36
1 ఎలీహు ఇంకా అన్నాడు, 2 “కొంచెం ఉండండి – దేవుని పక్షాన నేనింకా మాట్లాడాలి. ఈ విషయాన్ని మీకు విశదం చేస్తాను.
3 నా జ్ఞానం దూరం నుంచి తెచ్చుకుంటాను. నా సృష్టికర్తకు న్యాయాన్ని ఆరోపిస్తాను.
4 నా మాటలు అబద్ధాలు కానే కావు. మీతో ఉన్నవాడి జ్ఞానం పరిపూర్ణమైనది.
5 ఇదిగో వినండి. దేవుడు మహా బలాఢ్యుడు అయినా ఆయన ఎవరినీ త్రోసివేయడు. ఆయన మహాబలాఢ్యుడు, గొప్ప వివేకం గలవాడు.
6 దుర్మార్గుల ప్రాణం ఆయన కాపాడడు. బీదలకు న్యాయం చేకూరుస్తాడు.
7 న్యాయవంతుల మీది నుంచి ఆయన దృష్టి తొలగదు. రాజులతో పాటు వారిని సింహాసనం మీద కూర్చోబెడతాడు. వారిని శాశ్వతంగా హెచ్చిస్తాడు.
8 మనుషుల సంకెళ్ళతో బంధించబడి ఉంటే, బాధలలో వాళ్ళు చిక్కుబడి వుంటే, 9 వాళ్ళు చేసినదేమిటో ఆయన వాళ్ళకు తెలియజేస్తాడు. వాళ్ళు విర్రవీగి చేసిన తిరుగుబాట్లను వాళ్ళకు చూపుతాడు.
10 హెచ్చరిక వినేందుకు వాళ్ళ చెవులు తెరుస్తాడు. చెడుగును మాని రండని ఆజ్ఞాపిస్తాడు.
11 వారు ఆయన మాట విని ఆయనను సేవిస్తే బ్రతికినన్నాళ్ళూ క్షేమంగా, వారి సంవత్సరాలన్నీ సుఖంగా గడుపుతారు.
12 వారు వినకపోతే కత్తివాతకు గతించిపోతారు. గ్రహింపు లేకుండానే చనిపోతారు.
13 హృదయంలో భక్తిలేనివాళ్ళు కోపం కూడబెట్టు కుంటారు. దేవుడు వాళ్ళను బంధించినా, వాళ్ళు సహాయంకోసం మొరపెట్టరు.
14 వాళ్ళు యువదశలోనే చస్తారు. గుళ్ళలో ఉన్న పురుష సంపర్కుల గుంపుల మధ్య అంతరించిపోతారు.
15 బాధ అనుభవించేవారిని ఆయన వారి బాధవల్లే విడిపిస్తాడు, కడగండ్ల ద్వారా వారి చెవులను తెరుస్తాడు.
16 మిమ్మల్ని దుర్దశలో నుంచి ఏమీ ఇరుకు లేని విశాల స్థలానికి రావాలని పురికొలుపుతూ ఉన్నాడు. మీ ముందు ఆహారం సమృద్ధిగా ఉంటుంది.
17 కాని, దుర్మార్గులలాగా మీరు విమర్శిస్తే, న్యాయం, తీర్పు ఈ రెండూ కలిసి మీ మీదికి వస్తాయి.
18 మీరు కోపంతో మండిపడుతున్నారు. ఒకవేళ మీరు తిరస్కారం చేయడానికి మీ కోపం కారణం అవుతుందేమో జాగ్రత్త! అప్పుడు గొప్ప విడుదల వెల మిమ్మల్ని తప్పించడం అసాధ్యం.
19 మీ మొర, లేదా, మీ బల ప్రభావాలంతా మిమ్మల్ని బాధలనుంచి తప్పిస్తాయా?
20 ప్రజలు తమ స్థలాలలో అతరించిపోయే రాత్రి రావాలని ఆశించకండి.
21 జాగ్రత్తగా ఉండండి. అక్రమం జోలికి పోవద్దు. బాధకంటే ఇది మంచిదని కోరుకున్నారు గదూ!
22 ఇదిగో వినండి. దేవుడు బల ప్రభావాలతో పై స్థానం వహించినవాడు. ఆయనలాగా ఉపదేశించగలవాడెవడు?
23 ఆయనకు ఇలా చెయ్యాలని చెప్పగలిగిన వాడెవడు? అక్రమం చేశావు అని ఎవడు ఆయనతో అనగలిగాడు?
24 మనుషులు సంకీర్తనం చేసి ఆయన చర్యలను ఘనపరచాలని మీరు జ్ఞాపకముంచుకోండి!
25 ప్రతి మనిషీ వాటిని చూచి ఉన్నాడు. మనుషులు వాటిని దూరంనుంచీ చూస్తారు.
26 ఇదిగో వినండి. దేవుడు గొప్పవాడు. మనం ఆయనను ఎరగము! ఆయన సంవత్సరాల మొత్తం ఎంతో ఎవరూ విచారించి తెలుసుకోలేరు.
27 వాన చినుకులను ఆయన పై నుంచి కురిపిస్తాడు. మంచు పరిమాణాన్ని బట్టి వర్షం కురుస్తుంది.
28 మేఘాలు వర్షిస్తాయి. మనుషుల మీదికి వానలు సమృద్ధిగా దిగజారుతాయి.
29 మేఘాలు ఎలా వ్యాపిస్తాయో, ఆయన పొదరింట్లోనుంచి ఎలా ఉరుములు వస్తాయో ఎవరికి తెలుసు?
30 చూడండి! ఆయన తన చుట్టు మెరుపులు ప్రసరించేలా చేస్తాడు. సముద్రం అడుగున ఉన్న నీళ్ళతో తను కప్పుకుంటాడు.
31 వీటితో ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. ప్రజలకు ఆయన సమృద్ధిగా ఆహారమిస్తాడు.
32 రెండు చేతులతో మెరుపులు పట్టుకొని విసిరివేస్తాడు. పిడుగు గురికి తగిలేట్టు ఆయన ఆజ్ఞాపిస్తాడు.
33 ఈ మెరుపు గాలివానలో ఆయన రాకడను ప్రకటిస్తుంది. అది పశువులకు కూడా చాటిస్తుంది.