37
1 “ఇదంతా చూస్తూవుంటే నా హృదయం వణికిపోతూ వుంది. నా గుండె తన స్థానం తప్పిందనిపిస్తూ ఉంది.
2 వినండి! గర్జించే ఆయన కంఠం వినండి! ఆయన నోటినుంచి వెలువడే ధ్వని ఆలకించండి!
3 ఆకాశం క్రింద సర్వత్రా ఆయన తన స్వరం వినిపిస్తున్నాడు! భూమి కొనలదాకా ఆయన మెరుపులను పంపిస్తున్నాడు!
4 వాటి తరువాత ఆ స్వరం గర్జనలాగా వినిపిస్తుంది. తన గంబీరమైన కంఠంతో ఉరుములాగా గర్జిస్తాడు. ఆయన కంఠం వినిపిస్తూ ఉంటే మెరుపులను ఆయన ఆపివెయ్యడు.
5 దేవుడు అద్భుతంగా ఉరుములో గర్జిస్తాడు. ఆయన గొప్ప క్రియలు చేస్తాడు. వాటిని మనం గ్రహించలేము.
6 ఆయన మంచుకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘నీవు భూమిమీద పడాలి’ అంటున్నాడు. అలాగే వానకూ ప్రచండ వర్షానికీ వర్షించవలసిందని ఆజ్ఞాపిస్తున్నాడు.
7 ప్రతి మనిషి చేతిని మూసి ముద్ర వేస్తాడాయన. ఆ విధంగా వారంతా ఆయన క్రియలను గురించి తెలుసుకొంటారు.
8 అప్పుడు మృగాలు వాటి గుహలలో చొరబడతాయి. దాక్కునే చోట్లలో ఉండిపోతాయి.
9 దక్షిణాదినుంచి తుఫాను వస్తుంది. ఉత్తరాదినుంచి చలి వస్తుంది.
10 చలిమంచు దేవుని ఊపిరిలోనుంచి పుట్టుకు వస్తుంది. నీరు ఉపరిభాగం గడ్డకట్టుకుపోతుంది.
11 ఆయన నీటితో భారమైన మేఘాలను దట్టంగా ఏర్పరుస్తాడు. మేఘాలలో తన మెరుపులు వ్యాపించేలా చేస్తాడు.
12 మనుషులు ఉన్న భూతలమంతటా మెరుపులూ మేఘాలూ ఆయన ఆజ్ఞల మేరకు సంచారం చేస్తాయి!
13 శిక్షించడానికి గానీ, భూలోక క్షేమం కోసం గానీ, ఆయన అనుగ్రహం చూపడానికి గానీ ఇవి ఆయన ఆజ్ఞ ప్రకారం సంచరిస్తాయి.
14 యోబు, ఈ మాట వినండి! నిదానించి దేవుని అద్భుత క్రియల విషయం ఆలోచించండి.
15 దేవుడు తన మేఘాలను ఎలా నిర్వహిస్తాడో వాటి మెరుపు ప్రకాశించేందుకు దేవుడెలా చేస్తాడో మీకు తెలుసా?
16 మేఘాలు ఏ విధంగా తేలిపోతూ వెళ్ళేలా చేస్తాడో తెలుసా? ఇవి సర్వజ్ఞుడైన దేవుని అద్భుత క్రియలు.
17 దక్షిణం గాలులు వీచినప్పుడు భూమి ప్రశాంతమై, మీ దుస్తులన్నీ ఎలా వెచ్చబడుతాయో తెలిసిన మీకు ఆ సంగతులు తెలుసా?
18 ఆకాశం పోత పోసిన అద్దంలాగా పరిచినట్టుంది. ఆయనతో కలిసి, ఆకాశం ఆ విధంగా విస్తరించేలా చేయగలరా మీరు?
19 మేము ఆయనతో ఏమి చెప్పాలో మాకు బోధించండి! అజ్ఞానాంధకారం వల్ల ఏమి చెప్పాలో తోచడం లేదు.
20 నేను మాట్లాడుతానని ఎవడైనా ఆయనతో చెప్పడం యుక్తమా? ఒక మనిషి తను ఆ విధంగా నిర్మూలమైపోవాలని కోరుతాడా?
21 ఇప్పుడు మేఘాల చాటున ఉన్న ప్రకాశమానమైన వెలుగు కనిపించడం లేదు. గాలి వీచి మేఘాలను తేటపరుస్తుంది.
22 ఉత్తర దిక్కునుంచి బంగారు రంగు గల వెలుగు వస్తుంది. దేవుణ్ణి ఆవరించిన ఆ మహా తేజస్సు అత్యద్భుతకరమైనది.
23 ఆయన అమిత శక్తిమంతుడు. మహత్వపూర్ణుడు, ఆయన మన స్పర్శకు అగోచరుడు. తన మహా నీతిన్యాయాలను ఏ మాత్రమూ తారుమారు చేయడు.
24 అందుచేత మనుషులకు ఆయన అంటే భయభక్తులు ఉంటాయి. మాలో జ్ఞానం ఉంది అనుకునే వారినేమీ ఆయన లెక్కచెయ్యడు!