30
1 ✽“ఇప్పుడు నాకంటే వయసులో చిన్నవాళ్ళు నన్ను వేళాకోళం చేస్తున్నారు. వీరి తండ్రులు నా మందలను కాచే కుక్కలతో ఉండటానికి తగినవాళ్ళు కాదని అప్పుడు అనుకొనేవాణ్ణి.2 వాళ్ళు నీరసించిపోయినవాళ్ళు. వాళ్ళ చేతుల బలం నాకేం లాభం?
3 దరిద్రంచేత ఆకలితో బక్కచిక్కిపొయ్యారు వాళ్ళు. ఎడారిలో, ఎంతో కాలంగా పాడైపోయిన నిర్జన స్థలంలో, తిండికోసం వాళ్ళు తిరుగులాడుతూ ఉండేవాళ్లు.
4 అడవిలోని తుత్తిచెట్ల ఆకులు మేసేవాళ్ళు. తంగేడి వేళ్ళు తినేవారు.
5 ప్రజలు తమ మధ్యనుంచి వాళ్ళును తరిమికొట్టారు. దొంగలను తరిమి కేకలు వేసినట్టు వీళ్ళ వెంటబడి కేకలు పెట్టారు.
6 భయంకరమైన లోయలలో, నేల సందుల్లో, బండల సందుల్లో వాళ్ళు నివసించవలసి వచ్చింది.
7 పొదలలో గాడిదల్లాగా వాళ్ళు ఓండ్రలు పెట్టారు. ముళ్ళ పొదల క్రింద వాళ్ళు పోగయ్యారు.
8 వాళ్ళు మూర్ఖులకు, అనామకులకు పుట్టినవారు. వాళ్ళను దేశంలో నుంచి తరిమివేయడం జరిగింది.
9 అలాంటివాళ్ళ కొడుకులు ఇప్పుడు నా గురించి అవహేళనగా పాటలు పాడుతున్నారు. నేను వాళ్ళ దృష్టిలో ఓ సామెతనైపోయాను.
10 వాళ్ళు నన్ను అసహ్యించుకొంటున్నారు. నాకు దూరంగా తొలగిపోతున్నారు. నన్ను చూచి ఉమ్మి వేయడానికి వెనకాడరు.
11 దేవుడు నా వింటినారి విప్పాడు. ఆయన నన్ను బాధకు గురి చేశాడు. గనుక వాళ్ళు నాకు లోబడకుండా కళ్ళెం వదిలించు కొంటున్నారు.
12 నా కుడిప్రక్కను అల్లరిమూక లేచింది. వాళ్ళు నా కాళ్ళు జారేలా చేస్తున్నారు. పట్టణాన్ని ముట్టడించినట్లు నన్ను నాశనం చేయడానికి నా మీద తమ ప్రయత్నాలన్నీ ప్రయోగిస్తున్నారు.
13 వాళ్ళు నిస్సహాయులు. అయినా, నా మార్గాన్ని పాడు చేస్తున్నారు. నా మీదికి వచ్చిన విపత్తును అధికతరం చేస్తున్నారు.
14 పెద్ద గండిపడి, ప్రవాహం పారినట్లు వాళ్ళు వచ్చిపడతారు. నాశనమైపోయిన నా స్థలంలోకి దొమ్మిగా చొరబడతారు.
15 ✝భయంకరమైనవి నా మీద పడ్డాయి. నా పేరు ప్రతిష్ఠలు గాలికి కొట్టుకుపోయినట్లయింది. మేఘంలాగా నా సంక్షేమం కాస్తా అంతర్ధానమైపోయింది.
16 నా ప్రాణం నాలో కృశించి పోతూవుంది. బాధకాలం నన్ను చిక్కించుకొంది.
17 రాత్రిపూట నా ఎముకలు విరిచినట్లనిపిస్తుంది. నన్ను వేధించే నొప్పులకు నిద్ర ఉండదు.
18 విపరీత రోగంచేత నామీది వస్త్రాలు వికారమై పొయ్యాయి. నా రోగం మెడచుట్టూ చొక్కాలాగా నన్ను బిగించివేస్తూవుంది.
19 అది నన్ను బురదలోకి పడనెట్టింది. నేను దుమ్ము, బూడిద అయిపొయ్యాను.
20 ✽దేవా, నీకు ఆక్రందన చేస్తున్నాను గాని, నీవు బదులు చెప్పడం లేదు. నేను నిలుచుంటే నీవు నన్ను ఎగాదిగా చూస్తున్నావు, అంతే.
21 ✝నీవు నా పట్ల ఎంతో కఠినుడుగా అయిపొయ్యావు. నీ చేతిబలం వినియోగించి, నన్ను హింసిస్తూవున్నావు.
22 గాలితో నన్ను లేవనెత్తుతున్నావు. గాలిమీద నేను కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫాను మూలంగా నేను హరించుకుపోయేలా చేస్తున్నావు.
23 ✝మరణానికి, జీవులందరికి నిర్ణయించబడ్డ స్థలానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు!
24 ✽పడిపోయినవాడు చెయ్యి చాపడా? ఆపదలో ఉన్న మనిషి కాపాడమని సహాయంకోసం ఆక్రందన చెయ్యడా?
25 ✽బాధలో ఉన్నవారి కోసం నేను ఏడ్చాను గదా? దరిద్రంలో ఉన్నవారికోసం నేను శోకించలేదా?
26 అయినా, నాకు మేలు చేకూరుతుందని నేను ఆశించినప్పుడు కీడే సంభవించింది. వెలుగు కోసం నేను ఎదురు చూశాను. కాని, నాకు వచ్చింది చీకటే.
27 ✝నేను ఆంతర్యంలో అశాంతితో అలమటించి పోతున్నాను. బాధలు ముంచుకు వచ్చే రోజులు ఎదురయ్యాయి.
28 సూర్య ప్రకాశం లేకుండా కుమిలిపోతూ తిరుగుతున్నాను. సమాజంలో నిలబడి సహాయంకోసం నేను ఆక్రందన చేస్తున్నాను.
29 ✽నేను నక్కలకు సోదరుణ్ణి అయ్యాను. నిప్పుకోళ్ళకు చెలికాణ్ణి అయ్యాను.
30 నా చర్మం నల్లబడి, ఒలుచుకుపోతూవుంది. వేడివల్ల నా ఎముకలు మండిపోతూవున్నాయి. 31 ✽నా తంతి వాద్యం శోకనాదాన్ని ఒలికిస్తూ ఉంది. నా పిల్లనగ్రోవి దుఃఖధ్వని చేస్తూవుంది.