34
1 ఎలీహు ఇంకా అన్నాడు, 2 “జ్ఞానులారా! నా మాటలు ఆలకించండి! అనుభవజ్ఞులారా! నేను చెప్పేది వినిపించుకోండి!
3 నోరు ఆహారాన్ని రుచి చూస్తుంది. చెవి మాటలను పరిశీలిస్తుంది.
4 న్యాయమైనదేదో విచారిద్దాం పట్టండి. మేలైనది ఏదో తెలుసుకుందాం రండి.
5 యోబు ఇలా అంటున్నాడు గదా: ‘నేను నిర్దోషిని. నాకు న్యాయం జరగకుండా దేవుడు చేశాడు. 6 అన్యాయంగా నన్ను అబద్ధికుడుగా ఎంచడం జరుగుతూ ఉంది. నేనేమీ ఎదురు తిరగలేదు. అయినా నాకు మానని గాయం కలిగింది.’
7 యోబుకు ఎవరు సాటి? మంచి నీళ్ళు త్రాగినట్టే తిరస్కార వాక్కులు మ్రింగేసేవాడు.
8 దుష్టత్వం చేసేవాళ్ళకు అతడు సావాసగాడు. దుర్మార్గులతో అతడు తిరుగుతున్నాడు.
9 యోబు చెపుతున్నదేమిటంటే, ‘మనిషి దేవునితో సహవాసం చేస్తే అతడికేమీ ప్రయోజనం లేదు’.
10 వివేకులారా! నేను చెప్పేది వినండి. దేవుడు దుర్మార్గం చెయ్యడం ఎన్నటికీ జరగదు. అమిత శక్తిమంతుడు అన్యాయం చెయ్యడమనేది ఎన్నడూ ఉండదు.
11 మనిషి క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ముట్ట చెపుతాడు. ప్రతి ఒక్కరి నడతను బట్టి అతడికి ఫలితం కలిగేలా చేస్తాడాయన.
12 దేవుడు ఎన్నటికీ దుర్మార్గం చెయ్యడు. అమిత శక్తిమంతుడు న్యాయాన్ని తారుమారు చెయ్యడు. ఇది ఖాయం.
13 ఈ భూమి మీద అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారు? ఈ లోకమంతటినీ ఆయనకు ఎవరు అధీనం చేశారు?
14 ఒకవేళ ఆయన హృదయం తన మీదే లగ్నం అయితే ఆయన తన ఆత్మను తన ఊపిరిని తీసివేసే పక్షంలో, 15 మనుషులంతా ఒక్క పెట్టున నాశనమవుతారు. మనిషి తిరిగి దుమ్ములో కలిసిపోతాడు.
16 మీకే గనుక తెలివి ఉంటే, ఇది వినండి. నా మాటలు ఆలకించండి.
17 న్యాయమంటే గిట్టనివాడు పరిపాలిస్తున్నాడా? న్యాయవంతుడు, శక్తిమంతుడు అయిన దేవుని మీద నేరం మోపుతారా?
18 ఆయన రాజును చూచి ‘నీవు పనికిమాలిన వాడివి’ అంటాడు. ప్రధానులతో ‘మీరు దుర్మార్గులు’ అంటాడు.
19 ఆయనకు అధికారులంటే పక్షపాతం లేదు. బీదలకంటే ధనవంతులను ఎక్కువ అప్యాయంగా చూడడు. వీరంతా ఆయన సృజించిన వారే! అలాంటివానితో ఈ విధంగా పలకవచ్చా?
20 వారు నిమిషంలో చనిపోతారు. మధ్య రాత్రి ప్రజల్లో అలజడి బయలుదేరుతుంది. వారు గతించిపోతారు. బలిష్ఠులమీద ఎవరి చేయీ పడకపోయినా వారిని తొలగించడం జరుగుతుంది.
21 మానవుడి నడతల మీద దేవుని దృష్టి ఉంది. మనిషి అడుగులన్నిటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు.
22 చెడుగు చేసేవాళ్ళు దాక్కునేందుకు చీకటి స్థలం ఉండదు, చావునీడ ఉండదు.
23 మనిషి దేవుని విచారణలోకి రాకుండా, అతడి విషయం దేవుడు పసికట్టడానికి ఎంతో కాలం పట్టదు.
24 విచారణ దినాన్ని నియమించకుండానే బలిష్ఠులను ఆయన తునాతునకలు చేస్తాడు. వారి స్థానంలో ఇతరులను ఉంచుతాడు.
25 వారి పనులు ఎలాంటివో ఆయనకు తెలుసు. రాత్రిపూట ఆయన వాళ్ళను తల్లక్రిందులు చేస్తాడు. వాళ్ళను ముక్కలు చేస్తాడు.
26 నలుగురు చూస్తూవుంటే, వాళ్ళ దుర్మార్గాన్ని బట్టి ఆయన వాళ్ళను దండిస్తాడు.
27 ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వాళ్ళు వైదొలగిపోయారు, ఆయన విధానాలను వాళ్ళు లక్ష్యం చేయలేదు.
28 బీదలు మొరపెట్టడానికి కారకులయ్యారు. ఆ మొర దేవుని దగ్గరికి చేరింది. దీన దశలో ఉన్నవారి మొర ఆయన విన్నాడు.
29 ఆయన విశ్రాంతి ప్రసాదిస్తాడు. ఆయన మీద నేరం మోపగలవాడెవడు? కాని, ఆయన ముఖాన్ని చాటు చేసుకొంటే ఆయనను చూడగల వాడెవడు? జాతిపరంగా గానీ, వ్యక్తిపరంగా గానీ ఆయన విధానం ఒకటే –
30 భక్తి లేనివాళ్ళు పరిపాలించకుండా, ప్రజలు వాళ్ళ వలలో చిక్కుకోకుండా ఆయన కాపాడుతాడు.
31  ఎవడైనా దేవునితో ఇలా అంటాడనుకోండి: ‘నేను ఇక మీదట దౌర్జన్యం చెయ్యను. శిక్ష అనుభవించాను. 32 నేను చూడలేనిదేదో నాకు నేర్పు. నేనేదైనా అన్యాయం చేసివుంటే, అలాంటిది ఇప్పటినుంచి చెయ్యను.’
33 కాని, మీరు అలా చేయడం తిరస్కరించినా, మీ ఇష్టాయిష్టాలు అనుసరించి దేవుడు ప్రతిఫలమివ్వాలా? నేను కాదు, మీరే నిశ్చయించుకోవాలి. మీకు తెలిసినదేదో చెప్పండి.
34 నేను చెప్పేది వినే జ్ఞానులు, వివేకులంతా నాతో ఇలా అంటారు:
35 ‘యోబు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో అవగాహనం అంటూ లేదు.’
36 యోబు దుర్మార్గుల్లాగా జవాబులు చెప్పాడు. అందుచేత ఇతడు ఆసాంతం విషమ పరీక్షకు గురి కావలసిందే అని నా ఆశ! 37 ఇతడు అపరాధం చేయడం మాత్రమే గాక తిరుగుబాటు చేస్తున్నాడు. మన మధ్య ఈయన తిరస్కారంగా చప్పట్లు కొట్టి దేవునికి విరుద్ధంగా బోలెడన్ని మాటలు వదురుతూ ఉన్నాడు.