గాయకుల నాయకుడికి. తంతివాద్యాలతో పాడతగ్గది. దావీదు కీర్తన.
4
1 ✽న్యాయవంతుడవైన నా దేవా!నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబియ్యి.
ఇరుకులో ఉన్న నాకు విశాలతను
కలిగించేవాడవు నీవు.
నా మీద దయ చూపి నా ప్రార్థన✽ ఆలకించు.
2 ✽“మనుషులారా, మీరు ఎన్నాళ్ళ వరకు
నా ఘనతను అవమానంగా మారుస్తారు?
ఎంతకాలమని వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు?
భ్రమపెట్టేవాటిని వెదుకుతూ వుంటారు?” (సెలా)
3 ✽భక్తిపరులను యెహోవా తనకోసం
ప్రత్యేకించుకొన్నాడని తెలుసుకోండి.
నేను యెహోవాకు మొర పెట్టినప్పుడు ఆయన
ఆలకిస్తాడు.
4 ✽భయం కలిగి పాపం చేయకుండా ఉండండి.
మీ పడకల మీద కూడా ధ్యానం చెయ్యండి,
ప్రశాంతంగా ఉండండి. (సెలా)
5 ✽సరైన బలులు అర్పించండి.
యెహోవా పై నమ్మకం ఉంచండి.
6 “మాకెవరు మేలు చేస్తారు?”
అంటున్నారు అనేకులు.
యెహోవా! నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనియ్యి.
7 ✽వాళ్ళ ధాన్యం, ద్రాక్షరసం సమృద్ధిగా లభించిన
నాటి సంతోషం కంటే ఎక్కువ సంతోషం
నా హృదయంలో కలిగించావు నీవు.
8 నేను పడుకొని ప్రశాంతంగా నిద్రపోతాను.
యెహోవా! నీ వల్లే నేను క్షేమంగా నివాసం
చేస్తున్నాను.