31
1 ✽“కన్యను తదేకంగా చూడకూడదని నేను నా కండ్లతో ఒప్పదం చేసుకొన్నాను.2 ఎందుకని? దేవుడిచ్చే ప్రతిఫలమేది? పరమ ప్రదేశాలలో ఉన్న అమిత శక్తిమంతుడు నియమించే వారసత్వం మాటేమిటి?
3 దుర్మార్గులకు విపత్తు రావడమే గదా! చెడుగు చేసేవాళ్ళు ఆపదకు గురి కావడమే గదా!
4 ✽దేవుడు నా తీరుతెన్నులు చూస్తూనే ఉన్నాడు గదా? నేను ఎన్ని అడుగులు వేసినదీ ఆయన లెక్కిస్తాడు గదా?
5 ✽దేవుడు నన్ను సరైన త్రాసులో పెట్టి తూస్తాడు గాక! అప్పుడు నా నిజాయితీని తెలుసుకొంటాడు.
6 ఒకవేళ నా నడతకు అబద్ధాలతో సంబంధం ఉంటే, నా పాదాలు మోసంచేసేందుకు వేగిరపడివుంటే, 7 నా పాదాలు త్రోవ తప్పి తప్పటడుగు వేసి ఉంటే, నా మనసు నా కండ్లను అనుసరించి ఉంటే, నా చేతులకు అపవిత్రత ఏదైనా అంటుకొనివుంటే, 8 నేను నాటిన విత్తనం పంట మరొకడు భుజిస్తాడు గాక! నేను నాటిన మొక్కలను పీకివేయడం జరుగుతుంది గాక!
9 ✽పరస్త్రీ నా హృదయాన్ని మరులుకొలిపివుంటే, నా పొరుగువాడి తలుపు దగ్గర నేను పొంచివుంటే, 10 నా భార్య వేరొకడి తిరగలి విసురుతుంది గాక! ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక!
11 ఎందుకంటే, అది దుర్మార్గం. అది న్యాయమూర్తుల దండనకు తగిన నేరం!
12 అది నాశనకరమైన అగాధంవరకు దహించివేసే అగ్నిలాంటిది. అది నా ఫలసాయాన్ని సమూల ధ్వంసం చేసి విడుస్తుంది.
13 ✽నా నౌకరు గానీ, నా పనికత్తె గానీ నా మీద ఫిర్యాదు చేసే పక్షంలో వారి ఫిర్యాదు నేను నిరాకరించి ఉంటే, 14 దేవుడే లేచేటప్పుడు నేనేమి చెయ్యగలను? లెక్క అప్పగించమని ఆయన చెప్పేటప్పుడు, ఆయనకు నేనేమి జవాబు చెప్పను?
15 తల్లి గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించాడు గదా? మాతృగర్భంలో మనలనందరినీ రూపొందించేవాడు ఆయన ఒక్కడే గదా?
16 ✽బీదలకు కావలసినది నేను బిగబట్టివుంటే, వితంతువుల దృష్టి మందగిలేలా నేను చేసివుంటే, 17 తల్లి దండ్రులు లేనివారికి నా ఆహారం ఏమీ ఇవ్వకుండా నేనొక్కణ్ణే తిని వుంటే, 18 ఎవడైనా బట్టలు లేక చస్తూవుండడం నేను చూస్తే, అక్కరలో ఉన్న వ్యక్తికి కప్పుకోవడానికి ఏమీ లేకపోవడం నా కంటబడితే, 19 అతడి అంతరంగం నన్ను దీవించకపోతే, నా గొర్రెల ఉన్ని వస్త్రాలు వారు వెచ్చగా కప్పుకొని ఉండకపోతే, 20 న్యాయసభలో నాకు పలుకుబడి ఉందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు లేనివారి మీద నేను చెయ్యి చేసుకొని వుంటే, 21 నా భుజం కీలు తప్పి, జారి పడుతుంది గాక! నా మోచేతికి ఎముక విరిగిపోతుంది గాక!
22 కానీ, నా చిన్నప్పటినుంచీ అనాథలు నా దగ్గర పెరిగారు. నన్ను తండ్రిగా భావించారు. నా తల్లి గర్భాన పుట్టినప్పటినుంచీ అలాంటివారికి త్రోవ చూపేవాణ్ణి.
23 దేవుని వైభవం ఎదుట నేను నిలవలేనని ఆయన నా మీదికి నాశనాన్ని పంపుతాడేమో అని భయపడేవాణ్ణి.
24 ✽ఒకవేళ బంగారాన్ని నేను నమ్ముకొని వుంటే, మేలిమి బంగారాన్ని ఉద్దేశించి ‘నువ్వే నాకు సంరక్షణ’ అని ఉంటే, 25 గొప్ప ఆస్తి ఉందనీ, నేను సంపాదించుకొన్న సమృద్ధి అయిన ధనం ఉందనీ అతిశయించివుంటే, 26 సూర్యమండల ప్రకాశాన్ని నేను చూచి, శోభతో చంద్రగోళం సాగిపోతూవుండగా చూచి, 27 నా హృదయంలో రహస్యంగా మరులుకొని వాటిని భక్తిపూర్వకంగా నా చేసంజ్ఞ చేసివుంటే, 28 ఇదంతా కూడా న్యాయమూర్తి శిక్షించవలసిన నేరమే అవుతుంది, పైన ఉన్న దేవుని పట్ల నేను ద్రోహిని అవుతాను.
29 ✽నన్ను ద్వేషించినవాడికి నాశనం కలిగితే నేను సంతోషించే పక్షంలో, అతడికి కీడు వాటిల్లితే చూచి నేను ఆనందిస్తే –
30 నేను అలా చేయలేదు. అతణ్ణి శపించడానికి నా నోటికి సెలవియ్యలేదు. అతడి ప్రాణం మీదికి శాపం రప్పించలేదు.
31 ✽నా నివాసంలో ఉండేవారు ‘యోబు పెట్టినది తిని తృప్తి పొందనివారెవరు?’ అని పలకకపోతే ఏం?
32 నేను విదేశీయుణ్ణి బయట ఉండనియ్యలేదు. బాటసారులకు బార్లాగా నా తలుపులు తెరచి ఉంచాను.
33 ✽ఒకవేళ నేను ఆదాములాగా నా అతిక్రమాలు దాచి పెట్టుకొని, నా అపరాధాన్ని నా హృదయంలోనే అట్టే పెట్టుకొన్నానా?
34 ఆ కారణంగా పెద్ద గుంపుకు భయపడి, కుటుంబాల తిరస్కారానికి బెదిరి, తలుపు దాటి బయటికి వెళ్ళకుండా ఉండేవాణ్ణా? అలా చేసివుంటే, పైన ఉన్న దేవునిపట్ల నేను ద్రోహం చేసినవాడినవుతాను.
35 ✽నా మొర వినడానికి ఎవడైనా నాకు ఉంటే ఎంత బావుండేది! ఇదిగో నా సంతకం! అమిత శక్తిమంతుడు నాకు జవాబు చెపుతాడు గాక! ఇదిగో నా ఫిర్యాదీ నా మీద మోపిన ఫిర్యాదు రాస్తాడు గాక!
36 నేను దాన్ని నా భుజం మీద తప్పక మోస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకొంటాను.
37 నా అడుగుల లెక్క ఆయనకు నివేదిస్తాను. రాజులాగా నేనాయనను సమీపిస్తాను.
38 ✽నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేస్తే, భూమి చాళ్ళు అన్నీ ఏడుస్తూవుంటే, 39 దాని వెల చెల్లించకుండా దాని ఫలసాయం నేనే మింగివేసి వుంటే దాని రైతులకు ప్రాణాపాయం కలిగించి ఉంటే, 40 గోధుమలకు బదులుగా ముళ్లు, యవలకు బదులుగా కలుపుమొక్కలు మొలుస్తాయి గాక!
యోబు మాటలు సమాప్తం.