గాయకుల నాయకుడికి. పిల్లనగ్రోవితో పాడతగ్గది. దావీదు కీర్తన.
5
1 యెహోవా! నా మాటలు ఆలకించు.
నా నిట్టూర్పుల గురించి ఆలోచించు.
2 నా రాజా, నా దేవా! సహాయం కోసం
మొర పెట్టుకొంటున్నాను.
వినిపించుకో. నిన్నే ప్రార్థిస్తున్నాను.
3 యెహోవా, ఉదయాన్నే నా స్వరం వింటావు.
ప్రొద్దున్నే నీ కోసం సంసిద్ధుడనై
ఎదురుచూస్తాను.
4 నీవు దుర్మార్గాన్ని చూచి
ఆనందించే దేవుడవు కాదు.
చెడుగుకు నీ దగ్గర చోటు లేదు.
5 గొప్పలు చెప్పుకొనేవాళ్ళకు నీ సమక్షంలో
నిలబడడానికి తావు లేదు.
దుర్మార్గం జరిగించే వాళ్ళంటే నీకు అసహ్యం.
6 అబద్ధాలు చెప్పేవాళ్ళను నాశనం చేస్తావు.
హత్య, మోసం చేసేవాళ్ళను యెహోవా
అసహ్యించుకొంటాడు.
7 నేను మట్టుకు నీ కృప సమృద్ధిని బట్టి
నీ ఆలయానికి వస్తాను.
భయభక్తులతో నీ పవిత్రాలయంవైపు చూచి
నిన్ను ఆరాధిస్తాను.
8 యెహోవా, నా శత్రువుల కారణంగా నేను
నీ న్యాయ మార్గంలో నడిచేలా చెయ్యి.
నా ముందర నీ మార్గాన్ని స్పష్టంగా కనుపరచు.
9 వాళ్ళ నోట నమ్మతగ్గ మాట ఒక్కటీ లేదు.
వాళ్ళ ఆంతర్యం భ్రష్టమైనది.
వాళ్ళ గొంతు తెరచి ఉన్న సమాధి.
వాళ్ళ నాలుకలు పొగడుతాయి.
10 దేవా, వాళ్ళకు తీర్పు విధించు.
వాళ్ళ ఎత్తుగడల్లో వాళ్ళనే చిక్కుకోనియ్యి.
వాళ్ళ అతిక్రమాలు అనేకం, గనుక
వాళ్ళను వెళ్ళగొట్టు.
వాళ్ళు నీమీద తిరగబడి ఉన్నారు గదా!
11 నిన్ను శరణు జొచ్చినవారు సంతోషిస్తారు గాక!
వారు ఎప్పుడూ ఆనంద ధ్వనులు చేస్తారు గాక!
ఎందుకంటే నీవే వారికి రక్ష.
నీ పేరు ఎవరికి ప్రియమో వారు
నీ మూలంగా ఆనందమయులు అవుతారు గాక!
12 యెహోవా! న్యాయవంతులను దీవిస్తావు.
నీ అనుగ్రహం వారిని డాలులాగా
ఆవరించి ఉంటుంది.