29
1 యోబు ఇంకా కావ్యరూపంలో చెప్పుకుపోయాడు:
2 “గడిచిన నెలల్లోలాగే, దేవుడు నన్ను కాపాడే రోజుల్లోలాగే నేనుండగలిగితే ఎంతో బాగుండేది!
3 అప్పుడు ఆయన దీపం నా తలపై వెలుగుతూ ఉండేది. ఆయన వెలుగుతో నేను చీకట్లో కూడా తిరుగాడగలిగేవాణ్ణి.
4 ఆరోజుల్లో నాకు పరిపక్వమైన స్థితిగతులుండేవి. అలా నేనిప్పుడు ఉండగలిగితే ఎంతో బావుండేది! అప్పుడు నా డేరాకు పైగా దేవుని సహవాసం ఉండేది.
5 అమిత శక్తిమంతుడు అప్పుడు ఇంకా నాకు తోడుగా ఉండేవాడు. నా పిల్లలు నా చుట్టు ఉండేవారు.
6 నేను వేసిన అడుగెల్లా నేతిలోనే పడేది! నా కోసం నూనె బండలో నుంచి ప్రవహించేది.
7 ఊరి ముఖద్వారానికి నేను వెళ్ళినప్పుడు, నడివీధిలో నా స్థానం మీద కూర్చున్నప్పుడూ, 8 యువకులు నన్ను చూచి అవతలికి వెళ్ళేవారు. వృద్ధులు లేచి నిలిచేవారు.
9 అధికారులు నోటి మీద చెయ్యి ఉంచుకొనేవారు, నోళ్ళు మూసుకొనేవారు.
10 ప్రధానులు మాటలుడిగి మౌనంగా ఉండేవారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనేది.
11 నా సంగతి చెవిని పడితే ప్రతివాడూ నన్నూ ధన్యజీవి అనేవారు, నన్ను చూచిన ప్రతి ఒక్కరూ నా గురించి మంచి సాక్ష్యం చెప్పేవారు.
12 ఎందుకని? సహాయంకోసం మొర పెట్టిన బీదలను, దిక్కులేని అనాథలను నేను విడిపించాను.
13 నాశనమైపోవడానికి సిద్ధంగా ఉన్నవారి ఆశీర్వాదాలు నా మీదికి వచ్చాయి. వితంతువుల హృదయాలకు నేను సంతోషం చేకూర్చాను.
14 నీతి నిజాయితీ నేను ధరించిన దుస్తులు! అది నన్ను ధరించింది. న్యాయసమ్మతమైన నా ప్రవర్తన నాకు వస్త్రం, తలపాగా.
15 గుడ్డివాళ్ళకు నేను కన్నులాగా ఉండేవాణ్ణి. కుంటివారికి నేనే కాళ్ళు.
16 దరిద్రులకు నేను తండ్రిని. పరాయివారికి న్యాయ సమ్మతంగా వ్యాజ్యమాడిపెట్టాను.
17 అక్రమస్థుల పళ్ళు రాలగొట్టాను. వాళ్ళ కోరలలో నుంచి కొల్లసొమ్ము లాగివేశాను.
18 అప్పుడు నేననుకొన్నాను – ‘హంసలాగా నేను చాలా కాలం బ్రతికి, నా గూటి దగ్గరే చనిపోతాను, 19 నా వేరుల చుట్టు నీళ్ళు ప్రసరిస్తాయి, రాత్రంతా మంచు నా కొమ్మల మీద నిలుస్తుంది, 20 నాకు ఎప్పటికీ గౌరవమర్యాదలు ఉంటాయి, నా విల్లు నా చేతిలో ఎప్పుడూ బలంగానే ఉంటుంది.
21 అప్పుడు మనుషులు నా మాటలు వినడానికి ఆశతో చెవి ఒగ్గివుండేవారు. మౌనంగా నా సలహాలు వినాలని పడివుండేవారు.
22 నేను మాట్లాడిన తరువాత వారు మళ్ళీ మాట్లాడేవారు కాదు. నా మాటలు వారి మీద కురిసాయి.
23 వాన కోసం కనిపెట్టుకొన్నట్టు వారు నా కోసం ఎదురు చూచేవారు. చిట్టచివరి వర్షబిందువు కోసమా అన్నట్టు వెడల్పుగా నోరు తెరచుకొని ఉండేవారు.
24 వారు నిరాశకు లోనైవుంటే, వారిని చూచి నేను దయతో మందహాసం చేసేవాణ్ణి. నా ముఖకాంతి లేకుండా వారేమీ చేసేవారు కారు.
25 నేను వారికి పెద్దగా కూర్చునేవాణ్ణి. వారి కోసం మార్గం ఎన్నుకొన్నాను. నేనప్పుడు సైన్యంలో రాజులాగా ఉండేవాణ్ణి. శోకంలో ఉన్నవారికి ఓదార్పు కలిగించేవాణ్ణి.