2
1 జనాలు అల్లరి చేస్తున్నాయెందుకని?
ప్రజలు వృధాలోచనలు చేయడం దేనికి?
2 భూరాజులు యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ
వ్యతిరేకంగా నిలుచున్నారు,
పరిపాలకులు కలిసి కుట్ర పన్నుతున్నారు.
3 “వారి బంధకాలను తెగతెంచుకొందాం.
వారి కాడిని మననుంచి తీసి పారేద్దాం” అంటారు.
4 పరలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు
నవ్వుతున్నాడు.
ప్రభువు వాళ్ళను చూచి ఎగతాళి చేస్తున్నాడు.
5 అప్పుడు కోపంగా వాళ్ళతో మాట్లాడతాడు.
తన ఆగ్రహంతో వాళ్ళను భయకంపితులను
చేస్తాడు.
6 “నేను ఎన్నుకొన్న రాజును సీయోను అనే నా
పవిత్ర పర్వతం మీద సింహాసనమెక్కించాను”
అంటాడు.
7 “యెహోవా నిర్ణయాన్ని తెలియజేస్తాను.
ఆయన నాతో చెప్పాడు, నీవు నా కుమారుడవు,
ఈ రోజున నిన్ను కన్నాను.
8 నన్నడుగు, లోకంలోని అన్ని జనాలను
నీకు వారసత్వంగా నీ వశం చేస్తాను.
భూదిగంతాలను కూడా నీకు సొత్తుగా ఇస్తాను.
9 ఇనుప దండంతో వాటిని తుత్తునియలు చేస్తావు.
కుండను పగలగొట్టినట్టు వాటిని
ముక్కచెక్కలు చేస్తావు.”
10 కనుక రాజులారా!
తెలివి తెచ్చుకొని మసలుకోండి.
పరిపాలకులారా! హెచ్చరిక పొందండి.
11 భయభక్తులతో యెహోవాను సేవించండి,
వణకుతూ ఆనందించండి.
12 దేవుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి,
లేకపోతే ఆయన కోపగిస్తాడు,
మీకు నాశనం ప్రాప్తిస్తుంది.
ఆయన కోపాగ్ని త్వరగా రగులుకోగలదు.
ఆయనను నమ్మి ఆశ్రయించేవారంతా ధన్యులు.