32
1 ✽యోబు తన దృష్టికి తాను నిర్దోషి గనుక ఆ ముగ్గురూ అతనికి జవాబు చెప్పడం మానివేశారు.2 ✽అయితే బరకేల్ కొడుకు ఎలీహు అక్కడ ఉన్నాడు. ఇతడు రమా వంశీయుడు, బూజ్ గోత్రంవాడు. అతడు యోబు మీద కోపంతో మండిపడ్డాడు. ఎందుకంటే, యోబు దేవుని కంటే తానే న్యాయవంతుడైనట్టు చెప్పుకొన్నాడు.
3 ✽అంతేకాదు. యోబు ముగ్గురు స్నేహితులమీద కూడా ఎలీహు మండిపడ్డాడు. యోబు వివాదాలకు జవాబు చెప్పకుండానే వారు అతని మీద నేరారోపణ చేశారు.
4 వారు ఎలీహుకంటే వయస్సులో పెద్దవారు. అందుచేత యోబుతో మాట్లాడడానికి ఇంతవరకు అతడు కనిపెట్టి ఉన్నాడు.
5 ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం చెప్పక పోవడంచేత ఎలీహుకు కోపం రగులుకొంది.
6 కాబట్టి బూజ్ గోత్రంవాడు, బరకేల్ కొడుకైన ఎలీహు ఈ విధంగా మాట్లాడాడు:
“నేను వయసులో చిన్నవాణ్ణి. మీరు పెద్దవారు. గనుక నాకు తెలిసినది మీకంటే ముందే చెప్పడానికి భయపడి తటపటాయించాను.
7 వృద్ధులు మాట్లాడడానికి తగినవారు. ఎక్కువ వయసు జ్ఞానం బోధించడానికి తగినది అని నేను అనుకొన్నాను.
8 ✽అయినా, మనుషులకు ఆత్మ ఉంది. అమిత శక్తిమంతుని ఆత్మ మూలంగా మనిషికి గ్రహింపు కలుగుతుంది.
9 వృద్ధులు మాత్రమే జ్ఞానులు కారు. ఎక్కువ వయసు ఉన్నవారికి కూడా ఒక్కొక్కప్పుడు న్యాయం తెలియదు.
10 అందుచేత నేను చెప్పేదేమిటంటే, నేను కూడా నాకు తెలిసినది తెలియజేస్తాను, వినండి.
11 నేను మీ మాటలకోసం ఎదురు చూశాను. మీ వాదోపవాదాలు విన్నాను. మీరు మాటలకోసం వెదుకుతూ ఉంటే, 12 ✽నేను శ్రద్ధగా విన్నాను. అయితే మీలో ఎవరూ యోబు చెప్పినదాన్ని కాదనలేదు. మీలో ఎవరూ ఆయన వాదాలకు జవాబు చెప్పలేదు.
13 జ్ఞానం మాకు లభించినదనీ, మనుషులకు అతడు అసాధ్యుడు, దేవుడే అతణ్ణి జయించాలనీ అనుకోకండి.
14 యోబు తన మాటలతో నాతో వాదం పెట్టుకోలేదు. మీ వాదాలు ఆధారంగా నేనాయనకు జవాబు చెప్పను.
15 వారు తల్లడిల్లిపోయారు. వారు జవాబు చెప్పడం మానివేశారు. చెప్పడానికి మాటలే వారికి దొరకవు.
16 వారు ఊరుకున్నారు. జవాబు చెప్పడం లేదు. వారు మాట్లాడరని నేనూ ఊరుకోవాలా?
17 నా వంతుకు నేనూ జవాబు చెప్తాను. నాకు తెలిసిన దానిని నేనూ తెలియజేస్తాను.
18 ✽నాకు నిలువెల్లా మాటలు నిండి ఉన్నాయి. నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తూవుంది.
19 నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలాగా ఉంది. అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొత్త తిత్తిలాగా ఉంది.
20 నేను మాట్లాడితేనే గాని, నా బాధ ఉపశమించదు. నా పెదవులు తెరచి జవాబు చెప్పాలి.
21 ✽వినండి, నేను ఎవరిపట్లా పక్షపాతిని కాను. నేను ఎవరినీ ముఖస్తుతి చేయను.
22 పొగడ్తలు నాకు చేతకాదు. అలా చేస్తే నా సృష్టికర్త నన్ను త్వరలోనే తొలగించివేస్తాడు.