33
1 “యోబు! దయ ఉంచి నా మాటలు వినండి. నేను చెప్పే విషయాలన్నీ ఆలకించండి. 2 ఇటు చూడండి. నేను నోరు తెరుస్తున్నాను. నా నాలుక మాట్లాడడానికి సిద్ధంగా ఉంది.
3 నా మాటలు నా హృదయంలోని నిజాయితీని వెల్లడి చేస్తాయి. నా పెదవులనుంచి తెలివితేటలు ఉట్టిపడుతున్నాయి.
4 దేవుని ఆత్మ నన్ను సృజించాడు. అమిత శక్తిమంతుని శ్వాస నాకు జీవమిచ్చింది.
5 మీరు నాకు జవాబు చెప్పగలిగితే చెప్పండి, నా ముందు సిద్ధపడి వాదించండి.
6 చూడండి! దేవుని దృష్టిలో నేను మీలాంటి మనిషినే. నేనూ బంకమట్టితో చేయబడ్డవాణ్ణే.
7 నా భయం మిమ్మలనేమి బెదిరించదు. నా హస్తం మీ మీద బరువుగా పడదు.
8 నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఈ మాటలు నా చెవిని పడ్డాయి:
9 ‘నేను శుద్ధుణ్ణి, నిరపరాధిని, నిష్కళంకుణ్ణి – నాలో అక్రమమేమీ లేదు. 10 అయినా, దేవుడు నాలో తప్పులు చిక్కించుకోవాలని చూస్తున్నాడు. నన్ను శత్రువు క్రింద లెక్క కట్టాడు. 11 నా కాళ్ళకు బొండవేసి బిగించాడు. ఆయన నా ప్రవర్తన అంతా బాగా చూస్తున్నాడు.’
12 ఈ విషయంలో మీదే అన్యాయం! నేను మీకు జవాబు చెప్తాను చూడండి! దేవుడు మనిషికంటే గొప్పవాడు.
13 ఆయన విషయాలను గురించి ఆయన జవాబేమీ చెప్పకపోయినందుచేత ఆయనతో మీకెందుకు ఈ పోట్లాట?
14 దేవుడు ఒక సారి మాట్లాడతాడు! రెండు సార్లు మాట్లాడతాడు. అయితే, మనుషులు ఇది గుర్తించకపోవచ్చు.
15 కలలో, రాత్రివేళ కనిపించే దర్శనంలో మనుషులకు గాఢనిద్ర పట్టినప్పుడు, పడకమీద మనుషులకు మంచి నిద్ర పట్టినప్పుడు, 16 ఆయన వారి చెవులు తెరుస్తాడు. వారికి ఉపదేశం చేస్తాడు.
17 అందులో దేవుని ఆశయమేమిటంటే, మనిషి తన విధానాల నుంచి తొలగిపోవాలి. మనిషి గర్వం అతడికి దూరం కావాలి.
18 అతడి ప్రాణాన్ని నాశనం నుంచి తప్పించాలి. అతణ్ణి కత్తివాతకు గురి కాకుండా కాపాడాలి.
19 అతడు మంచం పట్టి బాధాకరమైన శిక్ష అనుభవించవచ్చు. అతడి ఎముకలకు తీవ్రమైన నొప్పులు ఎడతెగకుండా ఉంటాయి.
20 ఆహారం అంటే అతడికి వెగటు. రుచిగల భోజనం అంటే అతడికి సహించదు.
21 అతడి శరీరం కృశించిపోతుంది. వికారం అవుతుంది. లోపలి ఎముకలు బయటికి పొడుచుకు వస్తాయి.
22 అతడు సమాధికి సమీపంగా వస్తాడు. అతడి ప్రాణం మృత్యుదూతలకు చిక్కబోతుంది.
23 ఒకవేళ వేలకొలది దూతలలో ఒకడెవడైనా మనిషికి సరైనదేదో అది తెలియజేయడానికి అతడికి మధ్యవర్తిగా ఉంటే, 24 ఆయన అతడి మీద దయ చూపి ఈ విధంగా అంటాడు: ‘అతణ్ణి నాశనానికి వెళ్ళనియ్యకండి. అతణ్ణి తప్పించండి. విడుదల కలిగించే వెల నా దగ్గర ఉంది.’
25 అప్పుడు అతడి శరీరం పిల్లల శరీరంలాగా పూర్తిగా నయం అవుతుంది. చిన్నప్పటి రోజుల్లోలాగా అతడు ఆరోగ్యంగా ఉంటాడు.
26 అప్పుడతడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. దేవుడు అతణ్ణి దయతో స్వీకరిస్తాడు. అతడు దేవుని ముఖం చూచి ఆనందిస్తాడు. ఈ విధంగా అతడు మళ్ళీ నిర్దోషి అయ్యేలా దేవుడు చేస్తాడు.
27 అప్పుడతను సంతోషంగా మనుషుల ఎదుట ఇలా సాక్ష్యం చెపుతాడు, ‘నేను తప్పుదారి పట్టాను. న్యాయాన్ని తారుమారు చేశాను. అయినా తగిన శిక్ష నా మీద పడలేదు. 28 దేవుడు నా ప్రాణాన్ని నాశనానికి పోకుండా విడిపించాడు. నా బ్రతుకులో వెలుగు ప్రసరిస్తున్నది’.
29 ఇదిగో వినండి. దేవుడు ఇదంతా మనిషి పట్ల రెండు మూడు సార్లు జరిగిస్తాడు.
30 అతడి ప్రాణాన్ని నాశనం నుంచి తప్పించాలనీ, అతడిమీద జీవజ్యోతి ప్రకాశించాలనీ ఇందులో దేవుని ఆశయం.
31 యోబు! బాగా వినండి! నేను చెప్పేది ఆలకించండి. మీరు మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను.
32 మీరు ఏదైనా చెప్పాలనుకొంటే నాతో చెప్పండి. మాట్లాడండి. మీరు నిర్దోషుల లెక్కలోకి రావాలని కోరుతున్నాను.
33 మీరు చెప్పేదేమీ లేదంటారా, వినండి! నిశ్శబ్దంగా ఉండండి. నేను మీకు జ్ఞానోపదేశం చేస్తాను.