40
1 అప్పుడు యెహోవా యోబుతో ఇలా అన్నాడు:2 ✽“అమిత శక్తిమంతునితో వాదించేవాడు ఆయనకు బుద్ధి చెప్పవచ్చా? దేవునితో తర్కించేవాడు ఆయనకిప్పుడు జవాబివ్వాలి.”
3 ✽అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు:
4 “ఇదిగో, నేను అల్పుణ్ణి, నేను నీకేమి జవాబు చెప్పగలను? నా నోటిమీద చెయ్యి ఉంచుకొంటాను.
5 ఒక సారి మాట్లాడాను. మళ్ళీ నోరెత్తను. రెండు సార్లు మాట్లాడాను గాని ఇంకేమీ చెప్పను.
6 అప్పుడు యెహోవా గాలివానలో నుంచి యోబుతో మాట్లాడాడు, 7 ✽“ధైర్యం తెచ్చుకొని లేచి నడుము కట్టుకో! నేను నిన్ను అడుగుతాను, నీవు జవాబు చెప్పు.
8 ✽నేను న్యాయవంతుణ్ణి కాదంటావా? నీవు నిర్దోషివి అనిపించుకోవడానికి నా మీద నేరం మోపుతావా?
9 ✽దేవుని భుజ బలంలాంటిది నీకు ఉందా? ఆయనలాగా నీవు ఉరుము కంఠంతో గర్జించగలవా?
10 అలాగైతే వైభవంతో, ఘనతతో నిన్ను నీవు అలంకరించుకో! మహాత్మ్యం, మహిమ ధరించుకో!
11 నీ కోప ప్రవాహాన్ని కుమ్మరించు! గర్విష్ఠులందరినీ చూచి, వారికి గర్వభంగం చేయి!
12 గర్వించినవారందరినీ చూచి అణగద్రొక్కు! దుర్మార్గులు నిలిచిన చోట వారిని క్రిందికి త్రొక్కివేయి!
13 వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు! భూమిలో వారిని బంధించు!
14 అలా చేస్తే నీ కుడి చెయ్యి నిన్ను రక్షించగలదని అప్పుడు నీ విషయం నేను ఒప్పుకొంటాను!
15 ✽బహేమోత్‌ను గురించి ఆలోచించు. దానిని– నిన్ను కూడా– కలగజేసినది నేనే. అది ఎద్దులాగా గడ్డి మేస్తుంది.
16 దాని నడుములో ఎంత బలం ఉంది! దాని కడుపు కండరాలలో ఎంత శక్తి ఉంది!
17 దేవదారు చెట్టుకొమ్మ వంగినట్టు అది తన తోకను వంచుతుంది. దాని తొడల్లోని నరాలు గట్టిగా కలపబడివున్నాయి.
18 దాని ఎముకలు కంచు గొట్టాలవంటివి. దాని అవయవాలు ఇనుప కడ్డీలలాగా ఉన్నాయి.
19 దేవుని సృష్టి విధానం దృష్ట్యా అది అగ్రగణ్యం. దాని సృష్టికర్త దాన్ని ఖడ్గంతో సమీపించ గలడు.
20 కొండలు దానికి మేత సరఫరా చేయిస్తాయి. అడవి మృగాలన్నీ దాని దగ్గర ఆడుకొంటాయి.
21 కలువ మొక్కల క్రింద అది పడుకొంటుంది. దానికి దాగే స్థలం జమ్ముగడ్డిలో, చిత్తడి ప్రదేశాలలో ఉంది.
22 కలువ చెట్ల నీడ దానికి కప్పుగా ఉంటుంది. కాలువలో నిరవంజి చెట్లు దాన్ని ఆవరించి ఉంటాయి.
23 ఏరు పొంగిపొర్లితే, దానికేమీ భయం అనిపించదు. యొర్దాను నది పొంగి, దాని నోటి దాకా వచ్చినా, దాని ధైర్యం చెడిపోదు.
24 అది చూస్తూవుంటే, దాన్నెవరైనా పట్టుకోగలరా? ఎవరైనా దాని ముక్కుకు గాలం వేయగలరా?