26
1 ✽అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు:2 “దిక్కులేనివాడికి ఎంత సహాయం చేశావు నీవు! బలం లేనివాడి చేతిని ఎంత బాగా పైకెత్తావు!
3 తెలివిలేనివాడికి ఎంత మంచి సలహా ఇచ్చావు! ఎంత పరిజ్ఞానం తెలియజేశావు!
4 ఎవరితో నీవు మాట్లాడావు – ఎవరి ఆవేశం నీ నోటిచేత ఈ మాటలు వెలువరించింది?
5 ✽సముద్రం క్రింద, అందులో ఉన్న వాటన్నిటి క్రిందుగా చచ్చినవారు అల్లాడిపోతున్నారు.
6 మృత్యులోకం నగ్నదృశ్యం దేవునికి కనబడుతుంది. నాశనకరమైన అగాధం ఆయనకు విస్పష్టమే!
7 ✽శూన్యం మీదుగా ఉత్తరాన అంతరిక్షాన్ని బార్లాగా పరచి ఉంచాడాయన. శూన్యంలో భూమి వ్రేలాడేలా చేశాడాయన.
8 మేఘాలలో నీళ్ళను బంధించి ఉంచాడు. అయినా వాటి భారానికి మేఘాలు చినిగిపోవు.
9 పున్నమిని మరుగు చేసేందుకు మేఘాలతో చంద్రగోళాన్ని కప్పివేస్తాడు.
10 సముద్రాల మీద దిక్చక్రం రూపొందించాడు. వెలుగుకు చీకటికి మధ్య హద్దు ఏర్పరచాడు.
11 ఆయన మందలింపుకు ఆకాశ స్తంభాలు విస్తుపోయి, గజగజ వణుకుతాయి.
12 ✽ఆయన బలంచేత సముద్రం రేగింది. తన వివేకం చేత రాహాబును ముక్కలుగా చీల్చాడు.
13 ఆయన ఆత్మవల్ల ఆకాశం అందంగా అవుతుంది. పారిపోతున్న సర్పాన్ని ఆయన చేతిలో పొడిచివేశాడు.
14 ✽ఇవి ఆయన విధానాలకు అంచులు మాత్రమే. ఆయనను గురించి మనకు వినిపిస్తున్నది చాలా తక్కువ. ఉరుములాగా గర్జించే ఆయన మహా బలాన్ని ఎవరు గ్రహించగలరు?