28
1 ✽“వెండికి గని ఉంది. బంగారాన్ని పుటం వేయడానికి స్థలం ఉంది. 2 ఇనుము భూమిలో నుంచి తీస్తారు. రాళ్ళు కరిగించి రాగి తీస్తారు.3 మనుషులు చీకటికి అంతం✽ కలిగిస్తారు. కటిక చీకటిలో, చావునీడలాంటి అంధకారంలో రత్నాలను వెదుకుతారు. భూమిలో చాలా లోతుగా వెదుకుతారు.
4 మనుషులులేని చోట్ల సొరంగాలు తవ్వుతారు. మనుషులు మరచిపోయే స్థలాలలో మనుషులకు దూరంగా ఉండి, అటూ, ఇటూ ఊగులాడుతూ✽ ఉంటారు.
5 ✽భూమి లోనుంచి ఆహారం వస్తుంది. మంటలవల్ల అయినట్టు భూగర్భంలో మార్పులు కలుగుతూ ఉన్నాయి.
6 దాని రాళ్ళలో నీలమణులు ఉంటాయి, దాని మట్టిలో బంగారం ఉంది.
7 ✽వేటాడే పక్షులకు దాని త్రోవ తెలియదు. అది డేగ కండ్లకు కూడా కనబడదు.
8 గర్వం గల క్రూర మృగాలు ఆ దారి తొక్కలేదు. సింహం ఆ మార్గాన నడువలేదు.
9 మనుషులు చెకుముకి రాతిలాంటి బండలు చేతపట్టుకొంటారు. కొండలను కూడా వాటి పునాదులతో పెళ్ళగించివేస్తారు.
10 బండల్లో గుండా కాలువలు తవ్వుతారు. వారి కన్ను విలువైన ప్రతిదాన్ని పసికడుతుంది.
11 నదులు పారకుండా చేసి మరుగుపడి ఉన్నదాన్ని వారు బహిర్గతం చేస్తారు.
12 ✽ఇంతకూ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహింపు లభించే స్థలం ఏది?
13 మనుషులకు దాని విలువ తెలియదు. సజీవుల లోకంలో అది దొరకదు.
14 మహా జలాగాధం అంటుంది – ‘అది నాలో లభించదు.’ సముద్రం ‘అది నా దగ్గర లేదు’ అంటుంది.
15 ✝మేలిమి బంగారాన్ని ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోవడం జరగదు. వెండి కొల పోసి దాన్ని ఖరీదు చేయలేము.
16 జ్ఞానం ఓఫీర్ బంగారానికి గానీ, విలువైన మిశ్రమ రత్నాలకు గానీ, నీలానికి గానీ దొరికేది కాదు.
17 బంగారం గానీ స్పటికం గానీ దానికి సాటికావు. అమూల్యమైన సువర్ణాభరణానికి కూడా లభించదది.
18 పగడాలు, ముత్యాలు, వీటిని గురించి దాని ఎదుట పేర్కొనవలసిన అవసరమే లేదు. జ్ఞానం కెంపుల విలువను మించినది.
19 కూషులో దొరికే పుష్యరాగం దానికి సమానం కాదు. స్వచ్ఛమైన బంగారానికి కూడా అది దొరికేది కాదు.
20 ✽మరైతే, జ్ఞానం ఎక్కడనుంచి వస్తుంది? అవగాహనం లభించే స్థలమేది?
21 అది సజీవుల కన్నులకు కనిపించదు. గాలిలో ఎగిరే పక్షులకు కూడా అది గోచరం కాదు.
22 నాశనమూ, మృత్యువూ అంటాయి గదా – ‘మేము దాన్ని గురించిన వదంతి మాత్రమే విన్నాం’.
23 దేవునికే దాని మార్గం తెలుసు. దాని స్థలం ఆయనకే తెలుసు.
24 ✽ఆయన భూదిగంతాలవరకు చూస్తూ ఉన్నాడు. ఆకాశం కింద ఉన్నదంతా ఆయనకు కనిపిస్తుంది.
25 గాలి బరువు ఆయన నిర్ధారణ చేసినప్పుడు, జలాల కొలత నిర్ణయించినప్పుడు, 26 వర్షపాతానికి నియమాలు ఏర్పరచినప్పుడు, ఉరుములకూ, మెరుపులకూ దారి ఏర్పరచినప్పుడు, 27 జ్ఞానాన్ని చూస్తూ ఆయన దాన్ని అంచనా కట్టాడు. దాన్ని పరిశోధించాడు, సుస్థిరం చేశాడు.
28 ✽మానవులకు ఆయన ఇలా చెప్పాడు: యెహోవా పట్ల భయభక్తులు ఉండడమే జ్ఞానం. దుర్మార్గం విసర్జించడమే తెలివి.