39
1 “కొండలమీద తిరుగాడే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? లేళ్ళు పిల్లలను ఈనేదెప్పుడో నీవు గుర్తించగలవా?
2 అవి ఎన్ని నెలలు మోస్తాయో లెక్కించగలవా? అవి ఈనేదెప్పుడో నీకు తెలుసా?
3 అవి వంగి ఈనుతాయి. అప్పుడే వాటికి నొప్పులు పోతాయి.
4 వాటి పిల్లలు బలిసిపోతూ అరణ్యంలో పెరుగుతాయి. తల్లులను విడిచిపోతాయి. మళ్ళీ రావు.
5 అడవిగాడిదకు స్వేచ్ఛ ఇచ్చినవాడు ఎవడు? అడవి గార్దభం కట్లు విప్పినదెవరు?
6 నేను అరణ్యాన్ని దానికి ఇల్లుగా చేశాను. ఉప్పునేలలు దాని ఉనికిపట్టుగా చేశాను.
7 దానికి పట్టణంలోని సందడి లెక్కేలేదు. తోలేవాడు పెట్టే కేకలు దానికి వినిపించవు.
8 కొండలలో తిరుగాడుతూ పచ్చిక మేస్తుంది. అది పచ్చగడ్డి ఎక్కడ ఉందా అని వెదుకుతూ ఉంటుంది.
9 గురుపోతు దానంతట అదే నీకు లోబడుతుందా? రాత్రులు అది నీ కొట్టంలో నిలుస్తుందా?
10 గురుపోతును పగ్గంతో బంధించి, నాగటి చాలులో నడిపించగలవా? నీవు దాన్ని తోలి, దానితో లోయలను చదును చేయగలవా?
11 దాని బలం గొప్పదని దాన్ని నీవు నమ్మగలవా? నీ పని దానికి అప్పగిస్తావా?
12 నీ ధాన్యం ఇంటికి తెస్తుందనీ, ధాన్యాన్ని కళ్ళంలో సమకూరుస్తుందనీ దాని మీద నమ్మకం ఉంచుతావా?
13 నిప్పుకోడి సంతోషంతో రెక్కలు ఆడిస్తుంది. దానికి మంచి రెక్కలు, ఈకలు ఉన్నాయి. అయినా దానిది మృదు స్వభావమా?
14 కాదు. అది నేల మీద గుడ్లు పెట్టి వాటిని వదిలివేస్తుంది. ఇసుక వాటికి వేడి కలిగిస్తుంది.
15 దేని పాదమైనా వాటిని తొక్కవచ్చు. అడవిమృగం ఏదైనా వాటిని చితకదొక్కవచ్చు. ఈ సంగతి అది ఇట్టే మరిచిపోతుంది.
16 తన పిల్లలు తనవి కానట్టే వాటి పట్ల ఎంతో కాఠిన్యం వహిస్తుంది. దాని కష్టమంతా వృధా అయిపోయినా, దానికి ఫరవాలేదు.
17 దేవుడు దానిని తెలివితేటలు లేనిదిగా చేశాడు. దానికి దేవుడు బుద్ధి ఇవ్వలేదు.
18 అయినా అది లేచీ లేవగానే, గుర్రాన్నీ, రౌతునూ ధిక్కరిస్తుంది.
19 గుర్రానికి బలం ఇచ్చినది నీవేనా? దాని మెడను జూలుతో కప్పినది నీవేనా?
20 మిడతలాగా అది గంతులు వేస్తుంది. దాన్నలా చేసినది నీవా? దాని ముక్కుపుటాలలో నుంచి వెలువడే సకిలింత భయంకరం!
21 అది లోయలో కాలు దువ్వుతూ, తన బలాన్ని బట్టి సంతోషిస్తూ, ఆయుధాలను కూడా ఎదుర్కొనేందుకు పోతుంది.
22 భయం అంటే దానికి ఎగతాళి. దానికి నదురు బెదురూ లేదు. ఖడ్గాన్ని చూచినా అది వెనక్కు తిరగదు.
23 అంబులపొది, తళుక్కుమంటూ ఈటెలూ బల్లేలూ దానిప్రక్కన గల గల ధ్వని చేస్తూ ఉంటే, 24 తీవ్ర ఉద్రేకంతో రెచ్చిపోయి, నేలపై వేగంగా పరుగులెత్తుతుంది. బాకా నాదానికి అదేమీ నిశ్చేష్టం కాదు.
25 బాకా నాదం విన్నప్పుడెల్లా ‘ఆహా, ఆహా’ అంటుంది. దూరంనుంచే యుద్ధం వాసన పసిగట్టగలదు. సేనా నాయకుల కేకలు, యుద్ధ ఘోష వింటుంది.
26 డేగ రెక్కలు చాచి, దక్షిణంవైపు పైకి ఎగురుతుందంటే అది నీ జ్ఞానంవల్లనా?
27 గరుడపక్షి నీవు ఆజ్ఞాపిస్తేనే పైకి ఎగిరిపోయి ఎత్తయిన చోట గూడు కట్టుకొంటుందా?
28 అది కొండ చరియలలో నివాసముంటుంది. కొండపేటున, ఎవరూ దగ్గరికి చేరలేని చోట గూడు కట్టుకొంటుంది.
29 అక్కడనుంచి తన ఎరకోసం వెదుకుతుంది. దాని కన్నులు దూరంనుంచే దాన్ని చూస్తాయి.
30 దాని పసిపిల్లలు రక్తం పీలుస్తాయి. హతమైనవారు ఉన్న చోటే అది కూడా ఉంటుంది.