27
1 యోబు ఇంకా కావ్యరూపంలో ఇలా చెప్పుకు పోయాడు: 2 “నా హక్కులను తొలగించివేసిన దేవుని జీవం మీద నేను ప్రమాణం చేసి చెపుతున్నాను, నన్ను దుఃఖానికి గురిచేసిన అమిత శక్తివంతుని మీద ప్రమాణం చేసి చెపుతున్నాను–
3 నాకు ప్రాణం ఉన్నంతవరకూ, దేవుడిచ్చే ఊపిరి నా ముక్కుపుటాలలో ఉన్నంతవరకూ 4 నా పెదవులు అబద్ధం చెప్పవు, నా నాలుక మోసం పలకదు.
5 మీరు చెపుతున్నది న్యాయసమ్మతమని నేను అసలు ఒప్పుకోను, చచ్చేదాకా నా నిజాయితీని కాదనను, 6 నా నిర్దోషత్వాన్ని బలంగా అంటిపెట్టుకుంటాను. దానిని ఎన్నడూ వదిలిపెట్టను. నేను బ్రతికినన్నాళ్ళూ నా అంతర్వాణి నన్ను తూలనాడదు.
7 నా పగవాళ్ళు దుర్మార్గులుగా కనబడుతారు గాక! నా మీదికి ఎగబడేవాళ్ళు అన్యాయస్థులుగా కనిపిస్తారు గాక!
8 దైవభక్తి లోపించినవాడికి అతడు అంతరించి పోతూవుంటే, దేవుడు అతడి ప్రాణం తీసివేస్తూవుంటే, ఆశాభావం ఇంకెక్కడిది?
9 అతడిమీదికి విపత్తు వస్తే దేవుడు అతడి మొర ఆలకిస్తాడా?
10 అతడికి అమిత శక్తిమంతుని మూలంగా ఆనందం కలుగుతుందా? అన్ని వేళలా అతడు దేవునికి ప్రార్థన చేస్తాడా?
11 దేవుని హస్తాన్ని గురించి నేను మీకు ఉపదేశం చేస్తాను. అమిత శక్తిమంతుని విధానాన్ని నేను చెప్పకుండా దాచిపెట్టను.
12 మీరంతా అది చూశారు. వెర్రి ఊహలు ఎందుకు పెట్టుకొంటారు?
13 దుర్మార్గులకు దేవుడు నియమించిన భాగం ఏమిటంటే, దౌర్జన్యపరులు అమిత శక్తిమంతుని దగ్గరనుంచి పుచ్చుకోవలసినది ఇది –
14 వాళ్ళ సంతానం సంఖ్యలో అధికం అవుతూ ఉన్నారంటే, కత్తివాతకు గురి కావడానికే! వాళ్ళ సంతానానికి చాలేటంత భోజనం దొరకదు.
15 వాళ్ళ తరువాత బ్రతికి ఉన్నవాళ్ళు ఘోరవ్యాధివల్ల సమాధిపాలవుతారు. వాళ్ళు వితంతువులు కూడా ఏడవరు.
16 వాళ్ళు వెండిని దుమ్ము పోగు చేసినట్టు సమకూర్చుకొన్నా, బంకమట్టి కుప్పలాగా బట్టలను పోగు చేసుకున్నా, 17 పోగు చేసినది వీళ్ళన్న మాటే గాని, వాటిని కట్టుకొనేది న్యాయవంతులు మాత్రమే! నిర్దోషులు ఆ వెండిని తమలో తామే పంచుకొంటారు.
18 కీటకం కట్టుకొన్నట్టు వాళ్ళు ఇల్లు కట్టుకొంటారు. కావలివాడి గుడిసెలాగా వాళ్ళు గృహం నిర్మించుకొంటారు.
19 వాళ్ళు ధనికులై, ఒక సారి పడుకొంటారు. మళ్ళీ వాళ్ళు లేవరు. కళ్ళు తెరిచేలోపుగానే వాళ్ళు అంతరించిపోతారు.
20 భయం వరదల్లాగా కమ్ముకొంటుంది. రాత్రి పూట తుఫానులో వాళ్ళు కొట్టుకుపోతారు.
21 తూర్పు గాలులు వాళ్ళను తీసుకుపోతాయి. వాళ్ళు లేకుండా పోతారు. అవి వాళ్ళు ఉన్న చోటనుంచి వాళ్ళను తుడిచి పెట్టివేస్తుంది.
22 నిర్దాక్షిణ్యంగా దేవుడు వాళ్ళ మీద బాణాలు వేస్తాడు. ఆయన చేతినుంచి తప్పించుకు పారిపోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు.
23 మనుషులు వాళ్ళను చూచి ఎగతాళిగా చప్పట్లు కొడతారు. వాళ్ళు తమ స్థానంనుంచి ‘ఛీ’కొట్టి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తారు.