24
1 “అమిత శక్తిమంతుడు తీర్పు కాలాన్ని ఎందుకు నిర్ణయించడు? ఆయనను ఎరిగినవారు అలాంటి ఆయన రోజులు ఎందుకు చూడలేకపోతున్నారు?
2 మనుషులు సరిహద్దు రాళ్ళను తీసిపారేస్తారు. మందలను దొంగిలిస్తారు. వాటికి తామే కాపరులు అవుతారు.
3 అనాథల గాడిదలను తోలుకుపోతారు. విధవరాండ్ర ఎద్దులను తాకట్టు పెట్టుకొంటారు.
4 అక్కర గలవారిని దారినుంచి అవతలికి గెంటివేస్తారు. దేశంలోని పేద ప్రజలంతా మూకగా దాగుకోవలసి వస్తుంది.
5 అరణ్యంలోని అడవిగాడిదల్లాగా బీదవారు కడుపు కక్కుర్తికి అదేపనిగా వెదుకుతూ ఉంటారు. ఎడారి భూముల్లో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది.
6 పొలంలో తమ కోసం గడ్డి కోసుకొంటారు. దుర్మార్గుల ద్రాక్ష వనంలో క్రింద పడ్డ పండ్లను ఏరుకొంటారు.
7 బట్టలు లేక దిగంబరంగా రాత్రి అలాగే పడుకొంటారు. చలిలో కప్పుకోవడానికి వారికి ఏదీ లేదు.
8 పర్వతాల పై కురిసే జడివానకు వారు పూర్తిగా తడిసిపోతారు. నిలువనీడ లేని వీరు బండలను కౌగిలించు కొంటారు.
9 తండ్రి లేని పిల్లలను తల్లి రొమ్ముమీదనుంచి లాగివేయడం జరుగుతూవుంది. బీదల బట్టలను తాకట్టు పెట్టుకోవడం జరుగుతూ ఉంది.
10 బట్టలు లేకుండా, నగ్నంగా తిరుగుతారు వారు. కంకులు మోస్తారు గాని ఆకలితోనే ఉంటారు.
11 ఆవరణాలలోపల నూనె గానుగ ఆడిస్తారు. ద్రాక్ష గానుగను తొక్కుతారు. కాని దాహం తీర్చుకోలేక పోతారు.
12 పట్టణాలలో మనుషులు మూలుగుతున్నారు. గాయం తగిలినవారు సహాయంకోసం మొరపెట్టుకొంటున్నారు. అయినా, దేవుడెవరిమీదా నేరారోపణ చేయడం లేదు.
13 కొందరు వెలుగుమీదే తిరుగుబాటు చేస్తారు. వెలుగు త్రోవలు వీరికేమీ తెలియవు. ఆ దారుల్లో వీరు నిలవరు.
14 ఉదయం కాకముందే హంతకుడు లేస్తాడు. వాడు దీనావస్థలో ఉన్నవారిని, బీదలను చంపుతాడు. రాత్రిళ్ళు వాడు దొంగతనం చేస్తాడు.
15 మసక చీకట్లు ఎప్పుడు వస్తాయా అని వ్యభిచారి ఎదురు చూస్తాడు. ‘ఎవరి కంటికి నేను కనబడను లే’ అనుకొంటాడు. ముఖానికి ముసుకు వేసుకొంటాడు.
16 చీకట్లో ఇండ్లకు కన్నాలు వేస్తారు. పగలు తమ ఇండ్లలో ఉండి తలుపులు మూసివేస్తారు. వారికి వెలుగు అంటే ఇష్టం లేదు.
17 వాళ్ళంతా ఉదయాన్ని చావునీడగా భావిస్తారు. చావునీడ ఎంత భయంకరమైనదో వారికి తెలుసు.
18 నీళ్ళమీద వాళ్ళు వేగంగా కొట్టుకుపోతారు. భూమిమీద ఉన్నవాళ్ళ ఆస్తి శాపగ్రస్తం. ద్రాక్షతోటలు ఉన్నవైపు వాళ్ళు నడవరు.
19 నీటి ఎద్దడి, ఎండలు, వీటి మూలంగా మంచునీరు ఆవిరి అయి హరించుకుపోయినట్లు పాపాలు చేసినవారు మృత్యులోకంలోకి మాయమైపోతారు.
20 తల్లి గర్భం వారిని మరచిపోతుంది. పురుగులు వారిని తింటాయి. అక్రమస్థులు మళ్ళీ జ్ఞాపకానికి రారు. వాళ్ళు చెట్టులాగా విరిగి పడిపోతారు.
21 గొడ్రాండ్లను, పిల్లలు లేని స్త్రీలను వాళ్ళు బాధిస్తారు. వాళ్ళు వితంతువులకు సహాయమేమీ చెయ్యరు.
22 అయినా దేవుడు తన బలంతో అలాంటి బలాఢ్యులను కాపాడుతాడు. కొందరు ప్రాణంమీద ఆశలు వదులుకొన్నప్పుడు కూడా వాళ్ళు తిరిగి కోలుకుంటారు.
23 ఆయన వాళ్ళకు సంరక్షణ అనుగ్రహిస్తాడు. వాళ్ళు దానిమీద ఆధారపడతారు. వాళ్ళు నడిచే మార్గాన్ని ఆయన చూస్తూ ఉంటాడు.
24 వాళ్ళు పైస్థితికి ఎక్కుతారు. కొంచెం సేపు ఉన్నట్లే ఉంటారు. అంతలోకే లేకుండా పోతారు. వాళ్ళు హీనదశకు దిగుతారు. అందరిలాగే సమాధికి సమకూర్చబడతారు. పండిన కంకులు కోసివేసినట్టే అవుతుంది వాళ్ళ గతి!
25 ఇలా జరగడం లేదా? నేను అబద్ధికుణ్ణని ఎవరు రుజువు చేయగలరు? నా మాటలు వట్టివని చూపించేదెవరు?