35
1 ✽ఎలీహు ఇంకా ఈ విధంగా జవాబిచ్చాడు: 2 “మీరు ఇలా అనుకుంటున్నారు గదా, ‘నేను తప్పిదం చేయడంకంటే తప్పిదం చేయకపోవడంవల్ల నాకు ఎక్కువ ప్రయోజనం వచ్చేదా? నీకు ప్రయోజనం ఉండేదా?’3 ఇది ధర్మమే అనిపిస్తుందా మీకు? దేవునికంటే మీరే ఎక్కువ న్యాయవంతులనుకుంటున్నారా?
4 ✽నేను మీకూ, మీ మిత్రులకూ జవాబిస్తాను.
5 ఆకాశం వైపు చూచి ఆలోచించండి! మీ పై ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాలవైపు చూడండి!
6 మీరు పాపం చేశారంటే ఆయనకేమి చేసినట్టు? మీ తిరుగుబాట్లు ఎక్కువవుతున్నాయంటే, ఆయనకేమి చేశారని?
7 మీరు న్యాయవంతులే అయితే, ఆయనకేమైనా ఇచ్చినట్టు మీ దగ్గరనుంచి ఏమైనా పుచ్చుకుంటాడా?
8 మీ లాంటి మనుషులేక మీ దుర్మార్గం సంబంధిస్తుంది. మీ నీతిఫలం కూడా మనుషులేక చెందుతుంది.
9 ✽అనేక దౌర్జన్య క్రియల కారణంగా ప్రజలు కేకలు వేస్తారు. బలవంతుల భుజబలానికి తట్టుకోలేక, సహాయంకోసం ఆక్రందన చేస్తారు.
10 అయితే రాత్రివేళ పాడడానికి పాటలిచ్చే నా సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడని ఎవ్వరూ అడగరు.
11 భూమిమీద జంతువులకంటే మనకు ఎక్కువ నేర్పే దేవుడు, గాలిలో ఎగిరే పక్షులకంటే మనకు ఎక్కువ బుద్ధి ఇచ్చే దేవుడు ఎక్కడున్నాడని ఎవ్వరూ అడగరు.
12 వాళ్ళు మొరపెట్టుకొన్నా దుర్మార్గుల గర్వం కారణంగా దేవుడు జవాబివ్వడు.
13 దేవుడు వ్యర్థమైన మాటలేమీ వినిపించుకోడు. అమిత శక్తిమంతుడు వాటిని అసలు లెక్క చెయ్యడు.
14 ఖచ్చితంగా మీ మాటలు వినిపించుకోడు. ఎందుకంటే, మీరంటారు గదా ‘నేనాయనను చూడలేను. నా వ్యాజ్యం ఆయన ఎదుట ఉంది గాని, ఆయనకోసం నేను ఎదురుచూస్తూ ఉండాలి.’
15 ‘ఆయన కోపం తెచ్చుకుని శిక్షించడు, ఆయన దురహంకారాన్ని ఏమీ గమనించడు’ అంటారు.
16 ✝ఈ విధంగా యోబు వ్యర్ధంగా నోరు తెరచి మాట్లాడాడు. తెలివి లేకుండానే బోలెడన్ని మాటలు పలికాడు.