కీర్తనలు
మొదటి భాగం
(కీర్తనలు 1—41)
1
1 దుర్మార్గుల సలహాల ప్రకారం నడవకుండా,
పాపాత్ముల జీవిత విధానంలో నిలవకుండా,
పరిహాసకులుండే చోట కూర్చోకుండా,
2  యెహోవా ఇచ్చిన ఉపదేశంలో ఆనందిస్తూ,
దాన్ని రాత్రింబగళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవారు
ధన్యజీవులు.
3 వారు పారుతూ ఉన్న కాలువలదగ్గర నాటి ఉన్న
చెట్టువంటివారు,
సరైన కాలానికి, కాపు కాస్తూ, ఆకులు వాడని
చెట్టులాంటివారు.
వారు చేసేదంతా సఫలమవుతుంది.
4 కానీ, దుర్మార్గులు అలా కాదు.
వాళ్ళు గాలికి కొట్టుకుపొయ్యే పొట్టులాంటివారు.
5 గనుక వాళ్ళు దేవుని తీర్పుకు నిలవలేకపోతారు.
పాపాత్ములు న్యాయవంతుల సభలో నిలవరు.
6 న్యాయవంతుల జీవిత విధానం యెహోవాకు
తెలుసు గానీ దుర్మార్గుల జీవిత విధానం
పూర్తిగా నాశనం అవుతుంది.