38
1 ✽అప్పుడు యెహోవా గాలివాన నుంచి యోబుకు ఈ విధంగా జవాబిచ్చాడు:2 ✽“ఇక్కడ తెలివితక్కువ మాటలు పలికి ఆలోచనను చీకటి చేస్తున్నది ఎవరు?
3 ✽ధైర్యం తెచ్చుకొని, లేచి, నడుము కట్టుకో! నేను నిన్ను అడుగుతాను. నీవు జవాబు చెప్పు.
4 ✽నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకే గనుక వివేకం ఉంటే చెప్పు!
5 దాని కొలతలు నిర్ణయించినదెవరు? – నీకు తెలుసు గదా! దాని మీద కొలనూలు వేసినదెవరు?
6 దాని స్తంభాలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? దానికి మూలరాయి వేసినదెవరు?
7 ✽అప్పుడు వేకువ చుక్కలు కలిసి గానం చేశాయి. దేవ కుమారులంతా ఆనంద ధ్వనులు చేశారు.
8 సముద్రం భూగర్భంలో నుంచి ఒక పెట్టున పొంగిపొర్లి వచ్చినప్పుడు దానికి తలుపులు మూసివేసినదెవరు?
9 మేఘాన్ని దానికి వస్త్రంగా, కటిక చీకటి దానికి పొత్తి గుడ్డగా నేను చేసినప్పుడు నీవెక్కడున్నావు?
10 దానికి సరిహద్దులను ఏర్పరచి, దానికి తలుపులూ, వాటి గడియలూ పెట్టి, 11 ‘నీవు ఇంతవరకే రావాలి. మరీ, చెలరేగే అలలు ఇక్కడే ఆగిపోవాలి’ అని నేను చెప్పినప్పుడు నీవెక్కడ ఉన్నావు?
12 ✽నీ రోజుల్లో నీవు వేకువను శాసించావా?
13 అది భూమి అంచులను పట్టుకొని దుర్మార్గులను దానిలో లేకుండా దులిపివేసేలా నీవు ఎప్పుడైనా ఉదయానికి దాని స్థలాన్ని నిర్ణయించావా?
14 భూమి ముద్ర వేయబడ్డ బంకమట్టిలాగా మారుతుంది. అది విచిత్రంగా ఉన్న వస్త్రంలాగా కనిపిస్తుంది.
15 అప్పుడు దుర్మార్గుల దగ్గరనుంచి వారి వెలుగు తొలగించడం జరుగుతుంది. పైకెత్తిన చెయ్యి విరగ్గొట్టడం జరుగుతుంది.
16 సముద్రంలోని ఊటలలోకి ప్రవేశించావా నీవు? జలాగాధం లోతులో తిరిగావా?
17 మృత్యు ద్వారాలు నీకు తెరుచుకున్నాయా? చావు నీడల గుమ్మాలను నీవు చూశావా?
18 భూగోళం ఎంత విశాలమో నీవు చూశావా? ఇదంతా నీకు తెలిస్తే చెప్పుకో!
19 వెలుగు నివాస స్థలం ఎక్కడ? దానికి మార్గం ఎటు? చీకటి ఉండేదెక్కడ?
20 వాటి పొలిమేరలకు వాటిని తీసుకువెళ్ళగలవా? వాటి నివాస స్థలానికి త్రోవలు ఏవో నీకు తెలుసా?
21 ఇదంతా నీకు తెలిసేవుంది గదా! నీవు అప్పటికే పుట్టావు గదా! ఇప్పుడు నీవు చాలా ముసలివాడివి!
22 నీవు చలిమంచు నిలువ ఉన్న స్థలాలకు వెళ్ళావా? వడగండ్ల ఖజానాలు నీవు చూశావా?
23 కష్ట కాలానికని వాటిని అట్టే పెట్టి ఉంచాను. రణ రంగానికి, యుద్ధ కాలానికి వీటిని ఉంచాను.
24 వెలుగును ఏ స్థలంలో వెదజల్లడం జరుగుతుంది? భూమిమీద తూర్పు గాలులు ఎక్కడనుంచి చెల్లా చెదరవుతాయి? ఆ త్రోవలు నీకు తెలుసా?
25 ప్రచండ వర్షం పొర్లిపారేలా భూమిమీద పాయలుగా చీల్చినదెవరు? ఉరుములో మెరుపుకు మార్గం ఏర్పరచినదెవరు?
26 నిర్జన ప్రదేశంలో భూమి మీద వర్షం కురిపించేది ఎవరు? మనుషులు లేని ఎడారిలో వాన రప్పించేది ఎవరు?
27 ఆ విధంగా పాడైపోయిన బీడు భూమిని తృప్తిపరచి, అందులో లేత గడ్డి మొక్కలను మొలిపించేదెవరు?
28 వర్షానికి తండ్రి ఉంటాడా? మంచు బిందువులను కన్నదెవరు?
29 మంచు గడ్డ వచ్చేది ఎవరి గర్భంలో నుంచి? పై నుంచి దిగి వచ్చే చల్లని మంచును పుట్టించేదెవరు?
30 నీళ్ళు రాయిలాగా అయిపోతాయి. లోతైన నీళ్ళ ఉపరితలం గడ్డ కట్టుకుపోతుంది.
31 కృత్తిక నక్షత్ర సముదాయాన్ని నీవు అరికట్టగలవా? మృగశీర్ష నక్షత్రాల బంధకాలను నీవు విప్పగలవా?
32 నక్షత్ర రాసులు సకాలంలో ఉదయించేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను, వాటికి చెందిన నక్షత్రాలను నీవు నడిపించగలవా?
33 ఆకాశాల్లో ప్రవర్తిల్లే నియమాలు నీకు తెలుసా? ఆ నియమాలను భూమి మీద స్థాపించగలవా?
34 మేఘాలకు ఆజ్ఞాపించి, జల ప్రవాహాలు నిన్ను ముంచి ఎత్తేలా చేయగలవా?
35 పిడుగులను శాసించి, వాటిని బయటికి రప్పించి ‘ఇదిగో, మేమున్నాం’ అని వాటిచేత అనిపించగలవా?
36 ✽మనసుకు జ్ఞానమిచ్చినదెవరు? హృదయానికి తెలివితేటలు ఇచ్చినది ఎవరు? మేఘాలను లెక్క పెట్టడానికి కావలసిన జ్ఞానం ఎవరికి ఉంది?
37 దుమ్ము గట్టి పడినప్పుడు, మట్టి పెళ్ళలు ఒకదానికొకటి అంటుకొన్నప్పుడు, 38 ఆకాశ పాత్రలలో నుంచి వాన కురిసేలా వాటిని వంచగలవాడెవడు?
39 ✽ఆడ సింహంకోసం ఎరను వేటాడుతావా నీవు?
40 సింహం పిల్లలు గుహలలో పడుకొంటూ ఉంటే, అవి దాక్కునే చోట పొంచి ఉంటే, నీవు వాటి ఆకలి తీరుస్తావా?
41 కాకి పిల్లలు ఆహారం లేక తిరుగాడుతూ దేవునికి మొరపెట్టుకొంటూ ఉంటే, కాకికి ఆహారం పెట్టేదెవరు?