్థిరం చెయ్యి.
న్యాయవంతుడైన దేవుడు మనసునూ హృదయాన్నీ
పరిశోధిస్తున్నవాడు.
10 దేవుడు యథార్థ హృదయులను
కాపాడుతున్న వాడు.
ఆయనే నన్ను సంరక్షిస్తున్న డాలులాంటివాడు.
11 దేవుడు న్యాయంగా తీర్పును తీరుస్తాడు.
ఆయనకు కోపం ప్రతి రోజూ వస్తుంది.
12 వాళ్ళు ఆయన వైపు తిరగకపోతే
ఆయన తన కత్తి పదును చేస్తాడు.
ఆయన విల్లు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు.
13 తన మరణాయుధాలను తయారు చేశాడు.
తన అగ్ని బాణాలను సిద్ధం చేశాడు.
14 దుర్మార్గుడు చెడుగుతో ప్రసవ వేదన పడుతున్నాడు.
వాడి కడుపులో ఉన్నది కీడు. కనేది మోసం.
15 వాడు గోతిని తవ్వాడు లోతుగా.
తాను చేసిన గుంటలో తానే పడతాడు.
16 వాడు చేసిన కీడు వాడి తల మీదికే వస్తుంది.
వాడు ఉద్దేశించిన దౌర్జన్యం వాడి
నడినెత్తిమీదే పడుతుంది.
17 నేను యెహోవా న్యాయాన్ని ఉద్దేశించి
ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను.
సర్వాతీతుడైన యెహోవా పేరును కీర్తిస్తాను.