41
1 “నీవు లివయాటాన్‌ను గాలం వేసి బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు గ్రుచ్చి లాగగలవా?
2 నీవు దానికి ముక్కుత్రాడు వేయగలవా? దాని దవడకు గాలం గ్రుచ్చగలవా?
3 దయ చూపమని అది నిన్ను ప్రాధేయపడుతూ ఉంటుందా? అది నీతో మెత్తమెత్తగా మాట్లాడుతుందా?
4 అది నీతో ఒప్పదం చేసుకొంటుందా? నీవు దాన్ని ఎప్పటికీ దాస్యంలో ఉంచుకొంటావా?
5 పక్షితో ఆడుకొన్నట్టు దానితో ఆటలాడుతావా? నీ ఆడపిల్లలు ఆడుకోవడానికి దాన్ని కట్టివేస్తావా?
6 చేపలు పట్టేవారు దానితో వ్యాపారం చేస్తారా? వారు దాన్ని ముక్కలు చేసి వర్తకులకు అమ్ముతారా?
7 దాని చర్మం నిండా శూలాలు గ్రుచ్చగలవా? దాని తలనిండా చేపలను పొడిచే బరిసెలు గ్రుచ్చగలవా?
8 దాని మీద చేయి వేసుకొన్నావూ అంటే దానితో కొని తెచ్చుకొనే జగడం జ్ఞాపకముంచుకొంటావు! మళ్ళీ ఆ పని చేయవు.
9 దాన్ని వశపరచే ఆశలన్నీ వృథా! దాన్ని చూస్తే చాలు, ఎవరైనా నిలువునా క్రుంగిపోతారు.
10 దాన్ని లేపే సాహసం ఎవరికీ లేదు. అలాంటప్పుడు నా ఎదుట నిలవగలవాడెవడు?
11 ఎవడు నాకేమి ఇచ్చాడు? నేనెవరికి ఏమి అచ్చివున్నాను? ఆకాశమంతటి క్రింద ఉన్నదంతా నాదే!
12 దాని అవయవాలను గురించి నేనేమీ అనకుండా ఊరుకోను. దాని అధిక బలాన్ని గురించి, దాని తీరైన రూపాన్ని గురించి నేనేమీ చెప్పకుండా ఉండను.
13 దాని మీది కవచాన్ని ఎవడు విప్పివేయగలడు? దాని రెండు దవడల మధ్యకు ఎవడైనా రాగలడా?
14 దాని నోటి ద్వారాలను తెరవగలవాడెవడు? దాని దంత వలయం భయంకరం!
15 దాని గట్టి పొలుసులను గురించి దానికెంతో గర్వం! అవన్నీ బిగువుగా కలిసివున్నాయి. వాటిని ఎవరూ తీయలేరు.
16 వాటిలోకి గాలి కూడా చొరబడలేనంతగా అవి ఒకదానికొకటి దగ్గరదగ్గరగా ఉన్నాయి.
17 అవి ఒకదానితో ఒకటి అంటుకొని ఉన్నాయి. అవి పెనవేసుకుపోయి ఉన్నాయి. వాటిని విడదీయడం ఎవరి తరమూ కాదు.
18 అది తుమ్మిందీ అంటే వెలుగు చిమ్ముతుంది. దాని కండ్లు ఉదయ సూర్య కిరణాలలాంటివి.
19 దాని నోట్లోనుంచి మండుతున్న దివిటీలు బయలుదేరినట్లుంటుంది. నిప్పు రవ్వలు అందులోనుంచి ఎగిరిపడినట్లుంటుంది.
20 దాని ముక్కుపుటాలలో నుంచి పొగ బయలుదేరుతుంది. తుకతుక ఉడికే కాగులోనుంచి, జమ్ము మంటలో నుంచి వచ్చే పొగలాంటిదది.
21 దాని ఊపిరివల్ల నిప్పు కణాలు రాజుతాయి. దాని నోట్లోనుంచి మంటలు ఎగసివస్తాయి.
22 దాని మెడలో బలం నిలిచివుంది. దాని ముందర భయం తాండవిస్తుంది.
23 దాని శరీరం ముడతలు ఒకదానికొకటి దగ్గర దగ్గరగా ఉన్నాయి. అది దానిలో దట్టంగా, స్థిరంగా ఉంది.
24 దాని గుండె రాయిలాగా గట్టిది. తిరగటిలో క్రిందిరాయిలాగా కఠినం.
25 అది లేచిందీ అంటే బలాఢ్యులు కూడా భయపడుతారు. అధిక భయంతో తొలగిపోతారు.
26 దానికి ఎదురయ్యే ఖడ్గం నిలవదు. ఈటె, బాణం, బరిసె, ఇవేమీ ఎందుకూ కొరగావు.
27 దానికి ఇనుము గడ్డిపోచ, కంచు పుచ్చిపోయిన కట్టెతో సమానం.
28 బాణం చూచి అది పారిపోదు. వడిసెల రాళ్ళు దానికి చెత్తతో సమానం.
29 గదలు దానికి గడ్డిపరకలే! గలగలమనే ఈటెను చూచి అది నవ్వుతుంది.
30 దాని క్రింది భాగాలు కరుకైన చిల్ల పెంకుల లాంటివి. బురద మీద నురిపిడి కర్రలాగా చాచుకొని పడుకొంటుంది.
31 కాగు మసిలిపోయినట్లు లోతైన నీళ్ళు పొంగేలా చేస్తుంది. అది గొప్ప నదిని తైలం జాడీలాగా చేస్తుంది.
32 నీళ్ళ మీద తాను పోతున్న దారి తన వెనకాలే మెరిసిపోయేలా చేస్తుంది. గొప్ప నదిని చూచేవారికి అది నెరసిన తలలాగా ఉంటుంది.
33 భూమి మీద దాని సాటి ఏదీ రాదు. భయం లేనిదిగా అది సృజించబడింది.
34 పెద్ద పెద్ద వాటినే చూస్తుంది. గర్వానికే పుట్టినట్టున్న అన్ని ప్రాణులకూ అది రాజు.