42
1 అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబు చెప్పాడు:2 ✽“నీవు అన్ని క్రియలూ చేయగలవు. నీ ఉద్దేశాలేవీ నిష్ఫలం కావు. ఈ విషయం నేను తెలుసుకొన్నాను. 3 ✽‘ఇక్కడ తెలివితక్కువ మాటలతో ఆలోచనను చీకటి చేస్తున్నది ఎవరు? అని నీవు అడిగావు.
అలాగే నాకేమీ అర్థం కాని విషయాల గురించి నేను మాట్లాడాను. ఆ విషయాలు అద్భుతంగా ఉన్నాయి, నా గ్రహింపుకు మించినవి. 4 ✽‘ఇప్పుడు విను, నేను మాట్లాడుతాను. నేను నిన్నడుగుతాను. నీవు జవాబు చెప్పు’ అని నీవన్నావు. 5 ✽చెవులారా నిన్ను గురించిన వార్త నేను విన్నాను. ఇప్పుడు నా కండ్లు నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాయి. 6 ✽అందుచేత నన్ను నేనే ఏవగించుకొంటున్నాను. దుమ్ములో, బూడిదలో పడి, పశ్చాత్తాపపడుతున్నాను.
7 ✽యోబుతో మాట్లాడడం యెహోవా ముగించాక, తేమానువాడైన ఎలీఫజుతో ఈ విధంగా అన్నాడు:
“నా సేవకుడైన యోబులాగా మీరు నాతో సరైనది మాట్లాడలేదు. అందుచేత నా కోపం నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద రగులుకొంది. 8 ✽గనుక మీరు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్ళను తీసుకొని నా సేవకుడు యోబు దగ్గరికి వెళ్ళండి. మీ కోసం మీరే హోమబలి అర్పించండి. అప్పుడు నా సేవకుడు యోబు మీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. నేను అతని ప్రార్థన అంగీకరించి తద్వారా మీ మూర్ఖత్వాన్ని బట్టి మిమ్ములను శిక్షించను. నా సేవకుడైన యోబులాగా మీరు నాతో సరైనది మాట్లాడలేదు.”
9 తేమానువాడైన ఎలీఫజు, షూహియావాడైన బిల్దదు, నయమాతువాడైన జోఫరు పోయి, యెహోవా తమతో చెప్పినట్టే చేశారు✽. యెహోవా వీరి పక్షంగా యోబు ప్రార్థనను అంగీకరించాడు.
10 ✽యోబు తన స్నేహితుల పక్షంగా ప్రార్థించిన తరువాత యెహోవా అతణ్ణి ముందున్న క్షేమస్థితికి తిరిగి తెచ్చాడు. మునుపటి దానికి రెట్టింపు అభివృద్ధి అతనికి ప్రసాదించాడు. 11 ✝అతని సోదరీ సోదరులంతా వచ్చారు. అంతకు ముందు అతనికి పరిచయం ఉన్నవారంతా కూడా వచ్చారు. అతనితో కూడా భోజనం చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన అన్ని బాధల విషయంలో అతణ్ణి పరామర్శించి ఓదార్చారు. వచ్చినవారిలో ప్రతి ఒక్కరూ ఒక వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం అతనికి ఇచ్చారు.
12 ✽యెహోవా యోబును మునుపటికంటే ఇప్పుడు ఎక్కువగా దీవించాడు. అతనికి పద్నాలుగు వేల గొర్రెలు, ఆరువేల ఒంటెలు, వెయ్యి ఆడ గాడిదలు చేకూరాయి. 13 ✽అంతే కాకుండా, అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు కలిగారు. 14 అతని పెద్ద కూతురికి యెమీమా అనీ, రెండో కూతురికి కెజియా అనీ, మూడో కూతురికి కెరెన్‌హపుక్ అనీ నామకరణం చేశాడు. 15 ఆ దేశమంతట్లో యోబు కూతుళ్ళంత అందమైన స్త్రీలు ఎక్కడా లేరు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వం పంచి ఇచ్చాడు.